Sakshi News home page

బాబు తీరు వల్లే హోదా రాలేదు

Published Sun, Mar 4 2018 1:46 AM

ys jagan mohan reddy fires on CM chandrababu at Thalluru - Sakshi

- ఎప్పుడైతే ప్రత్యేక హోదాపై ప్రజల్లో వేడి పుడుతుందో అప్పుడే చంద్రబాబులో కదలికలు వస్తాయి. నిన్న (శుక్రవారం) చంద్రబాబు తన పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో ఏమన్నారో తెలుసా? ప్రత్యేక హోదా వద్దనలేదట. ఊసరవెల్లి ఎన్ని రంగులు మార్చుతుందో తెలియదు కానీ.. చంద్రబాబు మాత్రం పూటకో రంగు మార్చుతారు. ఆ స్టేట్‌మెంట్‌ చూసి నాకు ఆశ్చర్యమనిపించింది.  

- ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబుకు తెలుసు కాబట్టే తిరుపతి సభలో మోదీ ఎదుట ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు కావాలని అన్నారు. ఇదే చంద్రబాబు మద్దతిచ్చిన బీజేపీ ఎంపీ వెంకయ్య కూడా పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఆ నాడు రాజ్యసభలో అన్నారు. ఆ రోజు వారి మాటలను బట్టి పరిశ్రమలు పెట్టడానికే 3, 4 ఏళ్లు పడుతుంది. హోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు, ఆదాయపన్ను, జీఎస్టీ మినహాయింపు, కరెంటు రాయితీ ఉంటుంది. ఇలాంటి రాయితీలు ఉంటేనే పారిశ్రామికవేత్తలు పరిశ్రమలో, ఆస్పత్రులో, హోటళ్లో పెడతారు. ఇవన్నీ తెలిసీ కూడా చంద్రబాబు దగ్గరుండి ప్రత్యేక హోదాను నీరుగార్చారు. ప్రత్యేక హోదా నాలుగేళ్ల కిందటే వచ్చి ఉంటే ప్రతి జిల్లా హైదరాబాద్‌ మాదిరిగా తయారయ్యే అవకాశం ఉండేది.

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : చంద్రబాబు తీరు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్న పెద్ద మనిషి  ప్యాకేజీ కోసం హోదాను అమ్ముకున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం పోరు తుది దశకు చేరుకుందని, దానిని సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం 102వ రోజు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్లూరులో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రకాశం జిల్లాకు కరువొచ్చిందని రైతులు వాపోతున్నారన్నారు. బాబు అబద్ధా లు, మోసం వల్ల ఈ నాలుగేళ్లలో మనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని చెప్పారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే... 

పూటకో మాటతో మభ్యపెడుతున్నారు.. 
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సంజీవని అన్న పెద్ద మనిషి ఆ తర్వాత ప్లేటు మార్చారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అని వెటకారం ఆడారు. ప్యాకేజీ కావాలంటూ మోసం చేస్తున్నాడు. ఏమీ ఇవ్వకపోయినా ఏదో ఇచ్చినట్టు బొమ్మ (పిక్చర్‌) చూపిస్తున్నాడు. హోదా అనే మన హక్కును నీరుగార్చుతున్నాడు. కానీ ఈయన కేంద్రం నుంచి తెచ్చుకున్న ప్యాకేజీ ఏమిటో తెలుసా? విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే నిర్మించాలి. చంద్రబాబు కేంద్రం వద్దకు వెళ్లి పోలవరాన్ని నాకు ఇవ్వండి.. నేనే కట్టుకుంటాను. నేనే సబ్‌ కాంట్రాక్టులు నా బినామీలకు కట్టబెట్టి కమీషన్లు తీసుకుంటానన్నారు. అన్ని రేట్లు తగ్గినా కూడా విపరీతంగా అంచనాలు పెంచి తన మంత్రి వర్గంలోని యనమల రామకృష్ణుడి వి య్యంకుడికి పోలవరం కాంట్రాక్టు అప్పగించారు. ప్రత్యేక హోదా ఉద్యమం తుది ఘట్టాని కి చేరుకుంది. 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేశాం. ప్యాకేజీతో మోసం చేయవద్దు.. హోదా మా హక్కు అని నినదించాం. ఢిల్లీలో ధర్నా చేసేందుకు నిన్న (శుక్రవారం) ప్రత్యేక రైలు వెళ్లింది. ఇవాళ (శనివారం) ఢిల్లీ వెళ్లే మన ప్రజాప్రతినిధుల బృందానికి జెండా ఊపి బయలుదేరతీశాం. 5న ఢిల్లీలో ధర్నా చేయబోతున్నాం’ అని చెప్పారు.  

ఏమయ్యా.. చంద్రబాబు పార్ట్‌నర్‌.. ఇప్పుడేమంటారు?: ‘చిత్తశుద్ధి ఉంటే అవిశ్వాస తీర్మానం పెట్టమని చంద్రబాబు పార్ట్‌నర్‌ (పవన్‌ కల్యాణ్‌) చెప్పారు. ఆయన ఉద్దేశం ఏదైనా, మరెవ్వరూ వేలెత్తి చూపకుండా విశ్వసనీయతకు అర్థం తెస్తూ ఆ పార్ట్‌నర్‌ సలహా మేరకు ఈనెల 21న అవిశ్వాసం పెట్టబోతున్నాం. చంద్రబాబు గారి పాలిట్‌బ్యూరో మీటింగ్‌ నిన్న జరిగిందని విన్నా. అందులో చంద్రబాబు నాయుడు అన్న మాటలేమిటో తెలుసా? ప్రత్యేక హోదాను ఆయన వద్దనలేదట. దశలవారీగా పోరాటం చేస్తారట. తొలి అస్త్రం కావాల్సిన కేంద్ర మంత్రి పదవులకు ఆఖరున రాజీనామా చేయిస్తారట. అయ్యా.. చంద్రబాబు పార్ట్‌నర్‌ గారూ.. మీరు చంద్రబాబు గారితో నిలబడి రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒకే తాటిపై నిలబడి అవిశ్వాస తీర్మానానికి ముందుకు రండీ అని చెప్పాం. అప్పటికి కూడా కేంద్రం దిగిరాకపోతే పార్లమెంట్‌ సమావేశాల చివరి రోజయిన ఏప్రిల్‌ 6న మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు సమర్పించి ఇంటికి వద్దామని చెబుతున్నా. అలా చేస్తే కేంద్రం దిగివస్తుంది. దేశం మొత్తానికీ ఆంధ్రరాష్ట్రం అంతా ఒక తాటిపై ఉందనే సంకేతాలు పోతాయి. అప్పుడు ప్రత్యేక హోదా అనేది మన హక్కుగా కనిపిస్తుంది. కానీ బాబు తీరు చూస్తుంటే పైకి ఒక మాట.. లోపల ఒక మాటగా ఉంది. సీఎం తీరు వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాని పరిస్థితి ఉంది.’ అని జగన్‌ అన్నారు.

Advertisement
Advertisement