సుబ్బమ్మ మరణానికి చంద్రబాబే బాధ్యులు: వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ

Published Fri, Dec 15 2017 2:01 PM

YS Jagan mohan reddy open letter to CM Chandrababu naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో రుణమాఫీ, మద్య నిషేధంతో పాటు పలు హామీల అమలు తీరుపై ఈ సందర్భంగా ఆయన ఈ లేఖలో నిలదీశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పత్తేపురంలో మద్య వ్యతిరేక పోరాటం చేస్తూ మరణించిన ముదునూరి సుబ్మమ్మకు వైఎస్‌జగన్‌ నివాళి అర్పించారు. ఆమె మరణానికి చంద్రబాబే బాధ్యులని ఆరోపించారు.

వైఎస్‌ జగన్‌ లేఖ సారాంశం...‘గ్రామం మధ్యలో తమ ఇళ్ల మధ్యన, మీ ప్రభుత్వ ఆశీర్వాదాలతో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తుంటే పత్తేపురం గ్రామస్తులు కొన్నాళ్లుగా నిరసన తెలుపుతున్నారు. ప్రజల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు పత్తేపురం ఆందోళన ఒక సూచిక మాత్రమే. రెండు రోజుల క్రితం చెరువులో దిగి సుమారు 20మంది మహిళలు ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. వారిలో ముదునూరి సుబ‍్బమ్మ కూడా ఉన్నారు. మీ ప్రభుత్వం చేస్తున్న అఘాయిత్యాన్ని తట్టుకోలేక గుండెపోటుకు గురై ఆమె మరణించారన్న విషయం గ్రామంలో ఎవరిని అడిగినా చెబుతారు. కాబట్టి సుబ్బమ్మది సహజ మరణమా? లేక మీ దుర్మార్గం వల్ల సంభవించిన మరణమా?

బెల్టు షాపుల రద్దుకు సీఎం కాగానే సంతకం పెడతా అని మీరు ఎన్నికలకు ముందు చెప్పారు. మొదటి సంతకాలకు అర్థమేమిటి ముఖ్యమంత్రి గారు?. వైఎస్‌ఆర్‌ ఉచిత విద్యుత్‌ ఫైలు మీద సంతకం పెడితే దాని అర్థం ఆ రోజు నుంచి రైతులందరికీ ఉచిత విద్యుత్‌ లభిస్తుందనే. కరెంటు బకాయిలు రద్దు అంటే మొత్తంగా కరెంట్‌ బకాయిలు అన్నీ ఆ క్షణం నుంచి రద్దు అయ్యాయనే. కానీ మీరు పెట్టిన సంతకానికి అర్థాలు వేరు. పూర్తిగా, బేషరతుగా వ్యవసాయ రుణమాఫీ అని ప్రకటించి.. రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలకు ఇప్పటికి కేవలం రూ.12వేలు కోట్లు కూడా ఇవ్వలేదు. రైతుల వడ్డీలు, చక్రవడ్డీలు లెక్క వేస్తే అవే మీ రుణ మాఫీ కన్నా నాలుగైదు రెట్లు ఎక్కువ ఉన్నాయి. బెల్టు షాపులన్నీ రెండో సంతకంతో రద్దు అన్నారు. బెల్టు షాపులు రద్దు కాలేదు సరికదా.. గ్రామాల్లో నివాసాల మధ్య, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, స్కూల్ల పక్కన మద్యం షాపులకు నాలుగు రెట్లు అనుమతులిచ్చిన ప్రభుత్వం మీదే.

ఈ ఏడాది మద్యం అమ్మకాల్లో మీరు అన్ని రికార్డులు బ్రేక్‌ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి నిన్నటివరకూ మీరు రూ.11వేల కోట్లకు పైగా మద్యం మీదే సంపాదించారు. మొబైల్‌ బెల్టు షాపుల ద్వారా ఇంటింటికీ, గొంతు గొంతుకీ దగ్గరగా.. ఫోన్‌ కొడితే మద్యం బాటిల్‌ వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. డబ్బు కోసం మీరు ఎంతకైనా దిగజారుతారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా?

ఇప్పటికి రాష్ట్రంలో 24 మద్యం డిపోలు ఉంటే మరో 9 డిపోలు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. దీని అర్థం ఏమిటి? మీ మేనిఫెస్టోలో చెప్పిన శ్రీరంగనీతులు సంగతేమిటి? మద్యం వల్ల కుటుంబాలు ఎలా సర్వనాశనం అవుతున్నాయో మీ పాదయాత్రలో మీరు చెప్పిన ప్రవచనాలు సంగతేమిటి? మద్యం మీద మీరు సంపాదిస్తున్నది ఈ ఏడాది రూ.17 వేల కోట్లు, గతేడాది రూ.13,600 కోట్లు అంటే సగటున ఏటా రూ.15వేల కోట్లకు పైగా ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. ఇంత డబ్బు గడిస్తూ నాలుగేళ్లలో కేవలం రూ.11వేల కోట్లే వ్యవసాయ రుణమాఫీకి ఇచ్చారంటే- మీది సంక్షేమ ప్రభుత్వమా? లేక రాక్షస ప్రభుత్వమా?.’  అని సూటిగా ప్రశ్నలు సంధించారు. నేరం చేసినవాడికంటే చేయించిన వాడికి ఎక్కువ శిక్ష ఉండాలన్న సూత్రం ప్రకారం మీకు ఏ శిక్ష విధించినా తక్కువే అని...ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతి మార్చుకోవాలని వైఎస్‌ జగన్‌ సూచించారు.

వైఎస్‌ జగన్‌ బహిరంగ లేఖ పూర్తి సారాంశం...

Advertisement
Advertisement