63వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

63వ రోజు పాదయాత్ర డైరీ

Published Wed, Jan 17 2018 3:53 AM

ys jagan prajasankalpayatra dairy 63rd day - Sakshi

63వ రోజు
16–01–2018, మంగళవారం
పాదిరేడు, చిత్తూరు జిల్లా

సోమవారంనాడు శిబిరం వద్దనే ఆత్మీయులైన ప్రజల మధ్య సంక్రాంతి పండుగ సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నాను. కుటుంబసభ్యులు కూడా విచ్చేశారు. నాన్నగారి చెంత కొత్త బట్టలు పెట్టి, ఆశీర్వాదం తీసుకున్నాను. కనుమ పండగ రోజు చంద్రగిరి నియోజకవర్గం నుంచి నగరిలోకి ప్రవేశించాను. 

‘ఓ మంచి కుక్కను చంపాలంటే పిచ్చిది అని ముద్ర వేస్తే చాలు’సహకార రంగ సంస్థలను మూసివేయడానికి చంద్రబాబు ఎంచుకున్న కుతంత్రమిది.. అని శ్రీ వేంకటేశ్వర సహకార చక్కెర ఫ్యాక్టరీ కార్మికులు, రైతులు వాపోయారు. కార్మికులకు రెండు సంవత్సరాల నుంచి జీతాల్లేవట. న్యాయంగా రావాల్సిన బకాయిల కోసం కూడా రైతన్నలు కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడక ముందు.. రైతులకు కనీస మద్దతు ధరకన్నా అధిక మొత్తం చెల్లించేవారని, ఇప్పుడు ప్రయివేటు చక్కెర ఫ్యాక్టరీలు రైతులను దోచేస్తున్నా యని అన్నారు. సహకార ఫ్యాక్టరీలంటే ప్రభుత్వానికి బిడ్డల వంటివి. తండ్రివంటివాడే స్వలాభం కోసం ‘మీరెలా బతుకుతారో చూస్తా’అంటూ.. బిడ్డలపై కక్షగట్టినట్లు వ్యవహరించడం ఏపాటి న్యాయం? భారతీయ సహకార వ్యవస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆచార్య వినోబాభావే వంటి మహానుభావులెందరో సహకార వ్యవస్థను పటిష్టం చేస్తూ.. ప్రచారాలు నిర్వహించారు. నేటి మన పాలకుడు మాత్రం వాటి ఉసురు తీస్తున్నాడు. 

‘నోటి కాడ కూడు గద్దలు తన్నుకుపోయినట్లు’పేద మహిళల జీవనోపాధిని కూడా ప్రభుత్వ పెద్దలే దోపిడీ చేస్తుంటే ఆ అన్యాయాన్ని ఎవరితో చెప్పుకోవాలి? భోజన విరామం తర్వాత నన్ను కలిసిన నగరికి చెందిన వరలక్ష్మి అనే అక్కది ఇదే ఆవేదన. పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్స్‌ కుట్టే పనిపై ఆధారపడి వేలాదిమంది పేద మహిళలు జీవించేవారని, ఇప్పుడు కొందరు ఆప్కో ప్రముఖులు తమ స్వలాభం కోసం.. ప్రభుత్వ ముఖ్యులకు లంచాలిచ్చి, రాష్ట్రమంతా యూనిఫామ్స్‌ సరఫరా చేసే పనిని తామే తీసుకుని, యూనిఫామ్‌ బట్ట కూడా మిగుల్చుకుని, తక్కువ సైజులు కుడుతూ.. విద్యార్థులకు చాలీచాలని దుస్తులు సరఫరా చేస్తున్నారని, ప్రభుత్వం నుంచి జతకు నలభై రూపాయలు తీసుకుంటూ.. కుట్టేవారికి మాత్రం ఇరవై రూపాయలే ఇస్తున్నారని వాపోయింది. వేలాది మంది పేద మహిళలు ఆధారపడిన ఈ పథకాన్ని కూడా వారి పొట్టగొట్టి.. ఇలా తమ అక్రమార్జనకు వాడుకుంటుంటే వీరినేమనాలి?

వడమాలలో కలిసిన రావమ్మ.. తాను 19 సంవత్సరాలుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్నానని, గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వడంలేదని, పిల్లల భోజనాలకు ఖర్చుపెట్టిన బిల్లులు కూడా చెల్లించడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. గత ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా, బిల్లుల చెల్లింపు లూ లేకపోతే.. ఈ పేద మహిళలు ఎక్కడి నుంచి డబ్బులు సమకూర్చుకుంటారు? ఈ పథకాన్నెలా కొన సాగిస్తారు? పిల్లలకు ఎలా భోజనం పెడతారు? పిల్లల యూనిఫామ్స్‌ సరఫరా, మ«ధ్యాహ్న భోజన పథకం.. ఈ రెండూ చూస్తే చాలదా ఈ ప్రభుత్వానికి పేద పిల్లల చదువులపై ఏపాటి శ్రద్ధ ఉందో తెలుసుకోవడానికి. 

తడుకు పంచాయతీ సర్పంచ్‌ సుశీలమ్మ అక్క ఓ వినతిపత్రం ఇచ్చింది. 2006లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన 319 మంది వ్యవసాయ కూలీలకు 450 ఎకరాలను నాన్నగారు భూపంపిణీ చేశారట. వాటికి సంబంధించి పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా ఇచ్చారట. ఆ నిరుపేదలు అప్పటి నుంచి వాటిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నారట. 2008లో రుణమాఫీ కూడా జరిగిందట. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక మాత్రం రుణమాఫీ జరగలేదని, 2015, 2016 సంవత్సరాల్లో తుపానులు వచ్చినప్పుడు పంట నష్ట పరిహారం కూడా అందలేదని, తహసీల్దార్, కలెక్టర్‌లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేదని తెలిపింది. నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యవసాయ కూలీలపై కనీస మానవత్వం లేకపోవడం అమానుషం. 

చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ప్రతి సంక్షేమ పథకంలోనూ, ప్రతి కార్యక్రమంలోనూ మీకు అవినీతి సొమ్ము వాటా ఉండాల్సిందేనన్న పథకం ఏమైనా పెట్టుకున్నారా? విచ్చలవిడిగా మీరు, మీ నాయకులు, మీ అనుచరులు అవినీతికి పాల్పడుతూ ఉంటే.. మీరు దానిని పెంచి పోషిస్తుంటే.. పరిపాలనా వ్యవస్థ భ్రష్టు పట్టకుండా ఎలా ఉంటుంది? 


రేషన్‌కార్డు లేదు... పింఛన్‌ రాలేదంటూ తిరుమణ్యం వద్ద జగన్‌కు చెబుతున్న 102 ఏళ్ల వృద్ధురాలు కాంతమ్మ 

Advertisement
Advertisement