బాబు ప్రేమకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు | Sakshi
Sakshi News home page

బాబు ప్రేమకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

Published Tue, Feb 13 2018 5:59 PM

YS Jagan Slams Chandra Babu At Kaligiri Public Speech - Sakshi

కలిగిరి(ఉదయగిరి నియోజకవర్గం), శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు : తాగు, సాగు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల కోసం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. 86వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.

‘ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాలో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎక్కువగా ఉన్నారు. సాధారణంగా నీటిలో ఫ్లోరైడ్‌ ఒక శాతం మాత్రమే ఉండాల్సివుండగా.. ఈ ప్రాంతాల్లో 2.25 శాతంగా ఉంది. దీన్ని ప్రజలకు ఉపశమనం కలగాలంటే కచ్చితంగా ప్రాజెక్టుల ద్వారా తాగునీటిని అందించాలి. చంద్రబాబు కలలో కూడా ఊహించని విధంగా శ్రీశైలం నుంచి రెండు సొరంగ మార్గాల ద్వారా వెలిగొండ ప్రాజెక్టుకు తేవాలని వైఎస్‌ నిశ్చయించుకున్నారు.

అందుకు పనులు ప్రారంభించారని, సగంపైగా పూర్తైన సమయంలో మనల్ని వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాలుగేళ్లలో పనులు పూర్తి చేయలేకపోయారు. కేవలం రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర సొరంగాలను తవ్వలేక పోయిన బాబు కంటే అసమర్ధుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా?. నాలుగేళ్ల బాబు పాలనను చూశాం. మరో ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయని చెబుతున్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో మనం సంతోషంగా ఉన్నామా? అని ప్రతి ఒక్కరూ మనస్సాక్షిని అడిగి ఆలోచించండి.

చంద్రబాబు పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. ప్రతి ఒక్కరికీ బైక్‌లు ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. పెట్రోల్‌, డీజిల్‌లు మనరాష్ట్రంలో కంటే పక్క రాష్ట్రాల సరిహద్దులకు వెళ్తే లీటర్‌ రూ. 7, రూ. 6లు తక్కువగా దొరుకుతోంది. ఇంతటి దారుణంగా బాబు పాలిస్తున్నారు. దేశంలో అత్యధికంగా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. బియ్యం తెచ్చుకునే దాని కోసం అందరూ వెళ్లేది రేషన్‌ షాపులకు. బియ్యం, చక్కెర, కందిపప్పు, పామాయిల్‌, గోధుమలు, గోధుమ పిండి, కారం, పసుపు, ఉప్పు, చింతపండు, కిరోసిన్‌ ఇలా అన్నీ దొరికేవి బాబు అధికారంలోకి రాక ముందు.

కేవలం రూ.185లకే అవన్నీ లభ్యమయ్యేవి. ప్రస్తుతం బాబు పాలనలో రేషన్‌ షాపులకు పోతే బియ్యం తప్ప ఏమీ దొరకని స్థితి. ఆ బియ్యం కూడా వేలిముద్రలు పడటం లేదని చెప్పి ఇవ్వకుండా ఆపేస్తున్నారు. నాలుగేళ్ల కిందట మనకు ఇంట్లో కరెంటు బిల్లులు ఎంతొచ్చేవో గుర్తు తెచ్చుకోండి. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కరెంటు బిల్లులు షాక్ కొడుతున్నాయి. అధికారం చేపట్టాక బిల్లులు తగ్గిస్తాను అని అన్నాడు. ఇవాళ రూ. 500, రూ. వెయ్యి చొప్పున కరెంటు బిల్లులు వస్తున్నాయి.

పిల్లలు మద్యం సేవించి చెడిపోతున్నారు. మద్యం షాపులు మూయిస్తాను అన్నాడు. మద్యాన్ని తగ్గించడం సంగతి దేవుడు ఎరుగు. పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి గ్రామంలో మినరల్‌వాటర్‌ ప్లాంట్‌ లేదు కానీ దాని స్థానంలో మద్యం షాపును ఉంచారు చంద్రబాబు. మద్యం కావాలని ఫోన్‌ కొడితే ఇంటికి తెచ్చే హైటెక్‌ పాలనకు తెరతీసిన ఏకైక సీఎం బాబే. పేదలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రాలేదు. కానీ బ్యాంకులు వాళ్లు పంపుతున్న వేలం నోటీసులు మాత్రం వస్తున్నాయి. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానన్న పెద్ద మనిషి రైతులను మోసం చేశారు. రుణమాఫీ పేరుతో బాబు ఇచ్చిన డబ్బు రైతుల అప్పుల వడ్డీలకు సరిపోలేదు. ఆయన చూపిన ప్రేమకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఆఖరకు అక్కచెల్లెమ్మలనూ చంద్రబాబు వదిలిపెట్టలేదు. ఇదే పెద్ద మనిషి సీఎం అయి నాలుగేళ్లు అయింది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఇవాళ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు రుణాలు చెల్లించలేదని, బ్యాంకు అధికారులు వారి ఇళ్లకు తాళాలు వేస్తున్నారు. జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నాడు. ప్రతి ఇంటికి పాంప్లెట్‌తో కార్యకర్తను పంపాడు. అమ్మా మీ పిల్లలు ఏమీ చదవక పోయినా.. ప్రతి ఇంటికి చంద్రబాబు ఉపాధి ఇస్తాడు అని చెప్పించాడు.

ప్రతి ఇంట్లో ఆ లేఖ ఇచ్చారా? లేదా?. ఒకవేళ ఉపాధి ఇవ్వలేకపోతే రెండు వేలు ఇస్తామని రెండేళ్లు ఎత్తి చూపించారు. చూపించారా? లేదా?. నేటికి 45 నెలలు అవుతోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చంద్రబాబు రూ. 90 వేలు బాకీ పడ్డాడు. ఆయన మీకు కనిపిస్తే మా డబ్బులు ఇవ్వండని నిలదీయండి. ఎన్నికల ప్రణాళికలో భాగంగా ప్రతి కులాన్ని పద్దతి ప్రకారం మోసం చేశాడు బాబు. రాష్ట్రం పరిధిలో ఏముంటుంది? కేంద్ర పరిధిలో ఏముంటుందని తెలిసి కూడా ఎస్టీ, ఎస్సీల్లో కలుపుతామని అబద్దాలు చెప్పాడు.

ఇవాళ ఆ మాట మారుస్తూ అది కేంద్ర పరిధిలోకి వస్తుందంటూ నాటకాలాడుతున్నారు. కాపులు, బోయలు, ఎస్సీ, ఎస్టీలను ఎవ్వరినీ వదల్లేదు బాబు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి. హామీ ఇచ్చిన వ్యక్తి మాట నిలబెట్టుకోపోతే తన పదవికి రాజీనామా చేసే పరిస్థితి తీసుకురావాలి. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చాలి అంటే జగన్‌కు మీ అందరి దీవెనలు, తోడు కావాలి. అప్పుడే విశ్వసనీయత అన్న పదాన్ని, నిజాయితీ అనే పదాన్ని రాజకీయ వ్యవస్థలోకి తీసుకురాగలుగుతాం.

ఇక చిన్న చిన్న అబద్దాలకు ప్రజలు మోసపోరని తెలిసి.. రేపు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తానంటాడు. అయినా నమ్మరు అని తెలుసు. అందుకు బోనస్‌గా ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు ఇస్తానంటాడు. అప్పటికీ నమ్మరు అని తెలుసు. ప్రతి ఇంటికి తన మనుషులు పంపుతాడు. ఓటుకు రూ. 3 వేలు చేతిలో పెడతాడు. వద్దు అని మాత్రం అనకండి. మూడు వేలు కాదు ఐదు ఇమ్మనండి. అదంతా మనదే. మనల్ని దోచేసిన డబ్బే అదంతా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడం కోసం వేయండి. ఈ చెడిపోయిన మార్చడం కోసం మీ ముద్దు బిడ్డకు తోడుగా ఉండమని కోరుతున్నా. ఆశీర్వదించమని కోరుతున్నా. ’

Advertisement
Advertisement