Best Unknown Facts About YS Jagan Mohan Reddy | అవమాన పడిన చోటే అభిమానించేలా - Sakshi
Sakshi News home page

అవమాన పడిన చోటే అభిమానించేలా..

Published Thu, May 30 2019 2:17 PM

YS Jagan Mohan Reddy Unknown Facts About Andhra Pradesh Chief Minister - Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన యెదుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి... రాజకీయ ప్రయాణం అనేక ఒడిదుడుకులు, సవాళ్ల మధ్య సాగింది. కష్టానికి నష్టానికి కుట్రలకు కుతంత్రాలకు ఒరవకుండా ఎదురొడ్డి పోరాడగలిగిన వ్యక్తిత్వమే ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టింది. ఈరోజు ఇంతటి ఘన విజయం వెనుక దాదాపు దశాబ్దకాలపు పోరాటం ఉంది. దేశ రాజకీయ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ సాధించని రికార్డును ఆయన సాధించారు. జగన్ తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కలను సాకారం చేసి శభాష్ అనిపించుకున్నారు. 50 శాతం మార్కును చేధించి ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎన్నికల వ్యూహరచన కోసం పార్టీ నాయకులతో సమాలోచనలు జరుగుతున్నఒకానొక సందర్భంలో వైఎస్ అన్న మాటలు గుర్తుచేసుకుంటే... ఎన్నికలంటే అవతలి పక్షం ఎన్నో ఎత్తుగడలు, మరెన్నో తాయిలాలు ఇస్తుంది. అవన్నీ కాదు... మన లక్ష్యం 50 శాతం ఓట్ల మార్కును దాటాలి. అన్ని ఓట్లు తెచ్చుకోవాలంటే మనం అంతమందిని గెలుచుకోవాలి. ఆ లక్ష్యం పెట్టుకున్న తర్వాత అవతలివాళ్ల వ్యూహాలతో మనకు పనేంటి. ఈ మాటలు చాలా తేలికగా అనిపిస్తాయి. కానీ ఆలోచిస్తే ప్రజాస్వామిక భారత దేశంలో ఇంతవరకు సాధ్యం కాలేదన్న వాస్తవం అది. అది వైఎస్ కల. ఆ కలను ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి నిజం చేశారు. టీడీపీతో సహా ఎన్నికల్లో పోటీచేసిన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో పాటు జనసేన, జేడీ(ఎస్), ఆర్జేడీ, ఎస్పీ, ఇండిపెండెంట్లు అన్ని పార్టీలకు పోలైన ఓట్లన్నీ (48.77 శాతం) కలిపినా వైఎస్సార్సీపీకి వచ్చినన్ని రాలేదు.

మొండి కాదు జగమొండి
ఎవరికీ తలవంచని వ్యక్తిత్వం. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం. యోధుడైన తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం. బెదిరింపులకు పాల్పడుతూ రాజీపడాలని ఒత్తిడి చేసిన, రాజీ పడితే అందలమెక్కిస్తామని ఆశలు పెట్టినా తలొగ్గని నైజం. పోరాటం చేస్తూ విజయలక్ష్యం చేరుకోవాలన్న మనస్థత్వం. దాపరికాలు, అడ్డదారులు ఆయనకు ఇష్టముండదు. తెరవెనుక రాజకీయాలంటే ఆయనకు అసహ్యం. చేసేదే చెప్పాలి. చెప్పేది కచ్చితంగా చేయాలి అన్నదే ఆయన సిద్ధాంతం. రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని ఎవరైనా చెప్పినా 'కాని' పని చేయడానికి అసలు ఒప్పుకోరు. ఆ కారణంగా మొండివాడని దగ్గరివాళ్లే పెదవి విరిచినా పెద్దగా పట్టించుకోరు. నమ్మినవారి కోసం నష్టాన్ని కష్టాన్నీ భరిస్తాడే కాని అవసరానికి రాజకీయాలు చేయడం అబ్బలేదు. అతిశయోక్తి కాదు. ఆయనకు ప్రజలుంటే చాలు..! తిండీ నిద్రా ఏవీ గుర్తుకురావు. 

ముక్కుసూటి తత్వం
జగన్ ముక్కుసూటి మనిషి. దాపరికాలు ఉండవు. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు మొహమాటం లేకుండా తన అభిప్రాయాన్ని చెప్పేస్తారు. అవసరమైతే ప్రత్యామ్నాయం సూచిస్తారే తప్ప నచ్చని మార్గాన్ని ఒప్పుకోరు. ఎదుటివారు ఎవరైనా సరే తన అభిమతాన్ని చెప్పేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపోటములకు నాదే బాధ్యత అంటూ వైఎస్ రాజశేఖరరెడ్డి భారమంతా తన భుజస్కందాలపై వేసుకుని ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రాగా, దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక లోక్ సభ సభ్యులను ఈ రాష్ట్రం నుంచి గెలిపించారు. అయితే ప్రజారాజ్యం పార్టీ కారణంగా అనేక చోట్ల కాంగ్రెస్ నష్టపోగా, అధికారంలోకి వచ్చినప్పటికీ అసెంబ్లీలో ఆశించిన స్థాయిలో సీట్లు గెలవలేదని ఏకంగా తండ్రితో వాదనకు దిగిన వ్యక్తి జగన్. సర్వం తన భుజస్కందాలపై వేసుకుని వైఎస్ ఎన్నికలను గెలిపించినప్పటికీ ఆ ఫలితాలు జగన్‌కు పెద్దగా సంతృప్తినివ్వలేదు. ఆయనలో ఎక్కడో తెలియని అసంతృప్తి. ఇక్కడ రాజకీయాలకన్నా జగన్‌కు తన తండ్రిమీద ఉన్న నమ్మకం. ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు సాధించే ఫలితాలపైనే ఆయన దృష్టి తప్ప సాకులు వెత్తుక్కోవడం జగన్‌కు ఇష్టముండదు.

ప్రజలే ఆయన రాజకీయం
2009లో భారీ మెజారిటీతో కడప ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జగన్‌కు తండ్రి అకాల మరణంతో ఊహించని షాక్‌ తగిలింది. సాఫీగా సాగుతున్న జీవితంలో తుపాను చెలరేగింది. రాజకీయ ఎత్తుగడలు ఆయన జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ఏ పార్టీ కోసమైతే ఆయన, ఆయన తండ్రి, ఆయన కుటుంబం శ్రమపడిందో ఆ పార్టీయే బెదిరింపులు, బ్లాక్ మెయిల్‌కు దిగినప్పుడు ఇష్టంలేని చోట కొనసాగలేక, అక్కడ ఇమడలేక ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశారు. 2010 నవంబరు 29న కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేశారు. అనంతరం 2011 మార్చి 12న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారు. ఆ తరువాత ఈ రెండు స్థానాలకూ జరిగిన ఉప ఎన్నికల్లో ఎంపీగా జగన్‌ కనీవినీ ఎరుగని రీతిలో 5.45 లక్షల ఓట్ల పైచిలుకు మెజారిటీతో, విజయమ్మ పులివెందుల నుంచి 75 వేల ఓట్ల భారీ ఆధిక్యతతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హాట్‌ ఫేవరేట్‌గా బరిలో దిగింది. కానీ చంద్రబాబు.. నరేంద్రమోదీ, పవన్‌కల్యాణ్‌ సహకారంతో కేవలం 1.6 శాతం ఓట్లతో గట్టెక్కారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ పులివెందుల నియోజకవర్గం నుంచి 75,243 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఇక 175 స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ 67 గెలిచి ఏకైక ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. అప్పటినుంచి మళ్లీ ప్రజలతో పయనం ప్రారంభించారు. ఎన్నికలయ్యాక మళ్లీ ఎన్నికలు సమీపించే వరకు నాయకులెవరూ సాధారణంగా ప్రజలకు కనిపించరు. అలాంటిది ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో చేరిన నాలుగు రోజులకే ఆయన మళ్లీ ప్రజల బాట పట్టారు. ప్రజలే ఆయన విశ్వాసం. అదే ఆయన నమ్మకం. ఆయన నమ్మకం వమ్ముకాలేదు.  

తండ్రిబాటలో..
ప్రతిపక్ష నేత హోదాలో ప్రజా సమస్యలను తిరుగులేని పోరాటం చేశారు. ప్రజాసంకల్పయాత్ర పేరిట ఆయన సాగించిన సుదీర్ఘ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే ఓ చరిత్ర. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్‌ 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం జగన్‌ను బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద జరిగిన సభలో ఇచ్చిన మాట ఆయన జీవితాన్నే మార్చివేసింది. ఇచ్చిన మాట కాదని రాజీ పడి ఉంటే... అసలు రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉండేవే కాదు. జగన్ ఎన్నో పదవుల్లో కొనసాగేవారు. ఆ మాటపై నిలబడటంలో ఆయన ఎన్నో ఎన్నెన్నో కష్టాలను నష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆయన ఆనాటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా వెనుదిరగలేదు. ఆ మాటపైనే నిలబడ్డారు. ఆయన వ్యతిరేక శక్తులు జగన్‌ను అణగదొక్కాలని చూసేకొద్దీ ఆయన రెట్టించిన ఉత్సాహంతో బలపడుతూ వచ్చారు. తండ్రి ఆశయాలను సాధించాలనే బృహత్తర ఆశయంతో, ఆయన చూపిన ప్రజా సంక్షేమ వెలుగులో ప్రజలకు మరింత చేరువై, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగిన జగన్‌.. జనం మధ్యనే ఉంటూ వచ్చారు. జగన్‌ ఎదుగుదలను సహించని కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ఎన్ని కుట్రలు పన్నినా.. అక్రమ కేసులు పెట్టినా ఆయన సంకల్పం మాత్రం సడలలేదు. పోరాడుతూనే తన నడక కొనసాగించారు. జనం మధ్యే ఉంటూ ఆ రాజన్న రాజ్యం కోసం కష్టపడుతూనే ఉన్నారు. 

అడుగులో అడుగేస్తూ...! 
2017 నవంబర్ 6 వ తేదీ రోజున ప్రారంభించిన ప్రజా సంకల్ప యాత్ర  జగన్ జీవితంలో మరో మైలురాయి. దాదాపు 14 నెలల పాటు ఎండనకా వాననకా 13 జిల్లాల ప్రజలను ప్రత్యక్షంగా కలుస్తూ 3648 కిలోమీటర్ల (కశ్మీర్ నుంచి కన్యాకుమారి కన్నా ఎక్కువ దూరం) మేరకు సాగిన కాలినడకన ఆయన ప్రజలకు మరింత చేరువయ్యారు. తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, సోదరి షర్మిల పాదయాత్రలు ముగించిన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోనే జగన్ పాదయాత్ర పూర్తి చేయడం మరో చారిత్రక ఘట్టంగా మారింది. ప్రజా సంకల్పయాత్రలో 3648 కిలోమీటర్లు నడిచింది నేనైనా నడిపించింది మాత్రం ప్రజలే అని జగన్ చెప్పిన మాటతో ఆయన జనంతో మమేకం కావడమంటే ఎంతిష్టమో తెలియజేస్తుంది. "ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు వేలాది కిలోమీటర్లు పాదయాత్రలు చేయడం... కోట్లాది మంది ప్రజలను ప్రత్యేక్షంగా కలవడం... ప్రపంచ చరిత్రలో ఎవరికీ దొరకని అదృష్టం. ఇది దైవ నిర్ణయం. ఇది ప్రజల ఆశీర్వాదం. కోట్లాది మంది గుండె చప్పుళ్లు వినగలగడం నా జీవితానికే గొప్ప అనుభవం" అని చివరి రోజున జగన్ చెప్పిన మాట. 

జగన్ నిత్యవిద్యార్థి 
ఏదైనా ఒక విషయంమీద మాట్లాడాలన్నా, కొత్త అంశం తెలుసుకోవాలనుకున్నా దాని పూర్తి లోతుపాతులు తెలుసుకునే వరకు నిద్రపోరు. మరీ ముఖ్యంగా ప్రజా సమస్యలకు సంబంధించి తాను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూసినదానిపైనే ఎక్కువ ఆధారపడుతారు. ఏ విషయంలోనైనా పూర్తి అవగాహన రాకుండా మాట్లాడరు. నేర్చుకునే విషయంలో జగన్ నిత్యవిద్యార్థి. అవగాహన చేసుకునే వరకు అడిగి తెలుసుకుంటారు. ఎవరైనా సరే ఒకసారి పరిచయమైతే చాలు ఎన్నేళ్లయినా సరే ఇట్టే గుర్తుపట్టేస్తారు. ప్రజా సమస్యలపై జగన్ స్థాయిలో పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు దేశంలోనే ఉండరేమో. ప్రత్యేక హోదా కావొచ్చు... ఫీజు రీయింబర్స్ మెంట్ కావొచ్చు... సమస్యఏదైనా...దీక్షలు, ధర్నాలు, ఆందోళనలు... జగన్ చేసినన్ని ఎవరూ చేయలేదు. అలాగే లక్షలాది మంది ప్రజలను ప్రత్యేక్షంగా కలుసుకున్న అరుదైన నాయకుడు జగన్.

నంబర్ వన్ గానే ఉండాలన్నదే
ఏ కార్యం మొదలుపెట్టిన అందులో నంబర్ వన్‌గా ఉండాలని కోరుకుంటారు. అది వ్యాపారం కావొచ్చు. అది రాజకీయం కావొచ్చు. అందుకు ముందుచూపు ప్రణాళిక రచించడంలో జగన్ దిట్ట అని ఆయనతో సన్నిహితంగా ఉండేవారంతా చెబుతారు. ఇకపోతే, జగన్ వినరు అని కొందరు పెదవి విరిచినవారే తమ అభిప్రాయం కరెక్ట్ కాదని ఆ తర్వాత సర్దుకున్న సందర్భాలు అనేకమున్నాయి. నచ్చకపోతే నిర్మొహమాటంగా ముక్కుసూటిగా చెప్పడాన్నే అలా అన్వయించి ఆ తర్వాత తమ అంచనా సరికాదని చెప్పిన వారూ ఉన్నారు. అయితే జగన్ ప్రతి విషయాన్నీ ఆయన సావదానంగా వింటారు. తెలియకపోతే అందులో పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇంకా అర్థం కాకపోతే ఎలాంటి వివరాలు కావాలో అడిగి మరీ తెప్పించుకుంటారు. 

అవమాన పడిన చోటే అభిమానించేలా
నమ్మిన వ్యక్తికి, లేదా తనతో నడిచిన వ్యక్తికి ఎంతవరకైనా వెన్నంటి ఉండటం జగన్ స్వభావం. బహుశ తండ్రితోనే తండ్రి నడవడికతోనే అలవడి ఉండొచ్చు. ఎన్నికలకు ముందు జరిగిన ఒక ఘటనను పరిశీలిస్తే జగన్ ఏంటో తెలిసిపోతుంది. అమరావతి రాజధాని వద్ద పంటలను తగులబెట్టిన ఘటన అప్పట్లో తీవ్ర సంచనలం రేపిన విషయం తెలిసిందే. ఆ ఘటనకు జగన్‌ను బాధ్యుడని విమర్శలు గుప్పించిన ప్రభుత్వం అందులో ఆయనను ఇరికించడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా నందిగం సురేష్ అనే ఒక దళితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు. పోలీసులు స్టేషన్‌లో బంధించి పంట తగులబెట్టింది తనే అని ఒప్పుకోవాలని తుపాకి నోట్లో పెట్టి బెదిరించారు. చంపేస్తామని హెచ్చరించారు. కుటుంబాన్ని దూషించారు. లక్షలాది డబ్బు ఇస్తామని ప్రలోభపెట్టారు. పంటలు తగులబెట్టించింది జగన్ అని సురేష్‌తో చెప్పించడానికి ఏకంగా మంత్రులు ఫోన్లు చేసి ఒప్పించే ప్రయత్నం చేశారు. జగన్ అభిమాని అయిన సురేష్ అందుకు అంగీకరించలేదు. ఆ కేసులో సురేష్‌ను ఇరికించడానికి జరిగిన ప్రయత్నం తెలిసిన తర్వాత దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు, నాయకులను సురేష్ ఇంటికి పంపించి ధైర్యం చెప్పించారు. తర్వాత తన ఇంటికి పిలిపించుకుని అక్కున చేర్చుకుని జగన్ ఒక మాట చెప్పారు. ఎక్కడైతే అవమానం జరిగిందో ఎక్కడైతే అవమానపడ్డావో... అక్కడే నీకు అందరి అభిమానం లభించేలా... అక్కడే నీకు గౌరవం దక్కేలా చేస్తానని భరోసా ఇచ్చారు. జగన్ మాటలేవీ ఆరోజు సురేష్‌కు అంతుబట్టలేదు. కానీ జగన్ అదే చేశారు. ఎన్నికల్లో నందిగం సురేష్‌కు బాపట్ల లోక్ సభ టికెట్ ఇవ్వడమే కాకుండా గెలిపించారు. నామినేషన్ వేయడానికి కూడా డబ్బుల్లేని సురేష్ ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడు.

నైతిక విలువలే ఆయన విశ్వాసం
తండ్రి మరణానంతరం రాజకీయ పరిణామ క్రమంలో ఎదురైన చేదు అనుభవాలు, నీతి మాలిన రాజకీయాలు జగన్ జీర్ణించుకోలేకపోయారు. ఎంతటి నీచస్థాయికంటే యావత్ కుటుంబాన్నిదూషించడం, సంస్కారం లేని విమర్శలు చేయడం... ఒకటేమిటి ఎన్నో ఎదుర్కోవలసి వచ్చింది. దొంగ, దోపిడీదారు... అంటూ ఎన్నెన్నో తిట్టిపోశారు. అక్కడే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలు అవసరమని... అంతే ఆ రోజు నుంచి దానికే కట్టుబడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, పార్టీ మారాలనుకునే వారు  అవతలి పార్టీ పక్షాన లభించిన అన్ని పదవులను త్యజించి చేరాలన్న నియమం పెట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవీ కాలం మూడు నెలలు కూడా పూర్తికాకుండానే ఐదేళ్లకు పైబడి పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేసిన తర్వాతగానీ వైఎస్సార్సీపీలో చేర్పించుకోలేదు. ఇలా ఎన్నో ఉదాహరణలున్నాయి. చేయకపోయినా ఫరవాలేదు గాని రైతులకు రుణమాఫీ చేద్దామని 2014 ఎన్నికలకు ముందుఎంతో మంది నాయకులు సూచించినప్పటికీ జగన్ అంగీకరించలేదు. రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ఆరోజు చెప్పి ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని పార్టీ నాయకులు ఇప్పటికీ చెబుతుంటారు. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉదాహరణలు. 

నేపథ్యం
యెడుగూరి సందింటి జగన్ మోహన్ రెడ్డి 1972 డిసెంబరు 21న జన్మించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో (ప్లస్ 2) ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ ప్రగతి మహావిద్యాలయ కాలేజీలో బీకాం పూర్తి చేశారు. ఆ తర్వాత మేనేజ్ మెంట్ కోర్సులో చేరినప్పటికీ ఆయనకు నచ్చలేదు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి, విజయమ్మలకు జగన్ తొలి సంతానం. షర్మిల జగన్ సోదరి. 1996లో భారతీరెడ్డితో వివాహం. వారికి హర్షా, వర్షా ఇద్దరు కూతుళ్లు. జగన్‌కు మితంగా తినడం ఇష్టం. టీ అంటే అందులో గ్రీన్ టీ ఎక్కువ ఇష్టపడుతారు. తెల్లచొక్కాలు ధరించడానికి ప్రాధాన్యతనిస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే తెల్లచొక్కా చేతులు కొంతవరకు పైకి మడిచి ధరిస్తారు. హావభావాలు, ఆహార్యంలోనూ జగన్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డిని స్పష్టంగా చూడొచ్చు.
 - కె. సుధాకర్ రెడ్డి

చదవండి : ఇంతై.. ఇంతింతై.. వటుడింతై

Advertisement

తప్పక చదవండి

Advertisement