ఎమ్మెల్యే అంటే ఏంటో తెలుసా?: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే అంటే ఏంటో తెలుసా?: వైఎస్ జగన్

Published Thu, Mar 29 2018 6:42 PM

YS Jagan Mohan Reddy Criticise Chandrababu On Projects Matter - Sakshi

సాక్షి, గుంటూరు: స్థానిక పులిచింతలపాడు ప్రాజెక్టుతో రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోందని, అందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన కృషే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 9 ఏళ్ల పాలనలో ఈ ప్రాజెక్టులో ఒక్క ఇటుక కూడా వేయలేదని, కానీ మా కోసం ముందడుగు వేసిన నేత వైఎస్ఆర్ అని రైతులు నేటికీ ఆయనను స్మరించుకుంటున్నారు. ప్రాజెక్టు చేపట్టడమే కాదు పనులన్నీ మహానేత పూర్తిచేయగా, చివర్లో అప్పటి సీఎం కిరణ్ కుమార్‌ రెడ్డి గేట్లు ఎత్తారని వైఎస్ జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు పాలనలో చక్కగా జరిగింది ఒక్కటేనని, అది మరేంటో కాదని కేవలం అవినీతి మాత్రమే బాబు హయాంలో సక్రమంగా జరిగిందంటూ వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెదకూరపాడులో నిర్వహించిన బహిరంగసభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. నాన్న వైఎస్ఆర్‌కు గుంటూరు జిల్లా అంటే ప్రాణమన్నారు. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45 టీఎంసీలు. కాగా, నీటిని నిల్వ చేసుకునేందుకు చంద్రబాబు నాలుగేళ్లు సమయం తీసుకుని రైతులను ఇక్కట్లకు గురిచేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ ఒకేసారి 14 లిఫ్ట్‌లు జారీ చేశారు. వాటి ద్వారా 39 వేల ఎకరాలకు ఆ లిప్ట్‌ల ద్వారా స్థిరీకరణ చేశారు. కానీ చంద్రబాబు నాలుగేళ్ల కాలంలో ఒక్క లిఫ్ట్‌ కూడా తీసుకురాలేదని వైఎస్ జగన్ విమర్శించారు.

ఎమ్మెల్యే అంటే ఏంటో తెలుసా?
ఈ మధ్య కాలంలో ఎం.ఎల్.ఏ అనే సినిమా రిలీజ్ అయింది. మంచి లక్షణాలున్న అబ్బాయి అన్నది మూవీ ట్యాగ్‌లైన్. ఈ నియోజకవర్గానికి వచ్చేసరికి ఎమ్మెల్యే అంటే మాత్రం 'మామూళ్లు లంచాలు తీసుకునే అబ్బాయి' అన్నట్లుగా పరిస్థితి తయారైందన్నారు. ఇష్టం వచ్చినట్లుగా ఇసుక తవ్వేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ఇంత వాటా అని ఉంది, చినబాబుకు ఇంత వాటా అని ఉంది. ఎక్కడైనా అవినీతి చేసేవాళ్లు భయపడతారు. కానీ ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే.. సీఎంకు ఇంతవాటా, ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబుకు ఇంత వాటా అన్నరీతిన అవినీతి జరుగుతోంది. ఇసుక ఎలా తవ్వుతున్నారంటే.. లిఫ్ట్‌లకు నీళ్లు కూడా అందని పరిస్థితి ఉంది. 22 మంది ప్రాణాలు కోల్పోయేలా తవ్వేశారు. ఈ ప్రభుత్వం నదులు, ఇసుక, ఇలా దేన్నీ వదిలిపెట్టలేదు. చివరికి దేవుడి భూములను కూడా టీడీపీ సర్కార్ వదిలిపెట్టడం లేదు. నియోజక వర్గానికి చెందిన సదావర్తి సత్రం భూములు 84 ఎకరాలుండగా.. స్థానిక ఎమ్మెల్యే కోటి రూపాయల విలువ చేసే ఎకరాను.. కేవలం రూ.10 లక్షల ధరకే అప్పనంగా కొట్టేయాలని చూడగా వైఎస్ఆర్ సీపీ అడ్డుకుంది. న్యాయపోరాటం చేసి భూములకు అసలు విలువ దక్కేలా చేసింది.

పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను మోసం చేశాడు చంద్రబాబు. అధికారంలోకొచ్చి నాలుగేళ్లు అవుతోంది. కనీసం ఒక్క రూపాయైనా మాఫీ అయిందా అని అడగగా లేదని సమాధానం వచ్చింది. రైతన్నలకు, పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలకు రాష్ట్ర ప్రభుత్వాలే రుణాలు చెల్లించేవి. బ్యాంకులకు ప్రభుత్వం రుణాల డబ్బు చెల్లించాల్సి ఉండగా, చంద్రబాబు మాత్రం నగదు ఎగ్గొడుతూ రైతులు, పొదుపు సంఘాల అక్కాచెల్లెమ్మలను దారుణంగా మోసం చేశారు. బ్యాంకుల నుంచి బంగారం ఇంటికి వస్తుందో లేదో గానీ నోటీసులు మాత్రం వస్తున్నాయి.

ప్రతి ఇంటికి 96 వేలు బాకీ
ఉద్యోగం లేని వాళ్లకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2 వేలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ నేడు అధికారంలోకొచ్చి దాదాపు 48 నెలలు కావస్తుంది. అంటే ప్రతి ఇంటికీ 96వేల రూపాయలు బాకీపడ్డ చంద్రబాబు ఎక్కడైనా కనిపిస్తే నిలదీయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. గతంలో ఇంటికి రూ.50, రూ.100 కరెంట్ బిల్లు వచ్చేది. ప్రస్తుతం ఇంటికి రూ.500, రూ.1000 బిల్లు వస్తుంది. అదీ చంద్రబాబు సాధించిన ఘనత. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో మూడుసార్లు కరెంట్ చార్జీలు పెంచేశారు. సామాన్యుడిని ఇరుకున పెట్టడం చంద్రబాబు నైజం.

బియ్యం తప్ప.. ఏం ఇస్తలేరు
గతంలో ప్రజలు రేషన్ షాపునకు వెళ్తే బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్, గోదుమపిండి, గోధుమలు, పసుపు, ఉప్పు, చింతపండు, కిరోసిన్ ఇచ్చేవారు. ఇవన్నీ కేవలం 185 రూపాయలకే ప్యాక్ చేసి చేతికి ఇచ్చేవారు. ఇదే చంద్రబాబు పాలనలో బియ్యం తప్ప.. ఇంకేం దొరకడం లేదన్నారు. ఆ బియ్యం కూడా ఇంట్లో ఆరుగురు ఉంటే.. వేలి ముద్రలు సరిగా పడటం లేదని సాకుగా చూపిస్తూ ఇద్దరి వాటా బియ్యం ఆపేస్తున్నారు. 

ఏపీలో బాదుడే బాదుడు
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఇంధన ధరలు గమనిస్తే ఏపీలో బాదుడు అర్థమవుతుంది. ఈ మూడు రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో కనీసం రూ.6, లేక రూ.7 ఎక్కుగా అక్రమంగా వసూలు చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో చక్కగా జరిగింది అదొక్కటే. కేవలం అవినీతి మాత్రమే ఆయన హయాంలో సక్రమంగా జరిగిందంటూ ఎద్దేవా చేశారు. పై స్థాయిలో చంద్రబాబు, లోకేశ్‌లు మేస్తుంటే.. గ్రామస్థాయిలో జన్మభూమి కమిటీలు చివరికీ మరుగుడొడ్లను వదిలిపెట్టకుండా అవినీతి చేశారని ఆరోపించారు.

చంద్రబాబు మంత్రివర్గంలో నలుగురు వైఎస్ఆర్‌సీపీ నుంచి నెగ్గిన ఎమ్మెల్యేలు. కానీ వారి నుంచి రాజీనామాలు చేయించుకుండానే ప్రలోభపెట్టి, కొని తమ పార్టీలో చేర్చుకుని పదవులు కట్టబెట్టారు. అబద్ధాలు, మోసాలు, అవినీతికి పాల్పడటంతో పాటు రాజ్యంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు లాంటి నేతలను బంగాళాఖాతంలో కలపాలన్నారు. పొరపాటున ఆయనను క్షమిస్తే.. మీరు చిన్న చిన్న అబద్ధాలని నమ్మరని చంద్రబాబుకు తెలుసు. దాంతో ప్రతి ఇంటికీ కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తానని నమ్మించే యత్నం చేస్తారు. అయినా మీరు ఆయన మాటలతో మరోసారి మోసపోవద్దన్నారు. ఓటు కోసం రూ.3 వేలు ఇస్తే, మాకు రూ.5 వేలు కావాలని అడిగి మరీ తీసుకోవాలన్నారు. ఎందుకంటే ఆ డబ్బులు మన జేబుల్లోంచి ప్రభుత్వం వసూలు చేసినవేనని వైఎస్ జగన్ చెప్పారు.

రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడాలి

  • ప్రతి పేదవాడి, రైతుల ముఖాల్లో చిరునవ్వు చూసేందుకు నవరత్నాలు ప్రకటించాను.  నేటి అంశం రైతన్నలకు ఏం చేయబోతున్నామన్నది చెబుతున్నా. రైతన్నలు ఎలా ఉన్నారో గుండెల మీద చేతి వేసుకుని ఆలోచించండి. రైతన్నకు పంట సాగు కోసం 9 గంటలపాటు పగటిపూట ఉచిత కరెంట్ ఇస్తాం. 
  • ఖర్చు, పెట్టుబడులు తగ్గించేందుకు రైతన్నల కోసం వడ్డీ లేకుండా పంట రుణాలు అందిస్తాం. దీనివల్ల రైతన్నలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రతి రైతన్నకు మే నెలలో ఒక్కొక్కరికి రూ.12,500 ఇస్తాం. ఎకరా ఉన్న రైతన్నకు డబ్బు చేతికొస్తే ఎకరాకు పెట్టుబడి సమకూరుతుంది. 
  • పంట కోసం రైతన్నలు బోర్ల మీద బోర్లు వేస్తూ నష్టపోతున్నాడు. అందుకే వారికి ఊరట కలిగించేందుకు మేం అధికారంలోకొస్తే ఉచితంగా బోర్లు వేయిస్తామన్నారు. 
  • రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాం. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి ఇది తోడ్పడుతుంది. 
  • అకాల వర్షాలు వస్తే రైతులు అల్లాడిపోతారు. పంట నష్టపోతాడు. అందుకే రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల బాధలు లేకుండా నిధి ఏర్పాటు చేసి వారి ముఖాల్లో చిరునవ్వులు నింపుతాం.
  • పాడి ఉన్న ఇంట సిరులు దొర్లునంట అనే సామెతను ఉదహరిస్తూ.. పాడిపంటలను ప్రోత్సహించి అభివృద్ధికి దోహదం చేస్తాం.
  • సహకారం సంఘాలు నడుపుతున్న పాలకేంద్రాలు మూత పడటానికి కారణం చంద్రబాబే. ఎందుకంటే ఆయనకు చెందిన హెరిటేజ్ సంస్థ నడవాలంటే ఇతర డైరీలు నష్టపోవాలన్నది ఆయన తీరంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు.
  • మూసివేసిన పాలకేంద్రాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. పాల కేంద్రాల్లో రూ.4 సబ్సిడీ అందించి వారికి అదనపు ప్రయోజనాలు చేకూరుస్తాం. మీ అందరి సహకారంతో మన ప్రభుత్వం అధికారంలోకొస్తే వీటి అమలుకు శాయశక్తుల కృషిచేస్తానని వైఎస్ జగన్ అన్నారు. తనకు ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే బస చేసే ప్రాంతానికి వచ్చి ఇవ్వొచ్చని వైఎస్ జగన్ మరోసారి సూచించారు.

Advertisement
Advertisement