‘వెన్నుపోటు పొడవడంలో ఆయనకు అనుభవం ఉంది’ | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటు పొడవడంలో ఆయనకు అనుభవం ఉంది’

Published Tue, Dec 19 2017 1:00 PM

YS Jagan Slams Chandrababu Naidu in Raithu Mukhamukhi - Sakshi

సాక్షి, అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బుర్ర లేదనడానికి అనంతపురం ఉదాహరణ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో మరాల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతన్నలు, అక్కచెల్లెమ్మలతో ముఖాముఖి కార్యక్రమాన్ని మరాలలో నిర్వహించడం ఆనందంగా ఉందని చెప్పారు. 

‘రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి నాలుగేళ్ల పాలనను చూశాం. మరో ఏడాదిలో ఎన్నికలు వస్తున్నాయని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునివ్వడాన్ని చూశాం. ఇలాంటి పరిస్థితిల్లో మనకు ఎలాంటి నాయకత్వం కావాలి అన్న విషయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనకు అబద్దాలు చెప్పే నాయకుడు కావాలా?. మోసం చేసే నాయకుడు కావాలా? అని అడుగుతున్నా. చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి మాట అబద్దం అన్న విషయం మనకు తెలిసిందే.

రైతులను ఉద్దేశించి చంద్రబాబు ఏమన్నారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. బ్యాంకుల్లో బంగారం బయటకు రావాలంటే బాబు రావాలి అన్నారు. రైతు రుణాలు మాఫీ అవ్వాలంటే బాబు రావాలి అన్నారు. బాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత అడుగుతున్నా బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా?. పైగా వేలం అంటూ బ్యాంకుల నుంచి రైతుల ఇళ్లకు నోటిసులు వస్తున్నాయి. రుణమాఫీతో కనీసం వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంది. ఏ పంటను చూసిన కనీసం గిట్టుబాటు ధర కూడా రైతుకు దక్కడం లేదు.

కరువు, అకాల వర్షాలతో రైతులకు చివరకు మిగిలిందేంటి?. ఎకరాకు కనీసం నాలుగైదు బస్తాలు కూడా దిగుబడి రావడం లేదు. ఇలాంటి స్థితిలో 44 కేజీలకు బస్తాను రూ.1300లకు ఇవ్వాలని అడగడం దారుణం. వేరుశెనగ, పత్తి పంటలకు రాష్ట్రంలో మద్దతు ధర లేదు. గత ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వస్తే రూ. 3 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని నేను చెప్పాను. రాజకీయాల్లో నేను సీనియర్‌ను రూ. 5 వేల కోట్లతో ధరల స్ధిరీకరణ నిధిని పెడతాను అని చంద్రబాబు అన్నారు. మరి చేశారా?.

వెన్నుపోటులో రాజకీయ అనుభవం మాత్రమే చంద్రబాబుకు ఉంది. రైతుల నుంచి తక్కువ ధరలకు పంటను కొని హెరిటేజ్‌ ద్వారా ఎక్కువ ధరలకు బాబు అమ్ముకుంటున్నారు. ఉపాధి హామీ పనుల గురించి అనంత ప్రజలను అడిగా. ఏడెనిమిది నెలల నుంచి బిల్లులు అందడంలేదని సమాధానం వచ్చింది. చంద్రబాబు పుణ్యాన నాలుగు లక్షల మంది అనంతపురం జిల్లా వాసులు బెంగుళూరు, కేరళలకు వలస వెళ్తున్నారు. రాయలసీమకు నీళ్లు ఇస్తున్నామని ప్రభుత్వం డబ్బాలు కొట్టుకుంటోంది. నీళ్లు ఇస్తుంటే 63 మండలాలను కరువు మండలాలుగా ప్రతి ఏటా ఎందుకు ప్రకటిస్తున్నారు?.

చంద్రబాబు బుర్ర లేదనడానికి అనంతపురం ఉదాహరణ. హంద్రీనీవా ప్రాజెక్టును వైఎస్‌ 6 వేల కోట్లతో దాదాపుగా పూర్తి చేశారు. ఒట్టి పిల్ల కాలువలను చంద్రబాబు తవ్వించి ఉంటే అనంతకు నీళ్లు అందేవి. కానీ బాబు ఆ పని చేయరు. శ్రీశైలంలో నీళ్లు నిండుగా ఉంటాయి. పోతిరెడ్డిపాడు నుంచి ఫ్లడ్‌ఫ్లో కెనాల్‌ను నిర్మించాలన్న ఆలోచన దిక్కుమాలిన ముఖ్యమంత్రికి రాదు. రైతులకు భరోసా ఇవ్వడానికే ప్రజాసంకల్పయాత్ర చేస్తున్నాను. అక్కచెల్లెమ్మల అద్వాన్నమైన పరిస్థితిని అర్థం చేసుకుని అండగా ఉండటానికి పాదయాత్రను మొదలుపెట్టాను. 

ప్రజలకు మంచి చేసేందుకు వైఎస్‌​ఆర్‌ సీసీ నవరత్నాలను ప్రకటించింది. వాటిలో మార్పులు చేర్పులు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. మీరు సలహాలు సూచనలు ఇవ్వాలని కోరుతున్నా. సాధారణంగా మన రైతులు నాలుగు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటిని అధిగమించి రైతును రాజుగా మార్చాలనే తలంపుతో ‘రైతు భరోసా’ను నవరత్నాలు ఒకటిగా చేర్చా. రైతు భరోసా ఇలా రైతులకు ఇలా అండగా నిలుస్తుంది..
1. పంటలు వేసే సమయంలో పెట్టుబడులు
ఈ పెట్టుబడులకు రైతులు బ్యాంకులు, ప్రైవేటు వడ్డీలపై ఆధారపడాల్సివస్తోంది. రైతన్న భరోసా పేరుతో పత్రి ఏటా మే నెలలో ప్రతి రైతు కుటుంబానికి రూ. 12 వేలు ఇస్తాం. ఒక ఎకరాలో వేసే వారికి 90 శాతం పెట్టుబడి వచ్చినట్లు అవుతుంది. మిగిలిన వారికి కాస్తో కూస్తో అండగా నిలుస్తుంది.
2. ఉచిత కరెంటు
రైతన్నలకు తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్‌ అందిస్తాం.
3. వడ్డీ లేని రుణాలు
ప్రతి రైతుకు వడ్డీ లేని పంట రుణాలను అందజేస్తాం. 
4. గిట్టుబాటు ధర
మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్ధిరీకరణ నిధిని తీసుకువస్తాం. ఏ పంట ఏ ధరకు కొంటామో ముందే చెప్తాం. అదే రేటుకు ఎవరూ కొనకపోతే. ప్రభుత్వమే దాన్ని కొనుగోలు చేస్తుందని చెబుతున్నా. కోల్డ్‌ స్టోరేజిలు ఉచితంగా వాడుకునే ఏర్పాట్లు చేస్తాం.

Advertisement
Advertisement