అధర్మంపై యుద్ధమిది | Sakshi
Sakshi News home page

అధర్మంపై యుద్ధమిది

Published Thu, Jan 10 2019 2:10 AM

YS Jagan comments in the Prajasankalpayatra Last Public Meeting - Sakshi

‘మీ అందరికీ నేనొక్కటే చెబుతున్నా.. నేను 3,600 కిలోమీటర్లకు పైగా నడిచా.. దారిపొడవునా ప్రతి పేదవాడి కష్టం చూశా.. ప్రతి పేదవాడి పరిస్థితిని ఎలా మెరుగు పరచాలనే ఆలోచనతోనే ఈ 14 నెలల సమయం గడిచి పోయింది. మామూలుగా ఒక సామెత ఎపుడూ చెబుతూ ఉంటారు. ఆరు నెలలు ఎవరితోనైనా కలిసి ఉంటే వాళ్లు వీళ్లవుతారు.. వీళ్లు వాళ్లవుతారు అని. 14 నెలలు పేదవాడితోనే ఉన్నాను. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా పేదవారి కష్టాలు వింటూనే, వారితో నడుస్తూనే, వారికి తోడుగా ఉంటూనే వారికి భరోసా ఇస్తూనే నడిచాను.  

గ్రామస్థాయిలో నవరత్నాలను ప్రతి పేదవాడి ఇంటికి చేరుస్తాం. నవరత్నాల్లో ప్రకటించిన పథకాలే కాకుండా రేషన్‌ బియ్యం కూడా నేరుగా లబ్ధిదారుడి ఇంటికి డోర్‌ డెలివరీ చేస్తాం. నవరత్నాల్లో పథకాల కోసం లబ్ధిదారులు ఎవరి చుట్టూ తిరగనవసరం లేకుండా, ఎవరికీ లంచం ఇవ్వకుండా నేరుగా ఆ లబ్ధిదారుడి ఇంటికి పథకాలు వచ్చేలా చేస్తామని హామీ ఇస్తున్నా. 

చంద్రబాబు ఏదైనా ఇరిగేషన్‌ ప్రాజెక్టు కానీ, ఏదైనా పని గానీ చేసేటప్పుడు ఆయన ఆలోచించేది కమీషన్లు ఎంతవస్తాయి, డబ్బులు ఎంత దోచుకుందామా అని చూస్తారు.మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. నాకు డబ్బంటే వ్యామోహం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా నా ఆలోచనలు ఉండవు. నా ఆలోచన ఒక్కటే. అధికారంలోకి వస్తే 30 సంవత్సరాలు ప్రజలకు మంచి చేయాలని.. 30 ఏళ్ల పాటు పాలించాలని నాకున్న ఆశ. జరిగిన మంచిని చూసి నేను చనిపోయిన తర్వాత నా ఫొటో ప్రజల ఇంట్లో నాన్న ఫొటోతో పాటు ఉండాలన్నది నా ఆశ. మన పార్టీ కో ఆర్డినేటర్లకు చెబుతా ఉన్నా. నవరత్నాలను ప్రతి ఇంటికి చేర్చండి. అప్పుడే చంద్రబాబు లంచాలతో సంపాదించిన సొత్తు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఎంత వెచ్చించినా కూడా ప్రజలు ఆ జరగబోయే మేలును చూసి చంద్రబాబు వద్ద డబ్బులు తీసుకుంటారు కానీ ఓట్లు మాత్రం వేయరు. నవరత్నాలు అందరికి కన్పించేలా ప్రతి గ్రామంలోనూ ఫ్లెక్సీలు పెట్టండి. 

రైతు తరఫున ప్రభుత్వమే బీమా ప్రీమియం కడుతుంది రైతుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతా ఉన్నా. ఇప్పటి వరకు ఏ సభలో చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ చెబుతున్నా. ప్రస్తుతం రైతుల బీమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తుపానులు, కరువు వచ్చినా ఇన్సూరెన్స్‌ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ఆ సొమ్ము వస్తుందో.. రాదో తెలియదు. ఎందుకు ప్రీమియం తీసుకుంటున్నారో తెలియదు. రైతన్నల తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్‌ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని చెబుతున్నా. ఇన్సూరెన్స్‌ కోసం రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇన్సూరెన్స్‌ సొమ్ము పేదవాడికి ఇచ్చేందుకు ప్రభుత్వమే కృషి చేస్తుందని ఈరోజు ఇక్కడ కొత్తగా చెబుతున్నా. ఆక్వా రంగానికి రూ. 1.50లకే విద్యుత్‌ ఇస్తామని ఇదివరకే చెప్పా. వీటన్నింటి వల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గుతుంది. 

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మరో మూడు నెలల్లో జరుగనున్న ఎన్నికల్లో నారాసురుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో, ఎల్లో మీడియాతో జరిగే యుద్ధంలో రాష్ట్ర ప్రజలందరూ తనకు తోడుగా నిలవాలని, తనను ఆశీర్వదించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. మనం చేయబోయే యుద్ధం ఒక్క నారాసురుడితోనే కాదని, ఆయనకు మద్దతిస్తున్న రెండు పత్రికలు, పలు టీవీ చానెళ్లపై కూడా అని జగన్‌ ప్రజలను అప్రమత్తం చేశారు. చంద్రబాబు మాదిరిగా తనకు డబ్బుపై వ్యామోహం లేదని, అయితే ఒక్కసారి అధికారంలోకి వచ్చాక 30 ఏళ్లపాటు రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి మంచి చేయాలని, 30 ఏళ్ల పాటు పరిపాలించాలనే తపన ఉందన్నారు. 

జిత్తులమారి, మాయావి అయిన చంద్రబాబు అనేక పొత్తులు పెట్టుకుంటారని, ఎన్నికల్లో ఆయన చేయని అన్యాయం అంటూ ఏమీ ఉండదని ఆయన ప్రజలకు వివరించారు. ప్రజలంతా ఈ యుద్ధంలో తనకు తోడుగా నిలిస్తే ఈ ఎన్నికల్లో జరిగే అన్యాయాలను, మోసాలన్నింటినీ జయిస్తానని జగన్‌ ధృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో మంచి రోజులు వస్తాయని, ఖాయంగా ప్రజావ్యతిరేక చంద్రబాబు పాలనను సాగనంపే సమయం ఆసన్నం అయిందని ధీమా వ్యక్తం చేశారు. 341 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసిన అనంతరం చివరి ఘట్టమైన ఇచ్ఛాపురంలో బుధవారం పాత బస్టాండు వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ఉత్తేజ పూరితంగా ప్రజలను, పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..   


 
యుద్ధం బాబుతోనే కాదు.. ఎల్లో మీడియాతో కూడా 
‘‘ఎన్నికలకు మరో మూడు నెలల సమయం ఉంది. ఈ మూడు నెలల కాలంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, తోడుగా రమ్మని కోరుతున్నాను. కారణం ఏమిటంటే.. ఎన్నికల్లో జరుగబోయే ఈ యుద్ధం ఒక్క చంద్రబాబునాయుడు వంటి నారా రాక్షసుడితో మాత్రమే కాదు. ఇతనికి తోడుగా ఎల్లో మీడియా ఉంది. వ్యవస్థలను మేనేజ్‌ చేసే పరిస్థితులు ఉన్నాయి. రెండు పత్రికలు, ఈ పెద్దమనిషికి తోడుగా ఉన్న అనేక చానెళ్లు.. వీటన్నింటితో కూడా యుద్ధం చేస్తున్నాం. ఇవన్నీ కాక ఈ జిత్తుల మారి మాయావి చంద్రబాబు ఎలాంటి పొత్తులైనా పెట్టుకుంటాడు. ఈ పెద్దమనిషి చేయని అన్యాయం, మోసం అంటూ లేదు. మీరు తోడుగా ఉంటే ఈ అన్యాయాలు, మోసాలన్నింటినీ జయిస్తాను. అందుకే నాడు తోడుగా ఉండి, ఆశీర్వదించమని ప్రతి అక్కా చెల్లెమ్మ, ప్రతి అవ్వా తాత, ప్రతి సోదరుడు, ప్రతి స్నేహితుడికి పేరు పేరునా విన్నవించుకుంటున్నా. మూడు నెలల్లో మంచి రోజులు వస్తాయని మాత్రం కచ్చితంగా చెబుతున్నాను.  
  
ఎంత మందికి భరోసా కల్పించామన్నదే ముఖ్యం.. 
హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ ఎంత దూరం ఉందో మీకు తెలుసా? అని ఇవాళ ఎవరో నాన్ను అడిగారు. ఎంత అని అడిగాను. 3 వేల కిలోమీటర్లు అని చెబుతూ.. మీరు 3,648 కి.మీ నడిచారన్నా అని చెప్పారు. అదే మాదిరిగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఎంత దూరం ఉందో మీకు తెలుసా అన్నా? అని కూడా అడిగారు. ఎంత? అని అడిగా.. అక్షరాలా 3,440 కి.మీ అని చెప్పారు. రికార్డులు దాటేసి ఏకంగా అంతకన్నా ఎక్కువ స్థాయిలో నడవగలిగాం అంటే నిజంగా ఇది కేవలం మీ ఆప్యాయతలు, ఆత్మీయతలు, పైనుంచి ఆ దేవుడి ఆశీస్సుల వల్లే జరిగాయని చెప్పటానికి ఏమాత్రం కూడా సంకోచించను. ఇవాళ ఎంతదూరం నడిచామన్నది ముఖ్యం కాదు.. ఎంతమందిని ప్రత్యక్షంగా కలిశాం? ఎంతమందికి మనం భరోసా ఇచ్చామన్నదే నిజంగా ముఖ్యమైన అంశం.  



మోసాల్లో చంద్రబాబు పీహెచ్‌డీ.. 
చంద్రబాబు నాయుడిగారి నాలుగున్నరేళ్ల పాలనలో ఎలాంటి పనులు చేశాడో చూశామన్నా. ఆయన చేసిన పరిపాలన గురించి ప్రజలు చెబుతూ ఉంటే, జరుగుతున్న అన్యాయాలను చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆందోళన కలుగుతోంది. ఒక వంక రాష్ట్రంలో కరువు ఇంకో వంక తుపాన్‌లు.. ఒక వంక రాష్ట్ర విభజన నష్టం.. ఇంకో వంక చంద్రబాబు నాయుడి గారి దోపిడీతో నష్టపోయిన రాష్ట్రం.. మరోవంక వ్యవసాయం దెబ్బతిని గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్న  పరిస్థితులు. మరోవంక రుణమాఫీ అంటూ చంద్రబాబు చేసిన మోసం.. ఒక వంక నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగం మరోవంక నిరుద్యోగ భృతి రెండు వేలు ఇస్తా ప్రతి నెలా అని చెబుతూ మోసగించిన చంద్రబాబు నైజం. ఒకవంక 2014 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడానికి చేసిన వాగ్దానాలు.. మరోవంక 650 వాగ్దానాలు తన మ్యానిఫెస్టోలో పెట్టి, ప్రతి పేజీ ఒక కులానికి కేటాయించి.. ప్రతి కులాన్ని ఎలా మోసం చేయాలి? అని పీహెచ్‌డీ చేసిన వ్యక్తి మరోవంక. ఆయన చేసిన హామీలు, మోసాలు మరోవంక.. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా గుండె మండుతూ ఉంటుంది. పిల్లల్ని అవిటివారిగా మార్చి అడుక్కునే వారికి, రాష్ట్రం కష్టాల్లో ఉందని పదేపదే చెబుతూ విచ్చలవిడిగా దోచుకుంటున్న ఈ చంద్రబాబు గారికి ఏమైనా తేడా ఉందా? అని మీ అందరి తరపున అడుగుతున్నా.  


 
ఐదెకరాల్లో అర బస్తా పండింది.. ఇదీ రెయిన్‌ గన్‌ నిర్వాకం 
బాబు పాలన మీద 14 నెలల నా పాదయాత్రలో అనుభవాలను కొన్నిటిని ఈరోజు మీతో పంచుకుంటా... అనంతపురం జిల్లాలో నాకు శివన్న అనే రైతు కలిశాడు. తన పొలంలో రెయిన్‌గన్ల నుంచి గురించి కథలు కథలుగా చెప్పాడు. చంద్రబాబు రెయిన్‌ గన్‌ అని చెప్పి చూపించిన సినిమా ఎలా ఉందో కంటికి కట్టినట్లుగా వివరించాడు. అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎలా కుదేలైపోయిందో, రైతులు ఎలా కూలీలుగా మారిపోయారో, లక్షల మంది ఎలా వలసలు వెళ్తున్నారో కళ్లారా చూశానని చెప్పాడు. శివన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ వద్ద పాదయాత్ర చేస్తున్నప్పుడు నా వద్దకు వచ్చాడు. ‘‘అన్నా రూ.90 వేలు అప్పు చేసి వేరుశనగ పంట వేశా’’ అని చెప్పాడు. మరి పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘‘అన్నా బాబు గారు వచ్చారు. బాబుగారితోపాటే ఇంకొకటి కూడా కలిసే వస్తుందన్నా ఎప్పుడు వచ్చినా చంద్రబాబుగారితోపాటు. అది.. బాబు వస్తే కరువు కూడా వస్తుందన్నా..’’ అని చెప్పాడు. ‘‘అన్నా.. యథాప్రకారం కరవు వచ్చిందన్నా. రైతులు విలవిలలాడుతున్నారన్నా. చంద్రబాబు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు కరువుతో చచ్చిపోతున్నామయ్యా... పంటలు ఎండిపోతున్నాయయ్యా.. సాయం చేయండయ్యా..’’ అని శివన్న చంద్రబాబు గారిని గట్టిగా అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా?.. ‘‘అయ్యో కరువు వచ్చిందా? నాకు ఇంతవరకు తెలియదే? నాకు ఎప్పడూ చెప్పలేదే’’ అని అధికారులను తిట్టారట రైతన్నల ఎదుట.

ఈ పెద్ద మనిషి చంద్రబాబు డ్రామా అంతటితో ఆగిపోలేదు. రెయిన్‌గన్లు అని మొదలు పెట్టాడు. పొలంలో రెయిన్‌గన్‌ ఏర్పాటు చేయడం కోసం అధికారులు యాధృచ్ఛికంగా శివన్నను ఎన్నుకున్నారు. ‘‘అన్నా అధికారులు నా దగ్గరకొచ్చారు. పంటలను కాపాడతామని పొలంలో రెయిన్‌గన్‌ సిద్ధం చేశారు. ఒక పంట కుంట తవ్వి టార్పాలిన్‌ వేశారు. ఒక ట్యాంకుతో నీళ్లు నింపారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చి రెయిన్‌ గన్‌ ప్రారంభించి అలా.. అలా.. నాలుగు నీళ్లు చల్లారు. ఫొటోలకు పోజులు కొట్టాడన్నా. చంద్రబాబు వెళ్లిపోయిన తరువాత భోజనం చేద్దామని మధ్యాహ్నం ఇంటికి వెళ్లానన్నా. అంతే.. అధికారులు టార్పాలిన్‌ మడత పెట్టేశారు. రెయిన్‌గన్‌ చంకన పెట్టుకుని వెళ్లిపోయారన్నా..’’ అని శివన్న చెప్పాడు. శివన్న సాయంత్రం పొలం వద్దకు వెళ్లేసరికి పంటకుంట ఏదీ లేదు. పంటకుంటలో నీళ్లు కూడా లేవు. ఇదీ శివన్న పరిస్థితి. శివన్న ఐదు ఎకరాల్లో వేరు శనగ వేస్తే ఎంత పంట పండిందో తెలుసా? కేవలం అర బస్తా. ‘‘అన్నా ఇదీ పరిస్థితి. అప్పులు తీర్చడం కోసం, బతకడం కోసం ఇవాళ వడియాలు, బొరుగులు (ఉత్తరాంధ్రలో మూరీలు) అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉన్నానన్నా’’ అని శివన్న నా వద్దకు వచ్చి చెప్పాడు. శివన్న నా వద్దకు వచ్చినప్పుడు మైక్‌ ఇస్తే ఏం చెప్పాడో తెలుసా?.. ‘క్రితంసారి సెంద్రబాబుకు ఓటేశా. చివరకు ఇలా అయ్యా. ఇక మనకు సెంద్రబాబుతో సావాసం వద్దబ్బా...’ అన్నాడు. అందుకే గ్రామస్థాయిలో రైతులు ఇవాళ చంద్రబాబును ఏమంటున్నారో తెలుసా? ‘‘నిన్ను నమ్మం బాబూ..’’ అని పిలుపునిస్తున్నారు.  


 
రైతులు ఆల్లాడుతుంటే జాతీయ రాజకీయాలంటూ డ్రామాలు.. 
చంద్రబాబు హయాంలో ఐదుకు ఐదేళ్లు ఒకవంక కరువు మరోవంక తుపాన్లు. కానీ రైతులకు మాత్రం ఇన్‌పుట్‌ సబ్సిడీలు రావు. రైతులు అల్లాడుతున్నా క్యాబినెట్‌ సమావేశం నిర్వహించి ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన చెయ్యరు. 2018 జూన్‌ 1వ తేదీ నుంచి ఈనెల 2వతేదీ వరకు అంటే వారం క్రితం వరకు వర్షపాతం చూస్తే కోస్తాలో – 23.1 శాతం లోటు ఉంది. రాయలసీమలో –50.3 శాతం లోటు ఉంది. ఇంత దారుణంగా రైతన్నల పరిస్థితి ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు జాతీయ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టాడు. ఓ రోజు బెంగళూరు వెళ్లి కుమారస్వామితో కాఫీ తాగుతాడు. పక్కనే అనంతపురం ఉంటుంది. కానీ అక్కడకు వెళ్లి కరువు బారిన పడిన రైతులకు అండగా ఉందామనే ఆలోచన చంద్రబాబుకు రాదు. మరుసటి రోజు మళ్లీ విమానమెక్కుతాడు. జాతీయ రాజకీయాలంటూ చెన్నై వెళ్లి స్టాలిన్‌తో కలసి ఇడ్లీ, సాంబార్‌ తింటాడు. చెన్నై పక్కనే తన సొంత జిల్లా చిత్తూరు ఉంది. అక్కడ రైతులు అల్లాడుతున్నారనే ధ్యాస చంద్రబాబుకు ఏమాత్రం పట్టదు. అంతటితో ఆగడు. ఎలాగూ ప్రభుత్వమే కదా విమానం ఖర్చులు భరించేది అనుకుని కోల్‌కతా వెళతాడు. మమతా బెనర్జీతో కలసి చికెన్‌ తింటాడు ఈ పెద్దమనిషి.  
 
అందుకే నమ్మం బాబూ.. నమ్మం అంటున్నారు.. 
ఆయన (చంద్రబాబు) వచ్చాక పంటల విస్తీర్ణం, దిగుబడి పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది. 2008–09 పంటల విస్తీర్ణం లెక్కలు చూస్తే వైఎస్‌ హయాంలో 42.70 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తే.. 2017–18లో చంద్రబాబు పాలనలో అది 40 లక్షల హెక్టార్లకు పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్‌ హయాంలో 166 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండితే చంద్రబాబు పాలనలో 157 లక్షల టన్నులకు పడిపోయింది. కానీ ఈ పెద్దమనిషి చంద్రబాబు నదుల అనుసంధానం అంటాడు. పట్టిసీమ నీళ్లను రాయలసీమకు అందించానని బొంకుతాడు. బొంకడంలో ఇంకా నాలుగడుగులు ముందుకేసి రెయిన్‌గన్లతో కరువును జయించానంటాడు. దేశంలోనే వ్యవసాయంలో అత్యధిక వృద్ధి రేటు మన రాష్ట్రంలోనే ఉందని బొంకుతాడు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పే వ్యక్తిని చూసినప్పుడు రైతన్నలు (ఏమంటారు? అని సభికులను జగన్‌ ప్రశ్నించగా నమ్మం బాబూ అంటామని ముక్తకంఠంతో చెప్పారు) నమ్మమంటే నమ్మమంటారు.  
 
రైతుల నెత్తిన అప్పుల కుంపటి  
ఇవాళ రైతుల బతుకులు ఎలా ఉన్నాయో ఇటీవలే నాబార్డు ఓ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం రైతుల నెత్తిన అప్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. నాబార్డు నివేదిక ప్రకారం వ్యవసాయదారుల సగటు ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున 28వ స్థానంలో ఉంది. రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన ఘరానా మోసంతో రైతులు కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోతున్నారు. అప్పులపై వడ్డీలు కట్టలేక, కొత్తగా అప్పులు పుట్టక అష్టకష్టాలు పడుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి రూ.87,612 కోట్లుగా ఉన్న రైతుల అప్పులు ఇవాళ తడిసిమోపెడై, వడ్డీల మీద వడ్డీలు పడి అక్షరాలా రూ.1,30,000 కోట్లకు ఎగబాకిన పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. రుణమాఫీ చేస్తానని చెప్పి మోసాన్ని మిగిల్చాడు. రైతులకు చేస్తానన్న రుణమాఫీ పథకం కనీసం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. చంద్రబాబు చేసిన మరో అన్యాయం.. రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ డబ్బులను పూర్తిగా కట్టకుండా మానేయడం. అందుకే ఇవాళ ఎక్కడ చూసినా రైతులు చంద్రబాబును (ఏమంటున్నారు? అని జగన్‌ సభికులను ప్రశ్నించారు) ‘‘నిన్ము నమ్మంగాక నమ్మం..’ అని అంటున్నారు. నాలుగున్నరేళ్లలో రైతన్నలకు ఏం పంటకైనా గిట్టుబాటు ధర లభించిందా? పంట వేసే ప్రతి రైతును అడుగుతున్నా (రాలేదు.. రాలేదు అంటూ అందరూ రెండు చేతులు పైకి ఎత్తి చెప్పారు) ధాన్యం సహా ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదు.  
 
దళారీలకు కెప్టెన్‌లా చంద్రబాబు  
ఓ ముఖ్యమంత్రి అంటే రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించేందుకు తపించాలి. దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఆరాటపడాలి. కానీ తన హెరిటేజ్‌ షాపుల కోసం ఈ పెద్దమనిషి చంద్రబాబు దళారీలకు కెప్టెన్‌ అయ్యారు. హెరిటేజ్‌ లాభాల కోసం రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటినే పొట్లాల్లో పెట్టి రెండింతలు, మూడింతలు ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్న పరిస్థితి సాక్షాత్తూ ముఖ్యమంత్రే చేస్తున్నారు. రైతుల పరిస్థితి ఇవాళ ఎలా ఉందో చిన్న ఉదాహరణ చెప్పాలంటే.. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.750. అయితే ఖరీప్‌ పంట చేతికొచ్చినా కూడా అమ్ముకోలేని దయనీయ స్థితిలో రైతులున్నారు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. ఉద్దానం.. ఇక్కడ జీడిపప్పు ఫేమస్‌.. పలాస జీడిపప్పు గురించి రకరకాలుగా చెప్పుకుంటారు. కిలో రూ.600కి కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉద్దానం రైతన్నలు ఉన్నారు. కానీ ఇదే పలాస జీడిపప్పును చంద్రబాబు హెరిటేజ్‌ షాపుల్లో కిలో రూ.1,110 చొప్పున అమ్ముతున్నారు. ఇంత దారుణమైన మోసాలు రైతులకు చేస్తున్నాడు కాబట్టే ‘‘నిన్ను నమ్మం బాబూ..’’ అని అంటున్నారు. 


 
అక్క చెల్లెమ్మలను మోసగించారు.. 
దారి పొడవునా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు తమ బాధలను చెప్పారు. చంద్రబాబు మోసాల కారణంగా అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో డ్వాక్రా రుణాలు కట్టలేదని అక్క చెల్లెమ్మల్లను కోర్టు మెట్లు ఎక్కించిన పరిస్థితి చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో బ్యాంకు సిబ్బంది నేరుగా అక్క చెల్లెమ్మల ఇళ్లపై దాడులు చేసి తాళాలు వేసిన ఘటనల గురించి అక్కడ పాదయాత్ర సమయంలో చెబితే బాధనిపించింది. బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి రాలేదు కానీ వడ్డీలు కట్టడానికి తాళిబొట్లను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు రూ.14,204 కోట్లు ఉంటే ఇప్పుడవి తడిసి మోపెడై వడ్డీలపై వడ్డీలు పడి రూ.22,174 కోట్లకు ఎగబాకిన పరిస్థితి. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాననే హామీ గాలికి ఎగిరిపోయింది. డ్వాక్రా సంఘాలకు చంద్రబాబు హయాంలో 2016 అక్టోబర్‌ నుంచి సున్నా వడ్డీ డబ్బులను కట్టకుండా ఎగ్గొట్టారు. ఇటువంటి ఎగనామం పెడుతున్న చంద్రబాబును చూసినప్పుడు ఆ అక్క చెల్లెమ్మలు ‘‘నిన్ను నమ్మం బాబూ నమ్మం..’’ అంటున్నారు.  
 
ఉద్యోగాలు ఇవ్వకపోగా ఊడగొడుతున్నారు.. 
చంద్రబాబు హయాంలో ఇవాళ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయదు. నిరాశతో ఉన్న యువత.. అన్నా బాబు వచ్చాడు కానీ జాబు రాలేదన్నా అంటున్నారు. బాబు వచ్చాడు.. ఉన్న జాబులను ఊడగొడుతున్నాడన్నా అంటున్నారు. రాష్ట్రంలో 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా.. గృహ నిర్మాణశాఖలో 3,500 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల ఉద్యోగాలు కూడా గోవిందా.. వేల సంఖ్యలో గోపాలమిత్రల ఉద్యోగాలూ గోవిందా. ఆయుష్‌లో పని చేస్తున్న అక్క చెల్లెమ్మల ఉద్యోగాలు కూడా గోవిందా.. సాక్షర భారత్‌లో పనిచేస్తున్న 30 వేల మంది అక్కాచెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా.. దశాబ్దాలుగా పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి పెట్టిన 85 వేల మంది మహిళల ఉద్యోగాలు సైతం గోవిందా.. రాష్ట్ర విభజన జరిగే నాటికి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని లెక్కలు తేల్చారు.

ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు 95 వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో 2.40 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ చంద్రబాబు హయాంలో కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాపానపోలేదు. చంద్రబాబు పాలన చూసి యువతలో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. చంద్రబాబు పాలనలో ఏపీపీఎస్సీ పరీక్షలు నిర్వహించడం లేదు. మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. చంద్రబాబు మాత్రం రాష్ట్రానికి రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 40 లక్షల ఉద్యోగాలు వచ్చేశామని ఊదరగొడుతున్నాడు. జాబు రావాలంటే.. బాబు రావాలని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పాడు. చంద్రబాబు ఉద్యోగం ఇస్తాడని, ఉపాధి కల్పిస్తాడని.. ఈ రెండూ ఇవ్వలేకపోతే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తాడని టీడీపీ నేతలతో చెప్పించాడు. చంద్రబాబు సంతకంతో ఉన్న లేఖలను ఇంటింటికీ పంచి పెట్టారు. ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు మోసం చేశాడు. రాష్ట్రంలో 1.72 కోట్ల ఇళ్లు ఉండగా, తీరా ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు ఆ ఇళ్ల సంఖ్యను 3 లక్షలకు కుదించాడు. నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు ఇస్తానని చెప్పి, దాన్ని రూ.వెయ్యికి తగ్గించాడు.  
 
మూత పడుతున్న పరిశ్రమలు  
చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు వచ్చిన దాఖలాలే లేవు. కరెంటు బిల్లులు, రాయల్టీలు పెంచడం వల్ల, ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వకపోవడం వల్ల ఇప్పటిదాకా ఉన్న పరిశ్రమలే మూతపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సహకార డెయిరీలు, సహకార చక్కెర కర్మాగారాలు మూతపడుతున్నాయి. గతంలోనే చంద్రబాబు చాలా పరిశ్రమలకు తాళాలు వేసి, అమ్మేశారు. ఇప్పుడు అరకొరగా మిగిలి ఉన్న పరిశ్రమలను సైతం అమ్మేయడానికి సర్వం సిద్ధం చేస్తున్నాడు. కర్నూలులో నాపరాళ్ల పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రకాశం జిల్లాలో గ్రానైట్‌ పాలిషింగ్‌ యూనిట్లు మూతపడ్డాయి. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడ్డాయి. ఉత్తరాంధ్రలో జ్యూట్‌ మిల్లులు, ఫెర్రో అల్లాయ్‌ పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడడాన్ని ఈ పాదయాత్రలో చూశా. వాళ్ల దీనగాథలను విన్నా.  
 
ఇంతకంటే సిగ్గుమాలిన సీఎం ఉండరేమో!  
రాష్ట్రంలో చదువుల పరిస్థితి దారుణంగా మారింది. శ్రీకాకుళం జిల్లా కవిటిలో పాదయాత్ర చేస్తుండగా విద్యార్థులు నన్ను కలిశారు. అక్కడ జూనియర్‌ కాలేజీలో 400 మందికిపైగా పిల్లలు చదుకుంటున్నారు. అందులో దాదాపు 240 మంది ఆడపిల్లలే ఉన్నారు. ఆ కాలేజీలో కనీసం బాత్రూమ్‌లు కూడా లేవని అక్కడి విద్యార్థినులు చెప్పారు. కానీ, మన రాష్ట్రంలో అందరికీ బాత్రూమ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఓపెన్‌ డిఫకేషన్‌ ఫ్రీ కార్యక్రమంలో మన రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని చంద్రబాబు నాయుడు టీవీల్లో ఊదరగొడుతున్నాడు. పచ్చి అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు నిజంగా సిగ్గుపడాలి. జూనియర్‌ కాలేజీలో ఆడపిల్లల కోసం కనీసం బాత్రూమ్‌లు కూడా లేవంటే ఇంతకంటే సిగ్గుమాలిన ముఖ్యమంత్రి బహుశా దేశంలో ఎవరూ ఉండరేమో!   
 
బాబు బినామీ స్కూళ్లకు మేలు  
చంద్రబాబు తన బినామీల ప్రయోజనాల కోసం విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక 6 వేల స్కూళ్లను మూసివేయించారు. ఎస్సీ, బీసీ హాస్టళ్లను సైతం ఎత్తివేశారు. స్కూళ్లలో చాలా పుస్తకాలు ఇవ్వలేదని విద్యార్థులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నాసిరకం యూనిఫామ్‌ల పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలామందికి యూనిఫామ్‌లే పంపిణీ చేయలేదు. ప్రభుత్వ స్కూళ్లలో 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉండగా, చంద్రబాబు వాటిని భర్తీ చేయకుండా పాఠశాలలను నాశనం చేసే కార్యక్రమానికి పూనుకున్నాడు. మధ్యాహ్న భోజనానికి సంబంధించిన సరుకుల బిల్లులను ఆరు నెలలుగా ఇవ్వడం లేదు. పిల్లలు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లకుండా ప్రైవేట్‌ స్కూళ్లకు వెళ్లేలా కుతంత్రాలు పన్నుతున్నాడు. తద్వారా తన బినామీలైన నారాయణ, చైతన్య స్కూళ్లు వేలకు వేలు దోచుకునేలా దోహదపడుతున్నాడు. 


 
‘నిన్ను నమ్మం బాబూ’ అంటున్నారు  

పాదయాత్రలో చాలామంది విద్యార్థులు నన్ను కలిశారు. వారి బాధలు చెప్పుకున్నారు. మరిచిపోలేని ఓ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఉదయగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తుండగా కృష్ణారెడ్డిపాలెం వద్ద రోడ్డు పక్కనే ఓ చిన్న గుడిసె. ఆ గుడిసె ఎదురుగా ఓ ఫ్లెక్సీ కనిపించింది. అందులో ఓ పిల్లాడు ఉన్నాడు. దానికి పూలదండ కూడా వేసి ఉంది. తల్లిదండ్రులిద్దరూ ఏడుస్తూ నా దగ్గరికొచ్చారు. ఆ తండ్రి పేరు గోపాల్‌ అన్న. ఫ్లెక్సీపై ఉన్న ఫొటో తన కొడుకుదని ఈ తండ్రి చెప్పాడు. ఏమైందని అడిగా. తన కుమారుడు తెలివైన విద్యార్థి అని, ఇంజనీరింగ్‌లో సీటు వచ్చిందని, కాలేజీలో చేర్పించే ప్రయత్నం చేశామని, ఫీజులు చూస్తే లక్ష రూపాయలకు పైగా ఉన్నాయని అన్నాడు. ప్రభుత్వం మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద కేవలం రూ.30 వేలు మాత్రమే ఇస్తుందట అని చెప్పాడు. రూ.70 వేలు అప్పు చేసి తన కుమారుడిని ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదివించానని అన్నాడు. అప్పు తీసుకొచ్చానన్న సంగతి తన కుమారుడికి తెలుసని, బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. రెండో సంవత్సరం తన బిడ్డ ఇంటికొచ్చి నా చదువు కోసం ఈసారి ఏం చేస్తావని అడిగాడని చెప్పాడు. ఏదో ఒకటి చేస్తాలే, నువ్వయితే కాలేజీకి వెళ్లి బాగా చదువుకుని గొప్ప వాడివి కావాలని సూచించానని అన్నాడు. తన చదువుల కోసం తన కుటంబం ప్రతిఏటా అప్పులు చేయడం చూసి తట్టుకోలేక ఆ పిల్లాడు ఇంటి నుంచి నేరుగా హాస్టల్‌కు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తండ్రి ఆవేదనను ఎప్పటికీ మర్చిపోలేను. ఇవాళ రాష్ట్రంలో చాలామంది తల్లిదండ్రులు గోపాల్‌ అన్న లాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, వచ్చినా ఆ సొమ్ము సరిపోక, చదువుల కోసం ఆస్తులు ఆమ్ముకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.  
 
పేద రోగుల పరిస్థితి దయనీయం  
రాష్ట్రంలో పేదవాడికి ఏదైనా పెద్దరోగం వస్తే అప్పులపాలయ్యే పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలలుగా బకాయిలను చెల్లించడం లేదు. అందువల్ల ఆరోగ్యశ్రీ కింద సేవలను ఆయా ఆసుపత్రులు పూర్తిగా నిలిపివేశాయి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పరిస్థితులను చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇక్కడ 4 వేలమందికిపైగా కిడ్నీ వ్యాధుల బాధితులు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఇందులో కేవలం 1,400 మందికి మాత్రమే ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందుతున్నాయి. మిగిలిన వాళ్లంతా సొంత ఖర్చులతో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. ఉద్దానంలో 4 వేల మందికిపైగా కిడ్నీ రోగులు ఉండగా, ప్రభుత్వం కేవలం 370 మంది మాత్రమే పెన్షన్‌ ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. ఆ పెన్షన్‌ ఎంతో తెలుసా?ముష్టివేసినట్లు రూ.2,500 మాత్రమేనట! అసలు ఆ కిడ్నీ రోగులు చావాలా? బతకాలా? ప్రభుత్వం ఏమనుకుంటోంది? రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అనే పథకం ఉందా? లేదా? అని అడుగుతున్నా.

‘108’కు ఫోన్‌ చేస్తే కుయ్‌ కుయ్‌ కుయ్‌ అంటూ 20 నిమిషాల్లోనే రావాల్సిన అంబులెన్స్‌ ఇవాళ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. విజయనగరంలో ఉండగా గరివిడి మండలం కోడూరుకు చెందిన ఓ విద్యార్థిని నా దగ్గరికొచ్చింది. ఆమె పేరు భవాని. తన ఇంటి పక్కనే గౌరి అనే గర్భవతి ఉందని, ఆమెకు పురిటి నొప్పులు వస్తే ‘108’కు ఫోన్‌ చేశానని, టైర్‌ పంక్చరైందని రాలేమని నిర్దాక్షిణ్యంగా చెప్పారని భవాని ఆవేదన వ్యక్తం చేసింది. అటువైపు స్కూల్‌ పిల్లలతో వస్తున్నా ఆటోలో గౌరిని ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పింది. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో 108 అంబులెన్స్‌ రాకపోవడంతో ఓ గర్భిణి రోడ్డుపైనే ప్రసవించాల్సి వచ్చింది. విశాఖ జిల్లాలో కె.కోటపాడులో సకాలంలో 108 అంబులెన్స్‌ వెళ్లకపోవడం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆరోగ్యశ్రీ అమలు పరిస్థితి దారుణంగా మారింది. మూగ, చెవుడు పిల్లలకు ఆపరేషన్లు చేస్తారన్న నమ్మకం లేకుండా పోయింది. మంచి వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళితే ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేస్తారన్న ఆశ లేకుండాపోయింది. ఇంత అన్యాయంగా చంద్రబాబు పాలన సాగుతోంది. బాబు పాలన గురించి పేద రోగులు ఏమంటున్నారో తెలుసా? నిన్ను నమ్మం బాబూ అంటున్నారు.  
 
మాఫియాలా జన్మభూమి కమిటీలు  
ఇవాళ గ్రామస్వరాజ్యం కనిపించడం లేదు. జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాలు కనిపిస్తున్నాయి. రేషన్‌ కార్డు కావాలన్నా లంచం, పెన్షన్‌ మంజూరు కావాలన్నా లంచం, ఇల్లు కావాలన్నా లంచం.. చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉంది. చంద్రబాబు పాలనలో గ్రామాల్లో అతి భయానకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరులో అవ్వాతాతలు వచ్చి వారి బాధలు చెప్పుకున్నారు. పెన్షన్లు రాక, జన్మభూమి కమిటీల వేధింపులు భరించలేక చివరకు కోర్టుకు వెళ్లారు. తాము చనిపోయామంటూ పెన్షన్లు ఇవ్వడం లేదని, కానీ, బతికే ఉన్నామని కోర్టు ముందు చెప్పుకున్నారట. అర్హులకు పెన్షన్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించినా.. ఇప్పటికి కూడా చాలామందికి ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడం లేదు. నిన్ను నమ్మం బాబు అని గ్రామాల్లో నిరుపేదలంతా ముక్తకంఠంతో చెబుతున్నారు.  
 
రాష్ట్రాన్ని బాబు భోంచేస్తున్నాడు  

పైన చంద్రబాబు ఉంటాడు, కింద జన్మభూమి కమిటీలు ఉంటాయి. ఈ కమిటీల లంచాల తీరు గురించి ఇప్పటిదాకా చెప్పా. పైన చంద్రబాబు ఉంటాడు. ఆయన ఏదీ వదలడు, ఇసుక వదలడు. మట్టి వదలడు, బొగ్గు వదలడు. కరెంటు కొనుగోళ్లను వదలడు, కాంట్రాక్టర్లను వదలడు. మద్యాన్ని వదలడు, రాజధాని భూములు వదలడు, విశాఖపట్నం భూములు వదలడు. చివరకు గుడి భూములు, దళితుల భూములు కూడా వదలకుండా రాష్ట్రాన్ని భోంచేస్తున్నాడు. తప్పులను మనం నిలదీస్తే చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఎన్నికల సమీస్తున్న కొద్దీ చంద్రబాబుకు టెంపరేచర్‌ పెరుగుతోంది. ఇప్పుడు పేదలకు కొత్త ఇళ్లు, కొత్త రేషన్‌ కార్డులు, కొత్త పెన్షన్లు, ఆదరణ–2 అని పాట పాడుతున్నాడు. మరో స్కీమ్‌ అంటాడు, ఇంకో స్కీమ్‌ అంటాడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు డ్రామా అనే కొత్త సినిమా తీస్తున్నాడు. ఎన్ని నాటకాలు అడినా.. నిన్ను నమ్మం బాబు అని ప్రజలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు.  
 
పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ  

నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు పాలన మనమంతా చూశాం. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేశారు. 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లుగా కొనేశారు. ఒక్కొక్కరికి రూ.20 కోట్లు, రూ.30 కోట్లు ఇచ్చారు. అందులో కొందరిని మంత్రులను చేశారు. ఇలా దుర్మార్గమైన పాలన కావాలా? అని అడుగుతున్నా. ఇలాంటి మనిషి కావాలా? అని అడుగుతున్నా. నాలుగున్నరేళ్లుగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ఎన్నికలు వచ్చేసరికి డ్రామాలు ఆడుతున్నాడు. అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఓట్లు వేయొద్దని చంద్రబాబు ఇటీవల తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పిలుపునిచ్చాడు. ఎన్నికలు వచ్చేసరికి ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చేస్తాడు. చంద్రబాబు నాలుగేళ్లు బీజేపీతో కలిసి కాపురం చేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని పొగిడాడు. హోదా కాకుండా ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో ఏకంగా తీర్మానాలు చేశాడు. ప్రత్యేక హోదా కావాలని మనమంతా అడిగితే వెటకారంగా మాట్లాడాడు. హోదా మాటెత్తితే జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని మనల్నే ప్రశ్నించాడు. బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసినంత మేలు ఇతర రాష్ట్రాలకు చేయలేదని కితాబిచ్చాడు. 
  
మార్పుల్లో మొదటిది.. 25 జిల్లాలు 
మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళణ చేయాలి. మనం చెప్పిన పథకాలు, మనం చెప్పే పనులు జరగాలంటే ఒక పటిష్టమైన వ్యవస్థ రావాలి. ఏదైనా పథకం చెబితే ఆ పథకం ప్రతీ పేదవాడి ఇంటికి చేరాలి. ఆ పేదవాడు ఏ పార్టీ, ఏ కులం, ఏం చేస్తున్నాడనేది అడ్డు రాకూడదని చెబుతున్నా. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలి. మారిన వ్యవస్థను పూర్తిగా ప్రతి పేదవాడికి దగ్గరకు తీసుకుపోవాలి. ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందించాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చే మొట్ట మొదటి మార్పు జిల్లా స్థాయిలో చేస్తాం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తాం. ప్రతి పార్లమెంటు నియజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని మీఅందరికి చెబుతున్నా. ఈ మార్పు ఎందుకంటే.. ప్రతి కలెక్టర్‌ ఏడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే జవాబుదారీతనంగా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉండటంతో కలెక్టర్లకు జవాబుదారీతనం లేకుండా ఉంది. కలెక్టర్‌.. ప్రజలకు దగ్గరగా ఉండాలి. కలెక్టర్‌ చేతినిండా పని ఉండేలా చేసేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం.  

గ్రామ సెక్రటేరియెట్లు తీసుకొస్తాం 
ప్రతీ పథకం పేదవారి ఇళ్లకు చేర్చాలన్న లక్ష్యంతో ప్రతి గ్రామంలో గ్రామ సెక్రటేరియెట్‌ తీసుకొస్తాం. గ్రామంలో చదువుకున్న 10 మంది పిల్లలకు అక్కడే ఉద్యోగాలిస్తాం. ప్రస్తుతం పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, బియ్యం కావాలన్నా, మరుగుదొడ్డి కావాలన్నా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదు. గ్రామ సెక్రటేరియెట్లతో ఈ పరిస్థితిని మార్చేస్తాం. ఏ పేదవాడికి ఏ అవసరం ఉన్నా, పింఛన్‌ కావాలన్నా, రేషన్‌ కార్డు కావాలన్నా, ఇల్లు మంజూరు కావాలన్నా, ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్, నవరత్నాల్లో మనం చెప్పే ప్రతీ పథకం వారి ఇంటి వద్దే నేరుగా ఇచ్చేలా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తాం. పథకాలు అమలు చేసేటప్పుడు లబ్ధిదారుల అర్హత మాత్రమే చూస్తాం. కులాలు చూడం, మతాలు చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడబోమని మీకు హామీ ఇస్తున్నా. ప్రతీ పథకం లబ్ధిదారుడి ఇంటికి తీసుకెళ్లాలంటే ఎలా సాధ్యం అంటే.. ప్రతీ గ్రామంలో 50 ఇళ్లకు ఒకర్ని గ్రామ వలంటీర్‌గా సేవా దృక్పథం ఉన్న యువతను తీసుకొని ఉద్యోగమిస్తాం. వారు జవాబుదారీగా ఉంటారు. వారికి రూ. 5 వేలు జీతం ఇస్తాం. ఆ వలంటీర్లు గ్రామ సెక్రటేరియట్‌తో అనుసంధానంగా ఉంటూ పనిచేస్తారు. ఇది చిట్టి చివరి సభ కాబట్టి నవరత్నాల కోసం మీ అందరికి చెబుతా. ప్రతి పేదవాడిమోములో చిరునవ్వు చూడాలని, ప్రతి రైతుకళ్లలో ఆనందం నింపాలని నవరత్నాలను తీసుకొచ్చాం. నవరత్నాల్లో కొన్ని మార్పులు కూడా చేసుకుంటా వచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ అంశాలను ప్రతిసభలోనూ చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కాబట్టీ ఒక్కో అంశాన్ని చెప్పుకుంటా వచ్చా. ఇక్కడ అన్ని అంశాలు మీకు వివరిస్తా.  


పెట్టుబడి తగ్గిస్తే రైతన్నకు ఆదాయం పెరుగుతుంది 

ప్రస్తుతం రైతుల పరిస్థితి ఎలా ఉందో.. రైతుల బతుకులు ఎలా ఉన్నాయో చూడమని మీకు చెబుతున్నా. రైతులకు ప్రధానంగా గిట్టుబాటు ధర లేదు. బ్యాంకుల్లో అప్పులు పుట్టడం లేదు. వడ్డీలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పెట్టుబడి వ్యయం పెరిగిపోతోంది. చివరకు పంట చేతికొస్తుందనుకుంటే కరువులు, తుపానులు వచ్చి రైతన్నలు నష్టపోతున్నారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. అసలు ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. వీటన్నింటికి చరమగీతం పాడుతున్నా. రైతులు ప్రధానంగా ఐదు సమస్యలు ఎదుర్కొంటారు. మొట్టమొదటి సమస్య పెట్టుబడి. జూన్‌ మాసంలో పంట వేసేందుకు పెట్టుబడి కోసం సమస్య వస్తుంది. పెట్టుబడి తగ్గించగలిగితే రైతన్నకు ఆదాయం పెరుగుతుంది. ఈ పెట్టుబడులు తగ్గించేందుకు  రైతులకు ఎలా మేలు చేస్తానో చెబుతున్నా. 
 
రైతు తరఫున ప్రభుత్వమే బీమా సొమ్ము (ప్రీమియం) కడుతుంది 
రైతుల కోసం మరో అడుగు ముందుకు వేయబోతా ఉన్నా. ఇప్పటి వరకు ఏ సభలో చెప్పలేదు. మొట్టమొదటిసారిగా ఇక్కడ చెబుతున్నా. ప్రస్తుతం రైతుల బీమా పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. తుపానులు, కరువు వచ్చినా ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు ఆ సొమ్ము వస్తుందో.. రాదో తెలియదు. ఎందుకు ప్రీమియం తీసుకుంటున్నారో తెలియదు. రైతన్నల తరఫున కట్టాల్సిన ఇన్సూరెన్స్‌ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే కడుతుందని చెబుతున్నా. ఇన్సూరెన్స్ కోసం రైతులు ఆలోచించాల్సిన పనిలేదు. ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది. ఇన్సూరెన్స్ సొమ్ము పేదవాడికి ఇచ్చేందుకు ప్రభుత్వమే కృషి చేస్తుందని ఈరోజు ఇక్కడ కొత్తగా చెబుతున్నా. ఆక్వా రంగానికి రూ. 1.50లకే విద్యుత్‌ ఇస్తామని ఇదివరకే చెప్పా. వీటన్నింటి వల్ల పెట్టుబడి ఖర్చు రైతన్నలకు తగ్గుతుంది. ఇక రైతు ఎదుర్కొనే మరో సమస్య.. పంట పండించిన తర్వాత ఆ పంట అమ్ముకోలేని పరిస్థితి. గిట్టుబాటు ధర రాక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. 

సహకార డెయిరీలను ప్రోత్సహిస్తాం 
గిట్టుబాటు ధర కోసం, మంచి రేట్లు రైతులకు వచ్చేందుకు సహకార రంగంలో డెయిరీలను ప్రోత్సహించే దిశగా అడుగులు వేస్తాం. సహకార డెయిరీలు మంచిరేట్లు ఇస్తే ప్రైవేటు డెయిరీలు కూడా పోటీ పడి ఎక్కువ ధర ఇస్తారు. సహకార రంగానికి చెందిన డెయిరీలకు పాలు పోస్తే లీటర్‌కు రూ. 4 బోనస్‌ ఇస్తాం. అప్పుడు ప్రైవేటు డెయిరీలు కూడా పోటీపడక తప్పదు. పంటతో పాటు పాడి ఉంటేనే రైతుకు ఆదాయం ఉంటుంది. ఒక సామెత కూడా ఉంది ‘పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునట. కవ్వమాడు ఇంట కరువే ఉండదట’. పాడిని ప్రోత్సహిస్తేనే రైతన్న బతకగలుగుతాడు. ఒక లీటర్‌ పాలు ఒక బాటిల్‌లో ఒకాయన తీసుకొచ్చి నాకు చూపించాడు. ఆ పాల రేటు రూ. రూ.26. అదే బాటిల్‌లో మినరల్‌ వాటర్‌ లీటర్‌ నీళ్లు రూ. 23 అని ఆ అన్న చెప్పుకొచ్చాడు. నీళ్లకు సమాన రేటులో పాలు అమ్ముకునే అధ్వాన పరిస్థితిలో రైతన్న ఉన్నాడు. ఈ పెద్దమనిషి చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్‌ పాల కోసం.. దాని లాభాల కోసం రైతన్నలను గాలికొదిలేశారు. తానే దళారీలకు కెప్టెన్‌ అయ్యి, తానే పాలు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ రేటుకు తన హెరిటేజ్‌లో అమ్ముకునే పరిస్థితి ఉంది. హెరిటేజ్‌ షాపులో మీగడ తీసేసిన పాలు అధిక ధరలకు అమ్ముతున్నారు. సహకార రంగంలో డెయిరీలను ప్రోత్సహిస్తేనే పాడి రైతులు బాగుపడతారు. ఇక ఈ అంశంలోనే చివరిది.. వ్యవసాయరంగంలో వాడే ట్రాక్టర్లకు రోడ్డు టాక్స్‌ పూర్తిగా రద్దు చేస్తాం. 

జీడి తోటలకు రూ. 50 వేల పరిహారం  
అనుకోకుండా కరువు వచ్చినా, తుపాను వచ్చినా రైతన్నకు దిక్కుతోచని పరిస్థితి. తిత్లీ తుపాను వచ్చింది. చెట్లు ఒరిగిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు కట్టింది. అక్షరాలా రూ. 3,435 కోట్లు నష్టమని లెక్క గట్టింది. కానీ 15 శాతం.. కేవలం రూ. 500 కోట్లు ఇచ్చి చంద్రబాబు చేతులు దులుపుకొన్నాడు. పబ్లిసిటీ మాత్రం ఏ స్థాయిలో చేస్తాడంటే.. ఏ ఆర్టీసీ బస్సునూ వదిలిపెట్టడు. విజయవాడ, విశాఖపట్నంలో ఫ్లెక్సీలు పెట్టిస్తాడు. ఈ శ్రీకాకుళం జిల్లా వరకు తిత్లీ తుపాను బాధితులకు, కిడ్నీ బాధితులకు ఏం చేయబోతున్నామో çగతంలో చెప్పాను. 

రూ.4వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల ఫండ్‌ 
రాష్ట్రవ్యాప్తంగా తుపాను, కరువు రూపాల్లో కష్టమొస్తే రైతుకు తోడుగా ఉండేందుకు ప్రకృతి వైపరీత్యాల ఫండ్‌ కింద రూ. 4 వేల కోట్లతో నిధి పెడతాం. రూ. 2 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెడితే మరో రూ. 2 వేల కోట్లు కేంద్రం నుంచి సహకారం అందుతుంది. ఎక్కడ కరువు వచ్చినా, తుపాను వచ్చినా ఆ 4 వేల కోట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఏ రైతుకు నష్టం రాకుండా చేస్తాం. ప్రతి రైతుమోములో చిరునవ్వు కన్పిస్తుంది. తిత్లీ తుపానుకు కొబ్బరిచెట్లన్నీ పోయాయి. చెట్టుకు రూ. 1500లు అని చెప్పారు. జీడి పంటకు ఎకరాకు రూ. 30 వేలు ఇచ్చారు. సరిపోదయ్యా అని రైతులు నెత్తినోరూ మొత్తుకున్నారు. కనీసం పట్టించుకోలేదు. కానీ మీకు హామీ ఇస్తున్నా. కొబ్బరిచెట్టు పరిహారం రూ. 3 వేలు, జీడితోటలకు పరిహారం రూ. 50 వేలు చేస్తామని హామీ ఇస్తున్నా. ఈ విధంగా రైతన్నకు తోడుగా ఉండే పరిస్థితి ప్రకృతి వైపరీత్యాల నిధి ద్వారా వస్తుంది. మనందరి ప్రభుత్వం రాగానే రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తా. ఏ రేటుకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో ఆ రేటును రైతులు పంట వేసే ముందే ప్రకటిస్తాం. దీంతో దళారీలు ప్రభుత్వం ప్రకటించిన ధరతో పోటీపడాల్సి ఉంటుంది. ప్రభుత్వ రేటు కంటే ఎక్కువకు వారు కొనుగోలుచేసే పరిస్థితి వస్తుంది. దీంతో రైతన్నకు గిట్టుబాటు ధర వస్తుంది. ప్రతి మండలంలోనూ కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోట ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి రైతన్నలకు అన్నిరకాలుగా తోడుగా ఉంటానని హామీ ఇస్తున్నా. 


యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. 

ఇక చివరగా జలయజ్ఞం. నాలుగున్నరేళ్లు చంద్రబాబు పాలన చూసాం. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏ ప్రాజెక్టు చూసినా ఎస్టిమేషన్స్‌ పెంచేశారు. కాంట్రాక్టర్ల కింద తన బినామీలు తెచ్చారు. ఇష్టమొచ్చినట్లుగా రేట్లు పెంచి డబ్బులు దోచేస్తున్న పరిస్థితి. పోలవరం మొదలుకొని గాలేరు, నగరి, హంద్రీనీవా.. అన్నీ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. రైతులకు 9 గంటలు పగటి పూటే కరెంట్‌ ఇస్తాం. 

మే నెలలోనే ప్రతి రైతు చేతికి రూ.12,500 
ఆ తర్వాత రైతన్న కోసం చేయబోయే మూడో పని ఏంటంటే.. రైతన్నకు మే మాసంలో పెట్టుబడి ఖర్చు అవసరం. దానికోసం బ్యాంకుల నుంచో.. ప్రైవేట్‌ వ్యక్తుల వద్దనుంచి రెండు, మూడు రూపాయల వడ్డీకో రైతులు అప్పులు చేíస్తారు. రైతులు అప్పుల్లో కూరుకుపోకుండా ఉండేందుకు మే మాసంలోనే ప్రతి రైతుకు రూ. 12,500 నేరుగా వారి చేతిలో పెడతాం. ఇది ఎందుకంటే.. రాష్ట్రంలో దాదాపు 85 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 70 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం భూమి ఉన్నవారే. ఇలాంటి రైతులకు అప్పులు పుట్టడం కష్టం. దీంతో పెట్టుబడి కష్టమవుతుంది. అష్టకష్టాలు పడుతున్న రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఏడాదికి  రూ. 12,500 వారి చేతుల్లోనే పెడతాం.

ఈ డబ్బు గతంలో వాళ్లు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులతో సంబంధం లేకుండా ఇస్తాం. డబ్బు చేతికిచ్చి.. వాళ్లు పంటలను వేసుకుంటారో వాళ్లకే వదిలి పెడతాం. ఎకరా విస్తీర్ణంలో పంటలు పెట్టడానికి చాలా పంటలకు 80–90 శాతం పెట్టుబడిగా ఈ 12,500 సరిపోయే పరిస్థితి కన్పిస్తుంది. దీని వల్ల పెట్టుబడి ఖర్చుబాగా తగ్గే అవకాశం ఉంటుంది. పెద్దరైతులకు కూడా ఉపయోగపడుతుంది. పెట్టుబడి తగ్గించే విషయంలో ప్రతి రైతన్నకు చేయబోయే నాల్గో పని ఏమిటంటే.. ఉచితంగా బోర్లు వేయిస్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారి కుటుంబం దీనగాథలు విన్నప్పుడు.. పలుమార్లు బోర్లు వేసి అప్పుల పాలవతున్నాం అని చెబుతున్నారు. బోర్లు వేసినపుడు పడ్డ నీళ్లు సంవత్సరానికల్లా ఆగిపోతున్నాయి. ప్రతి రైతుకు తోడుగా ఉండేందుకు బోర్లు ఉచితంగా వేయిస్తానని చెబుతున్నా.   

Advertisement

తప్పక చదవండి

Advertisement