కేడర్‌లో కొత్త ఉత్సాహం | Sakshi
Sakshi News home page

కేడర్‌లో కొత్త ఉత్సాహం

Published Wed, Jan 24 2018 7:23 AM

ys jagan mohan reddy compleat praja sankalpa yatra in chittoore district - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర జిల్లాలో మంగళవారం ముగిసింది. ఉదయం 8.30 గంటలకు మొదలైన 69వ రోజు పాదయాత్ర నాలుగున్నర కిలోమీటర్ల తరువాత పెళ్లకూరు మండలం, పీసీడీ కండ్రిగ దగ్గర నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించింది. జిల్లా పార్టీ ప్రముఖులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. నారాయణస్వామి, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వెలగపూడి వరప్రసాద్, పార్టీ ఎమ్మెల్యేలు దేశాయ్‌ తిప్పారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి పార్టీ అధినేతను శిబిరం దగ్గర కలిసి కరచాలనం చేసి వినయపూర్వక వీడ్కోలు పలికారు.

సాక్షి ప్రతినిధి, తిరుపతి : ప్రజా సంకల్ప యాత్ర జిల్లా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. పార్టీ అధి నేత, రాజన్నబిడ్డ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో 26 రోజుల పాటు నడిచారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పార్టీ అధినేతను కలిశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల పార్టీ నేతలు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మండల పార్టీ కన్వీనర్లు, వివిధ స్థాయిల్లో పార్టీకి సేవలందిస్తున్న నాయకులందరూ వైఎస్‌ జగన్‌ను కలిశారు. తమ తమ నియోజక వ ర్గాల్లో శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు పార్టీ స్థితిగతులను వైఎస్‌ జగన్‌తో చర్చించారు. అధికార పార్టీ నేతల అరాచకాలను వివరించారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉన్న ప్రత్యేక అభిమానాన్ని దగ్గరగా చూసిన కేడర్‌లో ఉత్సాహం రెట్టింపైంది. పల్లెపల్లెనా రాజన్నబిడ్డకు ప్రజలందిస్తున్న ఆశీర్వచనాలు, ఆదరణ ఎన్నికల్లో కలిసొచ్చే అంశంగా పార్టీ కేడర్‌ భావిస్తోంది. దీనికితోడు బీసీ, ఎస్సీల ఆత్మీయ సమావేశంలో ఆయా సామాజిక వర్గాలకు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన భరోసా చర్చనీయాంశమైంది. ఎస్సీ,ఎస్టీలకు ఉచిత కరెంటు, బోర్లు, స్థానికులకే ఉద్యోగాలు, ఆర్టీసీ విలీనం, ముస్లింలకు సబ్‌ ప్లాన్, బీడీ, చింతపండు కార్మికుల కోసం సమగ్రమైన చట్టం వంటి కీలక ప్రకటనలు అటు ప్రజల్లోనూ, ఇటు కేడర్‌లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

ఎక్కువ దూరం నడక జిల్లాలోనే...
గత ఏడాది నవంబర్‌ ఆరో తేదీ వైఎస్‌ఆర్‌ జిల్లా  ఇడుపులపాయలో ప్రజా సంకల్పయాత్ర ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం వరకూ రాయలసీమలోని 4 జిల్లాల్లో ఉన్న 31 నియోజకవర్గాల్లో 923.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. మన జిల్లాలోనే ఎక్కువ దూరం (291.4 కి.మీ) నడవడం విశేషం. మొదట 9 నియోజకవర్గాలతో రూపొందిన పాదయాత్ర షెడ్యూలు చివరకు 10 నియోజకవర్గాల్లో సాగింది. జనవరి ఒకటి, సంక్రాంతి పండగల రోజుల్లోనూ విపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలోనే ఉన్నారు. అభిమానుల మధ్యనే ఆయన సంక్రాంతి పండగ జరుపుకున్నారు.

జిల్లా ప్రయోజన హామీలు...
దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో ప్రజలందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే జిల్లా ప్రజల కోసం చేయబోయే పనులను విపక్షనేత వైఎస్‌ జగన్‌ వివిధ ప్రాంతాల్లో జరిగిన బహిరంగసభల్లో వివరించారు. అందులో కొన్ని .....
యుద్ధప్రాతిపదికన గాలేరు, నగరి, హంద్రీనీవా ప్రాజెక్టుల పూర్తి
పుంగనూరు బస్‌డిపోకి బస్సుల కేటాయింపు, సదుంలో ఆస్పత్రి పనులు
మూతపడ్డ సహకార చక్కెర ఫ్యాక్టరీలు, విజయా డెయిరీ పునరుద్ధరణ
నల్లబెల్లంపై ప్రభుత్వం విధించిన ఆంక్షల తొలగింపు
శ్రీసిటీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే
ఎస్పీ ఎస్టీ కాలనీల నుంచే భూపంపిణీ ప్రక్రియ ప్రారంభం
జిల్లాలోని పశ్చిమ మండలాల్లో ఉన్న బీడీ, చింతపండు కార్మికుల కోసం సమగ్ర చట్టం

Advertisement
Advertisement