రాష్ట్రంలో రాక్షస పాలన | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రాక్షస పాలన

Published Wed, Dec 6 2017 1:10 AM

Ys jagan fires on state government - Sakshi

‘రిలయన్స్‌ వంటి ప్రైవేట్‌ సంస్థలతో రేషన్‌ షాపుల స్థానంలో బడా మాల్స్‌ పెట్టిస్తారట. వీటిల్లో ప్రజలకు సరుకులు 20 శాతం తక్కువ ధరకు లభిస్తాయని చెబుతున్నారు. ఇంతకు ముందు రేషన్‌ షాపుల్లో 20 శాతం కాదయ్యా.. 60 శాతం తక్కువ ధరకు దొరికేవయ్యా.. చంద్రబాబు గారూ..’     
    – వైఎస్‌ జగన్‌ 

ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘హత్యలు చేస్తున్నారు.. ఆ కేసుల్లో సాక్షులను బెదిరిస్తున్నారు.. న్యాయం, ధర్మం అనేదే లేకుండా పోయింది.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంద’ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా 27వ రోజు మంగళవారం అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్ద వడుగూరు బహిరంగ సభలో జగన్‌ ప్రసంగించారు. ‘తాడిపత్రి నియోజకవర్గంలోని అప్పేచర్ల గ్రామంలో ఏం జరిగిందో మీ అందరూ చూశారు. సింగిల్‌ విండో అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డిని సింగిల్‌ విండో కార్యాలయానికే పిలిపించి దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసులో సాక్షులుగా ఉన్న వారు తమకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా చేయడానికి వారి ఇళ్లను కూల్చేస్తున్నారు.. అరటి తోటలను నరికేస్తున్నారు.. నాలుగు బోరు బావులనూ పూడ్చేశారు.. ప్రత్యర్థులు పూడ్చేసిన బోరు బావులను మళ్లీ తవ్వుకుంటామని, ఎండిపోయిన మా పంటలను 25 శాతం మేరకైనా కాపాడుకుంటామని బాధితులు ఎమ్మార్వో వద్దకు వెళ్లి వేడుకుంటే... ఆయన మాత్రం అధికారపక్షం ఎమ్మెల్యే వద్దకు పోండి అని సలహా ఇచ్చారట. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? ఈ రాష్ట్రంలో అసలు న్యాయం, ధర్మం ఉందా? ఎక్కడ చూసినా పరిస్థితి దారుణంగా ఉంది.’అన్నారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే.. 

ప్రజలను మోసం చేయడానికే మాల్స్‌ 
బాబు రాకముందు వరకు రేషన్‌ షాపుల్లో తొమ్మిది రకాల సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. వేలి ముద్రలు పడటం లేదని వాటిలో కూడా కోత విధిస్తున్నారు. ఇందులో లోపాలను సరిచేసి పేదలను ఆదుకోవాల్సింది పోయి బడా మాల్స్‌ వారికి వీటిని కట్టబెడతారట. గ్రామాల్లో రేషన్‌ షాపుల స్థానంలో మాల్స్‌ పెడతానని చంద్రబాబు ఇటీవలే ప్రకటించారు. బాబు రాకముందు రేషన్‌ షాపుల్లో ఇచ్చే సరుకుల సబ్సిడీ బిల్లే రూ.2000 కోట్ల నుంచి రూ.3000 కోట్లు ఉండేది. ఇçప్పుడేమో రిలయన్స్‌ వాళ్లు వచ్చి 20 శాతం తక్కువకు అమ్మే విధంగా మాల్స్‌ పెడతారంటున్నావు. ఇంకా మీ సంస్థ (హెరిటేజ్‌)తో భాగస్వామ్యం ఉన్న ఫ్యూచర్‌ గ్రూపునకూ ఇస్తామంటున్నారు. ప్రజలను మళ్లీ మోసం చేయడానికే ఈ ప్రక్రియను మొదలు పెట్టారని మనవి చేస్తున్నా. ఎన్నికలపుడు జాబు రావాలంటే.. బాబు రావాలన్నారు. జాబు ఇవ్వక పోతే ప్రతి ఇంట్లో నిరుద్యోగికి రూ.2000 భృతి ఇస్తానన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చి 45 నెలలైంది. ఇప్పటి వరకూ రూ.90 వేలు ప్రతి ఇంటికీ బాకీ పడినట్లే కదా? అని అడుగుతున్నా. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలన్నా, రూ.87,612 కోట్ల రైతు రుణాలు మాఫీ కావాలన్నా తాను ముఖ్యమంత్రి కావాలన్నాడు. కానీ ఇవాళ బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాక పోగా బ్యాంకులు ఆ బంగారాన్ని వేలం వేస్తున్నట్లు నోటీసులు మాత్రం అందుతున్నాయి. మాఫీ సొమ్ము రైతు రుణాల వడ్డీకి కూడా సరిపోవడం లేదు. పొదుపు సంఘాల మహిళలనూ ఇదే రీతిలో దారుణంగా మోసగించారు. ఇవాళ ఒక్క రూపాయి కూడా మాఫీ కాక పోగా వడ్డీ లేని రుణాలు కూడా కోల్పోయారు. చంద్రబాబు ప్రతి కులాన్నీ మోసం చేశారు.

ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా ఆలోచించండి..
రాష్ట్రంలో యువకులకు చంద్రబాబు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. కొద్దో గొప్పో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉండే ప్రత్యేక హోదాను అమ్మేశారు. ఎన్నికలపుడు 15 ఏళ్లు హోదా కావాలన్న వారు, ఇపుడు ఏకంగా అమ్మేశారు. ఇవాళ కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయి. ఇసుక, మట్టి, మద్యం, బొగ్గు, రాజధాని భూములు.. చివరికి దేవాలయ భూములను కూడా వదల్లేదు. అంతా అవినీతి మయమే. ఈ ముఖ్యమంత్రి వల్ల జన్మభూమి కమిటీల మాఫియా ఊరూరా విస్తరించింది. పింఛను కావాలన్నా, బియ్యం కావాలన్నా, మరుగుదొడ్లు మంజూరు కావాలన్నా వారికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానని ఎన్నికల ముందు చెప్పారు. ఈ నాలుగేళ్లలో ఒక్క ఇల్లైనా కట్టించారా అని ప్రశ్నిస్తున్నా. ఇన్ని మోసాలు చేసిన ఇలాంటి నాయకుడు మనకు కావాలా? అని మిమ్మల్నందరినీ సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇలాంటి నాయకుడిని మనం క్షమిస్తే, రేపు మళ్లీ ఇదే చంద్రబాబు ప్రజల దగ్గరికి వచ్చి ఇంటికొక కేజీ బంగారం, మారుతి కారు.. ఇంకా పెద్ద పెద్దవి కూడా కొనిస్తానని చెబుతాడు. ఇలాంటి రాజకీయాలు మారాలి. ఒక నేత ఏదైనా హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే రాజీనామా చేసి ఇంటికి పోయే పరిస్థితి రావాలి. ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలంటే అందరూ కలిసి ఒక్కటై నాకు తోడుగా నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నా’’అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Advertisement
Advertisement