చిరు బతుకులకు ఆర్థిక భరోసా | Sakshi
Sakshi News home page

చిరు బతుకులకు ఆర్థిక భరోసా

Published Mon, Apr 1 2019 4:18 AM

YS Jagan Promises In Guduru and Giddalur and Darsi Election Campaign - Sakshi

ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మనకు కనిపించేది ఏమిటంటే.. ప్రతి అడుగులోనూ మోసం.. మోసం.. మోసం. రాజకీయ వ్యవస్థను చంద్రబాబు ఎంతలా దిగజార్చాడో ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ ఒక అబద్ధం, మోసం, కుట్ర కనిపిస్తున్నాయి. మరో 11 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కుట్రలు ఇక తారస్థాయికి చేరుతాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి
– గూడూరు సభలో..

నిరుద్యోగ యువతకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. మన దగ్గర ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను మన పిల్లల్లో పెంపొందించడానికి ప్రతి జిల్లాలో స్కిల్‌  డెవలప్‌మెంట్‌ సెంటర్లు నెలకొల్పుతాం
– గిద్దలూరు సభలో..

చంద్రబాబు హయాంలో అన్ని ధరలు పెరిగిపోయాయి. ప్రజల ఆదాయం మాత్రం తగ్గిపోయింది. బాబు అధికారంలోకి రాగానే ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు. నీటి పన్నులు బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు. పొరపాటున చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే ఇక వీర బాదుడు తప్పదు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు/ఒంగోలు:  రెక్కాడితే గానీ డొక్కాడని బడుగు జీవులను అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావడమే తన ధ్యేయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిన బూనారు. సొంత ఆటోలు, ట్యాక్సీలు నడిపించుకునే డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు, ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు, హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, ఆర్టీసీ కార్మికులు, సంఘమిత్రలు, వీఏవోలు, వెలుగు యానిమేటర్లు.. ఇలా అందరి కష్టాలు, బాధలు తనకు తెలుసు అని స్పష్టం చేశారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారి కన్నీళ్లు తుడుస్తామని హామీ ఇచ్చారు. చాలీచాలని సంపాదనతో బతుకులీడుస్తున్న వారికి ఆర్థికంగా తోడ్పాటునందించి ఆదుకుంటామని చెప్పారు. ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులపై కూడా జగన్‌ వరాల వర్షం కురిపించారు. ఆయన ఆదివారం నెల్లూరు జిల్లా గూడూరు, ప్రకాశం జిల్లా గిద్దలూరు, దర్శిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భ్రష్టుపట్టిపోయిన నేటి రాజకీయ వ్యవస్థలో మార్పు కోసం ఎన్నికల్లో ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మూడు సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే...  

ఆ విద్యార్థి ఆత్మహత్యను మర్చిపోలేను  
గూడూరు  సభలో..
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతోనే 3,648 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయగలిగాను. పాదయాత్రలో మీ బాధలు విన్నాను, కష్టాలు చూశాను. రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఏం కోరుకుంటోందో తెలుసుకున్నాను. ప్రభుత్వం నుంచి సాయం అందక అవస్థలు పడుతున్న ప్రతి పేదవాడికీ చెబుతున్నా.. మీకు నేనున్నాను అని హామీ ఇస్తున్నా. గిట్టుబాటు ధరలు అందక రైతన్నలు పడుతున్న బాధలు చూశా. గూడూరు నియోజకవర్గంలో నిమ్మ రైతుల ఆవేదన విన్నాను. రుణాలు మాఫీ కాక అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం పట్టించుకోలేదని వారు మొరపెట్టుకున్నారు. పాదయాత్రలో దారిపొడవునా ప్రతిరోజూ బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల బాధలను విన్నాను. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక, ఆస్తులమ్ముకుంటే తప్ప పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఉంది. తల్లిదండ్రుల కష్టాన్ని చూడలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. ఇదే జిల్లాలోని ఆత్మకూరులో విద్యార్థి ఆత్మహత్య ఘటనను నా జీవితంలో మర్చిపోలేను. ఇంజనీరింగ్‌ చదువుకు ఏడాదికి రూ.లక్ష ఫీజు కట్టలేక తన బిడ్డను పోగొట్టుకున్నానని ఆ విద్యార్థి తండ్రి చెప్పాడు.  

హోదాను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు ఎవరు?  
‘108’కు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌ సకాలంలో రాక తమ కుటుంబ సభ్యులు చనిపోయారని పాదయాత్రలో చాలామంది చెప్పారు. రోగం వస్తే ఆరోగ్యశ్రీ పథకం వర్తించక, వైద్యం కోసం రూ.లక్షల్లో అప్పులు చేయాల్సి వచ్చిందని ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేశారు. పక్షవాతం వచ్చి కుర్చీలకే పరిమితమైన రోగులు నన్ను కలిశారు. మందులకు వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయని, ప్రభుత్వం తమను ఆదుకోవడం లేదని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సంఘటనలను నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మద్యం దుకాణాలు ఎక్కువైపోయి, మద్యం కాటుకు చిన్నాభిన్నమైన కుటుంబాలను చూశాను. రాత్రి 7 గంటలు దాటితే మన అక్కచెల్లెమ్మలు ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టే పరిస్థితి లేకుండా పోయింది. తమ పిల్లలను చదివించుకోవడానికి కూలీలకు వెళ్తున్న అక్కచెల్లెమ్మల బాధలు విన్నాను. ఇదే జిల్లాలో చదువుకున్న పిల్లలు, నిరుద్యోగ యువత పాదయాత్రలో నన్ను కలిశారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి మేలు చేయడానికి దుగరాజపట్నం పోర్టు అవసరం లేదని చెప్పడానికి చంద్రబాబు ఎవరని వారు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే తమ బతుకులు మారుతాయని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ, హోదాను తాకట్టు పెట్టడానికి చంద్రబాబు ఎవరని వారు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన నాటికి ఏపీలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా కమల్‌నాథన్‌ కమిటీ లెక్కలు తేల్చింది. ఈ ఐదేళ్లలో 90 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. అంటే మొత్తం ఖాళీల సంఖ్య 2.30 లక్షలపైమాటే. కానీ, ఒక్కటంటే ఒక్క పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదని నిరుద్యోగులు బాధపడుతున్నారు.  

సీఎం ఇచ్చిన హామీ అమలు కాదా?   
తెలుగుగంగ బ్రాంచ్‌ కెనాల్‌ను గూడూరు ప్రాంతం వరకు విస్తరింపజేస్తామని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు హామీ ఇచ్చాడు. కానీ, నిలబెట్టుకోలేదు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలు కాని పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? అని ప్రజలు నన్ను అడిగారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.63 కోట్లతో కండలేరు నుంచి పైపులైన్ల ద్వారా గూడూరుకు తాగునీరు అందించారు. ఆ పథకాన్ని టీడీపీ పాలకులు సక్రమంగా నిర్వహించడం లేదని ప్రజలు చెప్పారు. గూడూరు–1, గూడూరు–2ను కలిపే ఫ్లైఓవర్‌ నిర్మాణం అంగుళం కూడా ముందుకు కదలడం లేదు. గతంలో నేను చూసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. ప్రజలందరికీ మరోసారి హామీ ఇస్తున్నా.. మీకు నేనున్నాను. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మనకు కనిపించేది ఏమిటంటే.. ప్రతి అడుగులోనూ మోసం.. మోసం.. మోసం. రాజకీయ వ్యవస్థను చంద్రబాబు ఎంతలా దిగజార్చాడో మీరంతా చూస్తూనే ఉన్నారు. ప్రతిరోజూ ఒక అబద్ధం, మోసం, కుట్ర. మరో 11 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కుట్రలు ఇక తారస్థాయికి చేరుతాయి. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.  

ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాం.. 
ఎన్నికలు దగ్గరకొచ్చే సరికి చంద్రబాబు చేయని కుట్ర ఉండదు. ప్రతి గ్రామానికీ మూటలు మూటలు డబ్బులు పంపిస్తాడు. ప్రతి ఓటర్‌ చేతిలో రూ.3 వేలు పెట్టి, మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దని మీ గ్రామాల్లో, మీ వార్డుల్లో ప్రతి ఒక్కరికీ చెప్పండి. 11 రోజులు ఓపిక పట్టండి, మన అందరి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పండి. అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ‘అమ్మ ఒడి’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.15 వేలు ఇస్తాడని అక్కచెల్లెమ్మలకు చెప్పండి. ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళలకు అప్పు ఎంతైతే ఉంటుందో అంతే సొమ్మును నాలుగు దఫాల్లో నేరుగా మీ చేతుల్లోనే పెడతాడని చెప్పండి. మళ్లీ సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తాడని, ప్రతి అక్కచెల్లెమ్మను లక్షాధికారులను చేస్తాడని తెలియజేయండి.

45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకం కింద నాలుగు దఫాల్లో రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి. చంద్రబాబుకు అధికారం అప్పగిస్తే రుణాలు మాఫీ చేయకుండా మోసం చేశాడని రైతన్నలకు చెప్పండి. జగనన్న ముఖ్యమంత్రి అయితే పెట్టుబడి కోసం ‘రైతు భరోసా’ కింద ప్రతి ఏడాది మే నెలలో నేరుగా ప్రతి రైతన్న చేతిలో రూ.12,500 పెడతాడని చెప్పండి. నాలుగేళ్లలో రూ.50 వేలు ఇస్తాడని చెప్పండి. సున్నా వడ్డీలకే రుణాలు ఇప్పిస్తాడని చెప్పండి. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే కాదు, గిట్టుబాటు ధరలకు గ్యారంటీ కూడా ఇస్తాడని చెప్పండి. 11 రోజులు ఓపిక పడితే మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడు, పెన్షన్‌ను రూ.3 వేల దాకా పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వాతాతకు చెప్పండి. అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుందామని నిరుద్యోగ యువతకు, చదువుకుంటున్న పిల్లలకు చెప్పండి. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను అన్న భర్తీ చేస్తాడని తెలియజేయండి. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అన్న ఇల్లు కట్టిస్తాడని చెప్పండి. మనం ప్రకటించిన నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని ప్రతి ఇంటికీ చేర్చండి. 

1,150 కోట్లతో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఉపశమనం  
దర్శి సభలో..
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాను, బాధలు తెలుసుకున్నా. అందుకే మీకు నేనున్నాను అని భరోసా ఇస్తున్నా. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,150 కోట్లు కేటాయించి, 13 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ఉపశమనం కలిగిస్తాం. ఏపీఎస్‌ఆర్టీసీలో 65 వేల మంది కార్మికులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇస్తున్నా.. అధికారంలోకి రాగానే సీపీఎస్‌ రద్దు చేస్తాం. 27 శాతం ఐఆర్‌ ఇస్తాం. న్యాయవాదులకు మొదటి మూడేళ్ల పాటు స్టైఫండ్‌ కింద నెలనెలా రూ.5 వేలు అందజేస్తాం. వారికోసం రూ.100 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం. సంఘమిత్రలు, వీఏవోలు, వెలుగు యానిమేటర్ల వేతనాలను రూ.10 వేలకు పెంచుతాం. సొంత ఆటో ఉన్న ఆటోడ్రైవర్లకు, సొంత ట్యాక్సీ ఉన్న ట్యాక్సీ డ్రైవర్లకు సంవత్సరానికి రూ.10 వేలు ఇస్తాం. ఇన్సూరెన్స్, వాహనాల మరమ్మతులు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లకు ఈ సొమ్ము ఉపయోగపడుతుంది. షాపులున్న నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు కూడా సంవత్సరానికి రూ.10 వేలు అందజేస్తాం. ఫుట్‌పాత్‌లపై చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారికి గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. అంతేకాకుండా వడ్డీ లేని రుణం రూ.10 వేలు ఎప్పుడు కావాలన్నా ఇస్తాం. అలాగే హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లకు పక్క రాష్ట్రం తెలంగాణలో కంటే రూ.వెయ్యి ఎక్కువ జీతం ఇస్తాం.  

గిట్టుబాటు ధరలు ఎగ్గొట్టాడు..: చంద్రబాబు ఈ ఐదేళ్లలో ప్రకాశం జిల్లాకు ఏమిచ్చాడు? నాగార్జున సాగర్‌ కుడి కాలువ కింద ప్రకాశం జిల్లాకు 60 టీఎంసీల నికర జలాలు ఇవ్వాల్సి ఉండగా, ఐదేళ్లలో ఒక్క సంవత్సరమైనా 20 టీఎంసీలకు మించి ఇవ్వలేదు. బాబు వచ్చాడు, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో వెలుగొండ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరిగాయి. చంద్రబాబు పాలనలో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు పెంచేసి, బినామీ కాంట్రాక్టర్లకు పనులు కట్టబెట్టి, డబ్బులు గుంజుకున్నారు.  

పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే...: చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అవినీతి, అబద్ధం, మోసాలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదు. ఆయనకు మళ్లీ పొరపాటున ఓటు వేస్తే.. ఈసారి ప్రభుత్వ బడులు ఉండవు. ఐదేళ్ల బాబు పాలనలో ఇప్పటికే 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసేశారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. ఇప్పటికే ప్రతి మండల కేంద్రంలో నారాయణ స్కూళ్లు వెలిశాయి. మళ్లీ బాబుకు ఓటేస్తే గ్రామగ్రామాన నారాయణ స్కూళ్లు వస్తాయి. నారాయణ స్కూళ్లలో యల్‌కేజీకి రూ.25 వేలు గుంజుతున్నారు. ఇంజనీరింగ్‌ చదవాలంటే రూ.5 లక్షలు కట్టక తప్పదు.
  
నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే..: చంద్రబాబు పాలనలో ఆర్టీసీ చార్జీలు బాదుడే బాదుడు. కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. ఇంటి పన్నులు బాదుడే బాదుడు. నీటి పన్నులు బాదుడే బాదుడు. పెట్రోల్, డీజిల్‌ ధరలు బాదుడే బాదుడు. బాబు హయాంలో అన్ని రేట్లు  పెరిగిపోయాయి. పొరపాటున చంద్రబాబుకు మళ్లీ ఓటేస్తే ఇక వీర బాదుడు తప్పదు. బాబుకు మళ్లీ ఓటేస్తే ప్రజల జీవితాలను జన్మభూమి కమిటీల సభ్యులే శాసిస్తారు. బాబు మరోసారి అధికారంలోకి వస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలను రద్దు చేస్తాడు. ధరలు ఇంకా పెంచేస్తాడు. తనను వ్యతిరేకించే వారిని బతకనివ్వడు. మనుషులను చంపినా కేసులు ఉండవు. మీడియా ఇప్పటికే చంద్రబాబుకు అమ్ముడుపోయింది. నరమాంసం తినే అందమైన రాక్షసిని నమ్మితే ఏమవుతుందో ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పే మాటలు విని నమ్మితే కూడా అదే అవుతుంది.    

బాబు మళ్లీ అధికారంలోకి వస్తే పేదల భూములు, ఇళ్లను లాక్కుంటాడు. వెబ్‌ల్యాండ్‌లో భూరికార్డులను తారుమారు చేస్తున్నారు. పొరపాటున బాబుకు ఓటేస్తే నదులు, ఇసుక, కొండలు, గుట్టలు, మట్టి, పొలాలు ఏవీ మిగలవు. మొత్తం దోచుకుంటాడు. బాబు అధికారంలోకి వస్తే రూ.లక్ష పెట్టి లారీ ఇసుక కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తుంది. 

మన పిల్లలకు మన దగ్గరే ఉద్యోగాలు
గిద్దలూరు సభలో..
చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నాడు. నిరుద్యోగులను గాలికొదిలేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి అన్ని విధాలా అండగా ఉంటాం. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. మన దగ్గర ఏర్పాటయ్యే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేలా మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టాన్ని తీసుకొస్తాం. దీనివల్ల మన పిల్లలు మన దగ్గరే ఉద్యోగాలు చేసుకోవచ్చు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను మన పిల్లల్లో పెంపొందించడానికి ప్రతి జిల్లాలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు నెలకొల్పుతాం. ఆ సెంటర్లలో పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇప్పిస్తాం. ఆర్టీసీతోపాటు ఇతర ప్రభుత్వ శాఖలు ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి బస్సులు, కార్లను అద్దెకు తీసుకుంటున్నాయి. మన ప్రభుత్వం వచ్చాక ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతకే కల్పిస్తాం. వారు బస్సులు, కార్లు కొని ప్రభుత్వానికి అద్దెకు ఇచ్చుకోవచ్చు. ఆయా వాహనాలు కొనుక్కోవడానికి సబ్సిడీ కూడా ఇస్తాం. ఇందులోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకే ఇస్తాం.  

బాబు పాలనలో ఉద్యోగాలు గోవిందా..
దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. కానీ, మన రాష్ట్ర రైతులు దేశంలోనే అత్యంత నిరుపేదలని ‘నాబార్డు’ నివేదికలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో డ్వాక్రా మహిళల అప్పులు 14,200 కోట్ల నుంచి రూ.26,000 కోట్లకు చేరాయి. నిరుద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. చంద్రబాబు హయాంలో రైతులు, యువత, మహిళలు ఎవరైనా బాగుపడ్డారా? బాబు వస్తే జాబు వస్తుందన్నారు. కానీ, బాబు పాలనలో ఉద్యోగాలన్నీ గోవిందా. 30 వేల మంది ఆదర్శ రైతుల ఉద్యోగాలు గోవిందా. 3,500 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్ల ఉద్యోగాలు గోవిందా. 1,000 మంది గోపాలమిత్రల ఉద్యోగాలు గోవిందా. ఆయుష్‌ శాఖలో 800 ఉద్యోగాలు గోవిందా. సాక్షర భారత్‌లో 30,000 ఉద్యోగాలు గోవిందా. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న 85,000 మంది అక్కచెల్లెమ్మల ఉద్యోగాలు గోవిందా. అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఆశావర్కర్లు, వెలుగు సిబ్బంది జీతాలు పెంచమని కోరితే చంద్రబాబు తన పోలీసులతో కేసులు పెట్టించాడు.  

తాగునీటి వెతలు తీరుస్తాం..
గిద్దలూరు నియోజకవర్గంలో తాగునీటి కొరత గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేని గ్రామం ఎక్కడుందో చెప్పాలి. 6 నెలలుగా రూ.10 కోట్లు బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్‌ సమస్య అధికంగా ఉంది. ప్రజలు మోకాళ్ల నొప్పులు, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ సమస్యలు తీరాలంటే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలి. ప్రజలకు తాగునీటితోపాటు 80 వేల ఎకరాలకు సాగునీరు అందించే వెలుగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 12 కిలోమీటర్ల పని పూర్తి చేశారు. రెండో టన్నెల్‌లో 8 కిలోమీటర్ల పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇంతకంటే అన్యాయమైన పాలన ఎక్కడైనా ఉంటుందా? గిద్దలూరు నియోజకవర్గంలో 14 గ్రామాలకు తాగునీరు అందించే బైరేని గుండాల ప్రాజెక్టును వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే 50 శాతం పూర్తి చేశారు. మిగిలిన 50 శాతం పనులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజల వెతలను పట్టించుకునే వారే లేకపోవడం దారుణం. రేపు మన ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులను పూర్తిచేసి ప్రజలకు తాగునీరు, పంటలకు సాగునీరు అందిస్తాం.  

ప్రజల ఇళ్లకే ప్రభుత్వ పథకాలు..
నా సుదీర్ఘ పాదయాత్రలో నిరుద్యోగ ఇబ్బందులను ప్రత్యక్షంగా చూశా. అందుకే రేపు మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల పోస్టులను భర్తీ చేస్తాం. పోస్టుల భర్తీకి ప్రతి ఏటా జనవరి 1వ తేదీన క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తాం. చదువుకున్న 10 మందికి గ్రామంలోనే ఉద్యోగాలిస్తాం. ప్రతి 50 మందికి ఒక వలంటీర్‌ను నియమిస్తాం. ప్రభుత్వం నుంచి  ఏ సాయం కావాలన్నా ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పనిలేదు. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే చాలు, 72 గంటల్లో పరిష్కరిస్తాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల ఇళ్లకే చేరవేస్తాం.  

Advertisement

తప్పక చదవండి

Advertisement