Sakshi News home page

ఆర్థికరంగ నివేదిక ఏమైంది!?

Published Mon, Apr 9 2018 1:41 AM

What is about financial sector report ?? - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికల్లో అత్యంత ముఖ్యమైన ఆర్థిక రంగం రిపోర్టును అసెంబ్లీకి సమర్పించకుండా దాచడంలో మతలబు ఏమిటో సీఎం చంద్రబాబు చెప్పాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యుడు, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డిమాండు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అంచనాలు పెంచుకుని దండుకున్న మొత్తం, విద్యుదుత్పత్తికి బొగ్గు కొనుగోళ్లలో గోల్‌మాల్‌ వ్యవహారాలు బయటకు పొక్కుతాయనే భయంతోనే ఈ రిపోర్టును దాచినట్లుందన్నారు. విచ్చలవిడిగా అప్పులు చేస్తూ  బాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఆయన విమర్శించారు.

కేంద్ర నిధులను, అప్పు చేసిన మొత్తాలను ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడారు. కాగ్‌ నివేదికల్లో ఆర్థిక విభాగం (ఎకనమిక్‌ సెక్టార్‌) రిపోర్టు చాలా ముఖ్యమైందని.. ఈ నివేదికను రిపోర్టు–4 అంటారన్నారు. మిగిలిన నివేదికల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం రిపోర్టు–4ను మాత్రం బహిర్గతం చేయలేదని విమర్శించారు. నివేదికలోని అంశాలకు భయపడే  బాబు టీడీపీ ఎంపీలను రాజీనామా చేయించకుండా ఆపించారా? అని ఆయన ప్రశ్నించారు.

2015 కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి హోదా అంశం ప్రస్తావన లేకపోవడాన్ని మా నేత వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో ప్రస్తావిస్తే.. ‘‘మీకు అనుభవం లేదు. విషయ పరిజ్ఞానంలేదు. ట్యూషన్‌ పెట్టించుకోండి..’’ అంటూ చంద్రబాబు హేళన చేశారు. అలాగే, ప్రత్యేక హోదా వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదని మేం చెబితే ‘‘ప్రతిపక్ష నేతకు, విపక్ష ఎమ్మెల్యేలకూ ఏమీ తెలియదు’’ అంటూ మమ్మల్ని దబాయించారు. ఇప్పుడు జరిగిన నష్టానికి  బాధ్యత సీఎం చంద్రబాబుదేనన్నారు.

Advertisement
Advertisement