ప్రతి జిల్లా హైదరాబాద్‌ అయి ఉండేది.. | Sakshi
Sakshi News home page

'బాబు మోసాలు, అబద్దాలతో పబ్బం గడుపుకుంటున్నాడు'

Published Sat, Mar 3 2018 6:11 PM

YS jagan Slams cm chandrababu naidu - Sakshi

సాక్షి, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తెలిసిందే మోసం చేయడం, అబద్దం ఆడటం అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విమర్శించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన తాళ్లూరు బహిరంగ సభలో సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. సాగర్‌ నీటితో వరిపంట  పండించుకోవాల్సిన రైతన్నలు నీరు లేక కంది పంట పండించుకుంటే వాటికి కూడా మద్దతు ధర కల్పించలేని అసమర్థ ప్రభుత్వం విమర్శించారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో సాగర్‌ నీటితో దర్శి పరిసర ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తే చంద్రబాబు మాత్రం నాలుగేళ్లలో ఒక్కపంట పండించుకోవడానికి కూడా నీరు సరిగ్గా అందివ్వలేక పోయారని అన్నారు. నీరు లేక కంది పంట వేసుకుంటే మార్కెట్‌లో రూ.5450 మద్దతు ధర ఉంటే కనీసం ఇప్పుడు 4,400లకు కూడా తీసుకొనే నాధుడు లేడని విమర్శించారు.

నాలుగేళ్లలో ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చారా?
జననేత వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ 'దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారి హయాంలో జామాయిల్‌, సుబాబుల్‌కు రూ.4,400 మద్దతు ధర ఇచ్చేవారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కనీసం జామాయిల్‌కు రూ.1800, సుబాబుల్‌కు రూ.2500 కూడా ఇచ్చే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదు. నాలుగేళ్లలో ఒక్ కపంటకైనా గిట్టుబాటు ధర ఇచ్చారా ? రైతులను చూస్తే బాధేస్తోంది. వెలుగొండ ద్వారా ప్రకాశాన్ని సస్యశ్యామలం చేయాలని నాన్నగారు భావించారు. ఇందులో భాగంగానే రెండు సొరంగాల్లో, ఒక దాంట్లో 13 కిలోమీటర్లు, రెండో దాంట్లో 9కిలో మీటర్లు పూర్తి చేశారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో నాలుగు కిలోమీటర్లు కూడా పూర్తి చేయలేకపోయారు. దొనకొండలో 50 వేల ఎకరాల్లో రాజధాని పెట్టాలని కేంద్ర కమిటీ సిఫారసు చేస్తే దాన్ని చంద్రబాబు చెట్టబుట్టలో పడేశాడు.

జిల్లా ప్రజలను మభ్యపెట్టడానికి ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తా అన్నాడు. కానీ ఇప్పటికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. విశాఖ మీటింగ్‌లో మాత్రం లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు అన్నాడు. మోసాలు, అబద్దాలతో చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నాడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ప్రతి జిల్లా మరో హైదరాబాద్‌ అయ్యిందేది.  చంద్రబాబు.. ఓటుకు నోటు కేసు కోసం ప్రత్యేక హోదాను నీరుగార్చారు. పోలవరం ప్రాజెక్ట్‌ కట్టాల్సిన బాద్యత కేంద్రానిది కానీ, కమీషన్‌ కోసం మేమే కడతామంటూ తెచ్చుకున్నారు. సిమెంట్‌, ఇసుక, స్టీల్‌ రేట్లు తగ్గినా ప్రాజెక్టు రేట్లు విపరీతంగా పెంచేశారు. సబ్‌ కాంట్రాక్టర్లు ఆయన బినామీలే.

ఊసరవెల్లి బాబు, రోజుకో రంగు మార్చుతాడు :
ఊసరవెల్లిలో ఎన్ని రంగులుంటాయో తెలీదుకాని, చంద్రబాబు మాత్రం రోజుకో రంగు మారుస్తారు. ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన ఆయన ప్రత్యేక హోదాకోసం పోరాటం చేస్తారట. కానీ వైఎస్‌ఆర్‌ సీపీ మాత్రం పట్టు విడవకుండా హోదా కోసం పోరాడతాం. మార్చి ఒకటిన కలెక్టరేట్ల ముందు ధర్నా చేశాం, ప్యాకేజీ వద్దు- ప్రత్యేకహోదా మన హక్కు అని చాటాం. శుక్రవారం విజయవాడ నుంచి వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు ఢిల్లీ బయలు దేరాయి. మార్చి ఐదున ధర్నా చేయబోతున్నాం. చంద్రబాబు పార్టనర్‌ పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లు 21న అవిశ్వాసం పెట్టబోతున్నాం. మీరు చంద్రబాబుతో మాట్లాడి తెలుగుదేశం ఎంపీలను ఒకే తాటిపైకి రమ్మని కోరుతున్నాం. అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే ఏప్రిల్‌ 6న 25మంది ఎంపీలు రాజీనామ చేసి ఇంటికొద్దామని చెపుతున్నాం. పార్లమెంట్‌ మొదటి రోజు చేయాల్సింది కేంద్రంలో మంత్రులు రాజీనామా చేయాలి. రెండో అస్త్రం అవిశ్వాసానికి మద్దతు ఇవ్వండి. అప్పటికి దిగిరాకపోతే ఏప్రిల్‌ 6న 25మంది ఎంపీలు రాజీనామా చేయాలి. అ‍ప్పుడే కేంద్రం దిగివస్తుంది. ప్రత్యేక హోదా ఇస్తారు.

అధికారం కోసం చంద్రబాబు ఎవరినీ వదల్లేదు :
అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులను తీసేస్తాం అన్నారు. ప్రతి గ్రామంలో వాటర్‌ ప్లాంట్‌ ఉందో లేదో తెలీదు కానీ మందు షాపు లేని గ్రామం మాత్రం లేదు. ఆర్టీసీ చార్జీలను మూడు సార్లు పెంచారు. కరెంట్‌ చార్జీలను సైతం అదీ రీతిలో పెంచారు. ప్రజలను మోసం చేస్తూ పెద్ద పెద్ద అబద్దాలు చెబుతాడు. ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్‌ కారు ఇస్తానంటాడు. ప్రతి చెల్లెమ్మకు ప్రతి ఇంటికి మూడు వేల రూపాయలు అంటూ చెబుతాడు. డబ్బు ఇస్తే తీసుకోండి. అదంతా ప్రజల సొమ్మే' అంటూ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పులు కోసం పోరాడుతున్నామని, వాటిని తీసుకురావాంటే ప్రజలందరి సహకారం కావాలన్నారు.

Advertisement
Advertisement