సీఎం ప్రసంగం మధ్యలో హైడ్రామా.. విమర్శలు | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 2 2017 8:42 AM

Woman Dragged in Vijay Rupani Meeting Video Viral - Sakshi

అహ‍్మదాబాద్‌ : గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీకి ఊహించని ఝలక్‌ తగిలింది. ఓ సభలో ఆయన ప్రసంగిస్తున్న వేళ ఓ యువతి నినాదాలు చేయటం.. పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లటం రచ్చ రేపింది. ఆమె అమర వీరజవాన్‌ కూతురు కావటంతో ప్రభుత్వంపై విమర్శలు మరింతగా చెలరేగుతున్నాయి. 

విషయం ఏంటంటే... శుక్రవారం వడోదరా జిల్లాలోని కేవదియా కాలనీలో నిర్వహించిన ప్రచార సభలో విజయ్‌ రూపానీ ప్రసంగిస్తున్నారు. ఇంతలో రూపల్‌ తాద్వి(26) అనే యువతి సీఎం ప్రసంగానికి అడ్డు తగిలింది. తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేసింది. రూపల్‌, బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ అశోక్‌ తాద్వి కూతురు. అశోక్‌ విధినిర్వహణలో ప్రాణాలు వదిలారు.  

దీంతో ప్రభుత్వం ఆ కుటుంబానికి భూమిని ఇస్తామని ప్రకటించింది. కానీ, ఇంతవరకు ఆ హామీ నెరవేరకపోవటంతో ఆ కుటుంబం కష్టాలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆయన సభ విషయం తెలుసుకున్న రూపల్‌ అక్కడి గుంపులో కూర్చుంది. ప్రసంగం కొనసాగుతున్న వేళ ఒక్కసారిగా సీఎం వేదిక వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడే ఉన్న మహిళ కానిస్టేబుళ్లు ఆమెను లాక్కెళ్లారు. ‘నేను ఆయన్ని కలవాలి. నన్ను వదలండి’ అంటూ ఆమె అరుస్తున్నా.. పోలీసులు వదలకుండా ఈడ్చుకెళ్లారు. ఈ సమయంలో రూపానీ అదేం పట్టించుకోకుండా రాహుల్‌ గాంధీని విమర్శిస్తూ ప్రసంగం కొనసాగిస్తూనే ఉన్నారు.

రాహుల్‌ విమర్శలు... 

పరమ దేశభక్తుడిగా చెప్పుకునే విజయ రూపానీ ఒక జవాన్‌ కూతురిని ఈ విధంగా అవమానించటం దారుణమని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తన ట్విట్టర్‌ లో పేర్కొన్నారు. ఆ వీడియోను పోస్ట్ చేసిన రాహుల్‌ బీజేపీ అరాచకాలు తారాస్థాయికి చేరాయంటూ సందేశం ఉంచారు. ఆమెను ఈడ్చుకెళ్తున్న సమయంలో సీఎం ప్రసంగం కొనసాగించటం సిగ్గుచేటని రాహుల్‌ పేర్కొన్నారు. 

రూపాని వివరణ... 

ఇక తనపై వస్తున్న విమర్శలకు విజయ్‌ రూపానీ ట్విట్టర్‌ ద్వారానే స్పందించారు. సరిహద్దులో పహారా కాసే సైనికుల విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ మర్యాదపూర్వకంగానే వ్యవహరిస్తుందని రూపానీ పేర్కొన్నారు. వన్‌ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌, ఆదర్శ్‌ సోసైటీ స్కాంల ప్రస్తావన తీసుకొచ్చి కాంగ్రెస్‌ పార్టీపై ఆయన విమర్శలు చేశారు. అయితే సమావేశం ముగిసిన తర్వాత ఆయన రూపల్‌ను కలిసినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement