‘అచ్చెన్నాయుడు కక్ష సాధింపులు’ | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 19 2018 8:43 AM

YS Jagan 325th Day Praja Sankalpa Yatra Started - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: యలమంచిలి సర్పంచ్‌, గ్రామస్తులు పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాము వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమన్న సాకుతో మంత్రి అచ్చెన్నాయుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేశారు. యలమంచిలిలో చాలా మందికి పించన్లు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు, రేషన్‌ కార్డులు అందకుండా చేస్తున్నారని వాపోయారు. జన్మభూమి కమిటీల పేరుతో అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సరుగుడు తోటలను తగులబెట్టించారని కోమబొమ్మాళి వాసులు వైఎస్‌ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్ జగన్‌ సీఎం అయితే మంచి రోజులొస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీలో చేరిన టీడీపీ మాజీ సంర్పంచ్‌లు..
టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్‌లు యెన్ని జ్యోతి, మన్మధరావు, మాధవరావు పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.

మహానేతకు నివాళి..
కోటబొమ్మాళిలోని ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని స్థానిక నేతలతో వైఎస్‌ జగన్‌ ఆవిష్కరింపజేశారు. అనంతరం మహానేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నేతలు తమ్మినేని సీతారాం, దువ్వాడ నివాస్‌, పేరాడ తిలక్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌కు కొత్తపేటలో మహిళలు, గ్రామస్తులు దారిపొడవునా అపూర్వ స్వాగతం పలికారు. జన ప్రభంజనం ఆయన వెంట నడుస్తోంది.

పాదయాత్ర సాగుతోందిలా..
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 325వ రోజు బుధవారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని కొబ్బరిచెట్లపేట నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి జార్జంగి, కొత్తపేట, కోటబొమ్మళి, సీతన్నపేట మీదుగా దుర్గమ్మపేట వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. జననేతను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ, యువకులు పోటీపడుతున్నారు.

Advertisement
Advertisement