చంద్రబాబు వస్తే కరువే | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వస్తే కరువే

Published Tue, Apr 9 2019 9:35 AM

YS Avinash Reddy Fires On Chandrababu Naidu In Election Campaign - Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు : చంద్రబాబు అధికారంలోకి వస్తే కరువే.  టీడీపీ ప్రభుత్వ హయాంలో పదును వర్షం కూడా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరువుకు రోల్‌ మోడల్‌గా చంద్రబాబు నిలిచారని వైఎస్సార్‌సీపీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. వర్షాలు లేక బోర్లలో భూగర్భ జలాలు అడుగంటి, సక్రమంగా పంటలు పండక, పండిన వాటికి గిట్టుబాటు ధర లేక రైతులు అవస్థలు పడుతున్నారన్నారు. ప్రొద్దుటూరు మండలంలోని దొరసానిపల్లె గ్రామంలో సోమవారం ఉదయం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డితోపాటు రోడ్డు షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ తన పార్లమెంట్‌ పరిధిలోని మూడు గ్రామ పంచాయతీలను దత్తత తీసుకోగా ఇందులో దొరసానిపల్లె ఒకటి అన్నారు. దత్తత గ్రామాలను ఎంపిక చేశాక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం నిధులు విడుదల చేయలేదన్నారు. దీంతో ఎంపీ కోటా కింద నిధులు విడుదల చేసి ఈ గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేపట్టానన్నారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో పోస్టుడేటెడ్‌ చెక్కులు ఇచ్చి మభ్యపెట్టారన్నారు.

ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఈ గ్రామంలో నివసిస్తున్న తాను నిత్యం మీకు అందుబాటులో ఉంటున్నానన్నారు. ఎవరు తనను ఆశ్రయించినా తన వంతు సహాయం చేస్తున్నాని తెలిపారు. వందకు ఒక్క ఓటు ఇతర పార్టీలకు పడినా తనకు బాధగా ఉంటుందని తెలిపారు. గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేశానని అన్నారు. శ్మశానవాటికకు కాంపౌండ్‌ నిర్మించడం, రూ.40లక్షలతో రైల్వేస్టేషన్‌కు సిమెంటు రోడ్డు, రూ.50లక్షలతో జమ్మలమడుగు మెయిన్‌ రోడ్డుకు సిమెంటు రోడ్డు నిర్మించామని, అధికారులపై ఒత్తిడి తెచ్చి కమ్యూనిటీ హాల్‌తోపాటు అంగన్‌వాడీ భవనాలను మంజూరు చేయించామన్నారు. తన గ్రామ మహిళలు ఇబ్బంది పడకుండా ఉండాలనే లక్ష్యంతో రూ.20లక్షలు సొంత నిధులు వెచ్చించి స్థలాన్ని కొని బోరు వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించానన్నారు.

సొంత డబ్బుతో దొరసానిపల్లె హైస్కూల్‌ విద్యార్థులకు సైకిళ్లు కొనుగోలు చేయించానని పేర్కొన్నారు. చెత్త సేకరణ కోసం రూ.7లక్షలు వెచ్చించి ట్రాక్టర్లను కొనుగోలు చేయించానని చెప్పారు. సుమారు రూ.2కోట్లు వెచ్చించి గ్రామ పంచాయతీలో సిమెంటు రోడ్లు నిర్మింపజేశానన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తే దొరసానిపల్లెను బృందావనంలా తయారు చేస్తానని తెలిపారు. ఏ పథకమైనా తన గ్రామ పంచాయతీ నుంచే ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమంలో దొరసానిపల్లె గ్రామ పంచాయతీ నాయకులు పాతకోట రామ్మోహన్‌రెడ్డి, గోపిరెడ్డి చిన్నరెడ్డి, ప్రాప్తం యాకోబ్, అనిల్, మార్తల నారాయణరెడ్డి, పాతకోట పునరుద్రారెడ్డి, నందం వెంకటసుబ్బయ్య, వంకం సుబ్బరాయుడు, శ్రీనుతోపాటు దనియాల గంగిరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఉండేల గురివిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు రామిరెడ్డి, తులసిరెడ్డి, కరాటె జయరామిరెడ్డి, మార్తల కృష్ణారెడ్డి, బుజ్జిబాబు, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, గంగిరెడ్డి మాధవరెడ్డి పాల్గొన్నారు.  

Advertisement
Advertisement