ఆరోగ్య శ్రీ పథకంపై వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన | Sakshi
Sakshi News home page

‘రూ. 1000పైన వైద్య సేవలు.. ఆరోగ్య శ్రీలోకి తెస్తాం’

Published Sat, Dec 23 2017 6:50 PM

YS Jagan Owes to Bring Medical Services, which cost more than Rs.1000 to Aarogya Sri - Sakshi

సాక్షి, కదిరి (అనంతపురం): వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ పథకంతో ఒక్క ముందడుగు వేశారు. మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్య శ్రీతో పథకంతో వైఎస్‌ తనయుడిగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తాను. రూ. 1000 కంటే ఎక్కువ ఖరీదయ్యే ప్రతి వైద్య సేవను ఆరోగ్య శ్రీ పథకంలోకి తీసుకువస్తానని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రకటించారు. రాష్ట్రంలో నాలుగేళ్లగా దుర్మార్గ పాలన చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగడాలను ఎండగట్టారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాల్లో ఆరోగ్య శ్రీ పథకం గురించి కదిరి ప్రజలకు ఆయన వివరించారు. అంతకుముందు ప్రజాసంకల్పయాత్రలో తనకు బాసటగా నిలుస్తూ.. అడుగులో అడుగేస్తూ వస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

‘వేల మంది నాతో అడుగులో అడుగు వేస్తూ నడుస్తున్నారు. దారి పొడవునా ఆప్యాయత కురిపిస్తున్నారు. సభ ఏర్పాటు చేస్తే ఇసుక వేస్తే రాలనంత మంది వచ్చారు. ఇంతమంది ఇక్కడకు రావాల్సిన అవసరం లేదు. అయినా చిక్కని చిరునవ్వుతో ఆత్మీయత, ప్రమానురాగాలను పంచుతున్నారు. ముందుగా మీ అందరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు.

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి నాలుగేళ్ల పాలనను చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునివ్వడాన్ని చూశాం. ఇలాంటి పరిస్థితిల్లో మనకు ఎలాంటి నాయకత్వం కావాలి అన్న విషయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనకు అబద్దాలు చెప్పే నాయకుడు కావాలా?. మోసం చేసే నాయకుడు కావాలా? అని అడుగుతున్నా. చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి మాట అబద్దం అన్న విషయం మనకు తెలిసిందే.

ఎన్నికలకు ముందు ఇదే పెద్దమనిషి కరెంటు బిల్లులు షాక్‌ కొడుతున్నాయని అన్నారు. నాలుగేళ్ల క్రితం ఎంత బిల్లులు వచ్చేవి?. ఇప్పుడు బిల్లులు ఎంత వస్తున్నాయి?.  ఐదు నుంచి వెయ్యి రూపాయలు వరకూ బిల్లులు వస్తున్నాయి. నాలుగేళ్లలో మూడు సార్లు కరెంటు బిల్లులు పెంచారు. రేషన్‌ షాపుల్లో రూ. 185కు తొమ్మిది రకాల సరుకులు దొరికేవి. నేడు ఒక్క బియ్యం మాత్రమే అందుబాటులో ఉంటుంది.

చంద్రన్నమాల్స్‌ అని ముఖ్యమంత్రి కొత్త ఎత్తుగడ వేశారు. మంత్రులతో మార్కెట్‌ కన్నా 40 శాతం తక్కువ ధరలు అని ప్రకటనలు ఇప్పించారు. ఆ మాల్స్‌కు అందరం వెళ్లాం. మాల్స్‌లో చక్కెర ధర రూ. 48 (బయట షాపుల్లో రూ. 35), చింతపండు రూ.290(బయట షాపుల్లో రూ.45), కంది రూ.95 (బయట షాపుల్లో రూ. 48), గోధుమ పిండి రూ. 50(బయట షాపుల్లో రూ. 25). ఈ సరుకులు అన్నీ చంద్రబాబుకు వాటాలు ఉన్న ఫ్యూచర్‌ గ్రూప్‌ ద్వారా చంద్రన్న మాల్స్‌లో అమ్మిస్తున్నారు. 40 శాతం తక్కువ ధరలకు సరుకులు ఇస్తామని చెప్పి పేదవాడిని దోచుకోవడం దారుణం.

ఇదే పెద్దమనిషి ఎన్నికలకు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు. జాబు ఇవ్వకపోతే రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాడు. మీకు ఏ చదువు లేకపోయినా ఫర్వాలేదమ్మా ఉద్యోగం ఇస్తాం లేకపోతే భృతి ఇప్పిస్తాం అని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఆ వాగ్దానం చేసి ఇవాళ్టికి దాదాపుగా 45 నెలలు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చంద్రబాబు రూ. 90 వేలు బాకీ పడ్డారు. ఉద్యోగాలు ఇప్పించక పోగా.. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు. ప్రత్యేకహోదా ద్వారా మనకు ఉద్యోగాలు సమకూరతాయి. ఎన్నికలకు ముందు బాబు కూడా ఇదే మాట చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా ప్రత్యేక హోదా వచ్చిందా?. అంతోఇంత ఉద్యోగాలు వచ్చేది ప్రత్యేక హోదా ద్వారానే. ఓటుకు నోటుకు నుంచి బయటపడేందుకు ప్రత్యేక హోదాను అమ్మేసిన దుర్మార్గుడు చంద్రబాబు.

బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నాడు. నాలుగేళ్ల తర్వాత మిమ్మల్ని అడుగుతున్నా మాఫీ జరిగిందా?జ బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేస్తున్నామంటూ నోటీసులు వస్తున్నాయి. పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు అన్నీ మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్నారు. నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా ఒక్క రూపాయైనా మాఫీ జరిగిందా. చంద్రబాబు చెప్పిన మాటలు.. మోసాలు చెప్పుకుంటూ పోతే గంటపైనే పడుతుంది. ఇలా మోసాలు చేసి, అబద్దాలు చెప్పి ఎన్నికల్లో గెలిచి దౌర్జన్యాలు చేస్తున్నారు. ఇసుక నుంచి మట్టి, కాంట్రాక్టులు, బొగ్గు, మద్యం, రాజధాని భూములు, గుడిలో సొత్తు, గుడి భూములను సైతం వదకుండా అవినీతికి పాల్పడుతున్నారు.

గ్రామాల్లో జన్మభూమి కమిటీ పేరుతో మాఫియాలను సృష్టించారు. ప్రతి చిన్న పనికి లంచాలు ఇవ్వాల్సిన స్థితి. మీకు ఇలాంటి నాయకులు కావాలా? అని అడుగుతున్నా. ఒకవేళ ఇలాంటి వ్యక్తిని క్షమిస్తే.. చిన్న మోసాలను ఇక నమ్మరనుకుని పైస్థాయికి వెళ్తాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. అది చాలదంటే ప్రతి ఇంటికి బెంజి కారు ఇస్తానంటాడు. ఈ అబద్దాలు, మోసాలు రాజకీయాల నుంచి పోవాలి. మాట ఇచ్చి నిలబెట్టుకోకపోతే రాజీనామా చేసి ఇంటికి వెళ్లాలి అనే పరిస్థితి రావాలి. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే జగన్‌కు మీ అందరి తోడు కావాలి. మీ ఆశీర్వాదం కావాలి.

కదిరి చుట్టూ రింగ్‌ రోడ్డు వేస్తానని ఎన్నికలకు ముందు బాబు చెప్పలేదా?. మరి రింగ్‌ రోడ్డు మీకు కనిపిస్తోందా?. అనంతలో సెంట్రల్‌ యూనివర్సిటీ, ఎయిమ్స్‌ అనుబంధ కేంద్రం, నూతన పారిశ్రామిక నగరం, హార్టీకల్చర్ హబ్‌, స్మార్ట్‌ సిటీ, టెక్స్‌టైల్‌, ఫుడ్ పార్కులు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ క్లస్టర్‌లను నిర్మిస్తానని బాబు చెప్పారు. నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా అవన్నీ మీకు ఎక్కడైనా కనిపించాయా?. ఇదే కదిరికి సంబంధించిన విలేకరులు ఇక్కడ ఉన్నారు. కదిరిలో ప్రెస్‌ క్లబ్‌ కడతా అన్నారు చంద్రబాబు. కట్టాడా? అని వారిని ప్రశ్నిస్తున్నా. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాలను ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తున్నా. ఆరోగ్యం గురించి వైఎస్ఆర్‌సీపీ ప్రకటించిన పథకం గురించి ఇవాళ చెబుతా.

ఆరోగ్య శ్రీ పథకం :

తెలుగుదేశం పరిపాలనలో కేన్సర్‌ తదితర ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌కు వెళ్తున్నాం. అలా హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకుంటే ఆరోగ్య శ్రీ ఇవ్వడట చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్‌లో వైద్యం చేయించుకుందామంటే కేన్సర్‌కు చికిత్స చేసే ఆసుపత్రలు లేవు. కేన్సర్‌ వ్యాధి నయం కావాలంటే ఏడు నుంచి ఎనిమిది సార్లు కిమోథెరపీ చేయాలి. కానీ, ఆరోగ్య శ్రీ కింద రెండు సార్లు మాత్రమే కిమోథెరపీ చేస్తారట. రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రకు ఆరోగ్య శ్రీ బిల్లులను ప్రభుత్వం సక్రమంగా చెల్లించడం లేదు.

ఒక్క వైఎస్‌ హయాంలో ఆరోగ్య శ్రీ పథకం ప్రజలకు సేవలు ఎలా అందించిందో గుర్తు తెచ్చుకోండి. ఆరోగ్య శ్రీ పథకంతో వైఎస్‌ ఒక్క అడుగు ముందుకు వేశారు. ఆయన బిడ్డగా నేను రెండు అడుగులు ముందుకు వేస్తానని హామీ ఇస్తున్నా.

  • వైద్యం ఖర్చు రూ. 1000 దాటితే ఆరోగ్య శ్రీ పథకం కిందకు వచ్చేలా చేస్తాను.
  • ప్రతి పేదవాడికి కూడా ఎంతటి ఆపరేషన్‌ అయినా ఉచితంగా చేయిస్తాం.
  • వ్యాధి నయం కావడానికి అవసరం అయితే దేశంలోని ఏ పెద్ద ఆసుపత్రిలోనైనా వైద్యానికి ఆరోగ్య శ్రీ పథకం వర్తించేలా చేస్తాం.
  • ఆపరేషన్‌ చేయించుకున్న వ్యక్తి(విశ్రాంతి సమయంలో) కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తాం.
  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే ప్రతి పేదవాడికి రూ. 10 వేలు పెన్షన్‌ను అందిస్తాం.

ఇవన్నీ రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు అమలులోకి తెస్తాం. పేదవాడికే కాదు.. 102 నెంబర్‌కు ఫోన్‌ చేస్తే పశువులకు సైతం వైద్య సదుపాయం కల్పిస్తామని చెబుతున్నా. నవరత్నాల్లో మార్పులకు మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి. నడిచి వెళ్తున్నా. ఎవరు వచ్చినా కలుస్తున్నా. అర్జీలు తీసుకుంటున్నా. మార్పులను సూచించండి. మీ బిడ్డను ఆశీర్వదించండి. సభకు హాజరైన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు.’

ఆరోగ్య శ్రీ పథకంపై వైఎస్‌ జగన్‌ కీలక ప్రకటన

Advertisement

తప్పక చదవండి

Advertisement