మరీ ఇంత దారుణమా? | Sakshi
Sakshi News home page

మరీ ఇంత దారుణమా?

Published Mon, Jan 1 2018 1:48 AM

YS Jagan Mohan Reddy fires on heritage and chandrababu govt - Sakshi

సాక్షి, తిరుపతి :‘హెరిటేజ్‌ షాపుల్లో కిలో టమాటా రూ.50. రైతు నుంచి కొనుగోలు చేసేది మాత్రం మూడు రూపాయలకా? ఇంత దారుణమా? మనందరి ప్రభుత్వం వస్తే టమాటా రైతుల కోసం జ్యూస్‌ ఫ్యాక్టరీతో పాటు కోల్డ్‌ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులందరినీ ఆదుకుంటాం.’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 48వ రోజు ఆదివారం ఆయన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ఎర్రసానిపల్లి వద్ద టమాటా పొలాన్ని పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులు రామకృష్ణ, శంకర్, సురేందర్‌రెడ్డిలు.. పంట సాగు వివరాలు, గిట్టుబాటు ధర గురించి జగన్‌తో గోడు వెళ్లబోసుకున్నారు. ‘ఎకరంలో పంట సాగు చేయడానికి రూ.లక్ష ఖర్చు వస్తోంది. క్రేటు (టమాటాలు వేసే ప్లాస్టిక్‌ బుట్ట) బాడుగ, ట్రాన్స్‌పోర్టు, కూలి, మల్చింగ్, కట్టెకట్టటం, పురుగు మందుల ఖర్చులే ఎక్కువ. దిగుబడి సుమారు 200 క్రేటులు వస్తోంది.

ఒక క్రేటు అంటే 30 కిలోలు. క్రేటు రూ.100 నుంచి రూ.120 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. ఒక్కోసారి క్రేటు రూ.60 కూడా పలకడం లేదు. ఎకరంలో వచ్చిన పంట మొత్తం అమ్మినా రూ.15 వేలు రావటం లేదు. పంట బాగా వచ్చిందని సంతోషపడాలే తప్ప ధర రావడం లేదు. ఎంత కష్టపడినా అప్పు తీరటం లేదు. ప్రతి వంద రూపాయలకు 4 శాతం కమీషన్‌ చెల్లించాల్సి ఉంది. అయితే మార్కెట్‌లో 10 శాతం వసూలు చేస్తున్నారు. మరో వైపు ఎరువుల ధరలు మాత్రం తగ్గించడం లేదు. డీఏపీ బస్తా ధర రూ.1250కు అమ్ముతున్నారు. ధర పలకనప్పుడు నిల్వ చేసుకునే సదుపాయం లేదు.’ అని వాపోయారు. జగన్‌ మాట్లాడుతూ.. ‘రైతు పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర అందటం లేదు. హెరిటేజ్‌ షాపుల్లో కిలో రూ.50 చొప్పున అమ్ముతున్నారు.

రైతు వద్ద మాత్రం రూ.3 చొప్పున కొంటున్నారు. ఇంత దారుణమా? కాలం మారుతున్నా మదనపల్లి టమాటా రైతుల పరిస్థితి మారడం లేదు. మనందరి ప్రభుత్వం రాగానే మండలానికో కోల్డ్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేస్తాను. గిట్టుబాటు లేకపోతే అందులో నిల్వ చేసుకుని ధర వచ్చినప్పుడు అమ్ముకునే వీలు కల్పిస్తా. జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. సంక్షేమ హాస్టల్‌ విద్యార్థులకు టమాటా జ్యూస్‌ పంపిణీ చేస్తే బాగుంటుంది. ఆ దిశగా ఆలోచన చేద్దాం.’ అని అన్నారు. ఇది ఇలా ఉండగా కొత్త సంవత్సరం సందర్భంగా సాక్షి చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతి చిత్తూరు జిల్లా ముదివేడు సమీపంలోని జగన్‌ విడిది క్యాంపునకు వెళ్లారు. అక్కడికి వచ్చిన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement
Advertisement