అధికారపార్టీ ఓ దొంగల ముఠా | Sakshi
Sakshi News home page

అధికారపార్టీ ఓ దొంగల ముఠా

Published Wed, Nov 1 2017 7:03 PM

YRSCP leader sudhakar babu takes on ap ministers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు దొంగల ముఠాగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. సహజ వనరుల్ని కొల్లగొట్టి సొమ్ము చేసుకోవడమే వీరి లక్ష్యమన్నారు. దేవాలయ భూముల్ని సైతం దిగమింగే ఈ ఘనుల్ని నాయకులనాలా? దొంగలనాలా? అని మండిపడ్డారు. ఆయన బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టారు. పాదయాత్రతో జనం ముందుకొస్తున్న తమ అధినేతను చూసి బెంబేలెత్తుతున్న అధికారపార్టీ వ్యూహాత్మకంగా తప్పుడు విమర్శలు చేస్తోందన్నారు. తమ అధినేతపై అసందర్భ ప్రేలాపనలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జగన్‌ను ఆషామాషీ మనిషిగా భావించవద్దని, 44 శాతం ఓట్లు సాధించిన పార్టీకి అధ్యక్షుడని ఆయన గుర్తుచేశారు. అధికారపార్టీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మామ అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అడ్డదారిలో గద్దె నెక్కిన చరిత్ర చంద్రబాబుదని సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు.

రైతుల ఆత్మహత్యలపై స్పందించరా?: నాగిరెడ్డి
రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర పోతోందని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం కన్వీనర్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరువు విషయంలో చంద్రబాబు తన రికార్డును తానే బద్దలు కొట్టారని ఎద్దేవా చేశారు. ఈ ఏడాది పత్తిసాగు పెరిగినా.. వర్షాలకు 90 శాతం పంట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గులాబీ రంగు పురుగు వేగంగా విస్తరించి.. పత్తి పంటను సర్వనాశనం చేస్తోందన్నారు. దీనిపై రైతులకు తగిన సలహాలివ్వాల్సిన ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదని మండిపడ్డారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement