జనంతో మమేకమై.. వైఎస్‌ జగన్‌ తొలి అడుగులు! | Sakshi
Sakshi News home page

ప్రజా సంకల్పానికి శ్రీకారం

Published Mon, Nov 6 2017 9:00 AM

ys jagan mohan reddy padayatra live updates - Sakshi

సాక్షి, పులివెందుల: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమై.. ఎన్నికల నాటికి ప్రజలు దిద్దిన మేనిఫెస్టోను తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రాత్మకమైన 'ప్రజాసంకల్ప యాత్ర' ప్రారంభించారు. జనసంద్రమైన ఇడుపులపాయలో ప్రజలతో మమేకమై.. పార్టీ నేతలు వెంటరాగా.. వైఎస్‌ జగన్‌ తొలి అడుగులు వేశారు. ప్రజలను పలుకరిస్తూ.. కార్యకర్తలతో ముచ్చటిస్తూ.. ఆయన 'ప్రజా సంకల్ప' యాత్రను కొనసాగిస్తున్నారు.

మహానేతకు నివాళులు..!
అంతకుముందు పులివెందులలో తన నివాసంలో తల్లి విజయమ్మ నుంచి ఆశీస్సులు తీసుకొని.. సోదరి షర్మిల, ఇతర కుటుంబసభ్యులకు వెళ్లొస్తానని చెప్పి.. అశేషమైన అభిమానులు, కార్యకర్తల మద్దతు నడుమ వైఎస్‌ జగన్‌ ఇడుపులపాయకు బయలుదేరారు. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద మహానేతకు కుటుంబసభ్యులతో కలసి వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం జనంతో మమేకమై.. తొలి అడుగులు వేస్తూ 'ప్రజాసంకల్ప యాత్ర'ను ప్రారంభించారు.

జనంతో కిక్కిరిసిపోయిన ఇడుపులపాయ..!
వైఎస్‌ జగన్‌ 'ప్రజాసంకల్ప యాత్ర'కు వేదికైన ఇడుపులపాయలో అశేషమైన జనవాహినితో కిక్కిరిసిపోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద్దసంఖ్యలో ఇడుపులపాయకు చేరుకున్నారు. పెద్దసంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు ఇక్కడకు చేరుకోవడంతో ఇడుపులపాయ కోలహలంగా మారింది. మరికాసేపట్లో ఇక్కడ ఏర్పాటుచేసిన బహిరంగసభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 180 రోజులు 3 వేల కిలో మీటర్ల మేర పాదయాత్ర సాగుతుంది. ఈ యాత్ర ద్వారా 125 నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల బాధలు ప్రత్యక్షంగా చూసి.. సుమారు 2 కోట్ల మందిని స్వయంగా కలుసుకుంటారు.

నేటి పాదయాత్ర ఇలా..
ఇడుపులపాయలో పాదయాత్ర ప్రారంభించి మారుతినగర్‌ మీదుగా మధ్యాహ్నం 1 గంటకు భోజన విరామ ప్రాంతానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభించి వీరన్నగట్టుపల్లె కూడలిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేస్తారు. అక్కడి నుంచి కుమ్మరాంపల్లె మీదుగా వేంపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు.  జగన్‌కు రాత్రి విడిది కోసం టెంట్‌లు ఏర్పాటు చేశారు. ఆయన టెంట్‌లోనే నిద్రపోతారు. ప్రతి రోజు ఉదయం తన కోసం వచ్చిన వారితో పాటు, పార్టీ కార్యకర్తలు, నాయకులను కలుసుకుంటారు. రోజూ ఉదయం 7 కిలో మీటర్లు, సాయంత్రం 7 కిలో మీటర్ల చొప్పున పాదయాత్ర చేసేలా కార్యక్రమం ఖరారు చేశారు. మంగళవారం మధ్యాహ్నానికి పాదయాత్ర కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలోకి ప్రవేశిస్తుంది. రాత్రి ఈ మండలంలోనే ఆయన బస చేస్తారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
Advertisement