పశ్చిమలో అత్యధిక సీట్లు గెలుస్తాం | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 11 2018 10:35 AM

We Will More Seats In West Godavari : YV Subba Reddy - Sakshi

సాక్షి, కొవ్వూరు : పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఆలోచన ఏపీ సీఎం చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై వైవీ నిప్పులు చెరిగారు. కేవలం దోచుకోవడం కోసమే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయం అని, ముడుపుల మాయగా అభివర్ణించారు. ప్రాజెక్టు పేరుతో ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ విమర్శలు ఎక్కుపెట్టారు.

కొత్త నిర్మాణ సంస్థకు నామినేషన్‌పై మూడు రెట్లు పెంచి ఇవ్వడం దోపిడీలో భాగమని సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతిని కాగ్‌ ఎండగట్టిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. 2019లోపు పోలవరాన్ని కేంద్రమే నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలోని హామీల అమలకు తుది వరకూ పోరాడతామని వైవీ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్‌ హామీలను కేంద్రం నెరవేర్చేంత వరకూ తమ పోరాటం ఆగదని తెలిపారు.

పశ్చిమ గోదావరిలో టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి తారాస్థాయికి చేరకుందని ఆయన విమర్శించారు. గత ఎన్నికల్లో 15 స్థానాల్లో టీడీపీని నెగ్గిస్తే అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజలను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. పశ్చిమ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందులో భాగంగానే ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన లభించిందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement