గంటా, అయ్యన్న, గీతం మూర్తిలపై జగన్‌ ఫైర్‌ | Sakshi
Sakshi News home page

గంటా, అయ్యన్న, గీతం మూర్తిలపై జగన్‌ ఫైర్‌

Published Mon, Sep 10 2018 7:04 AM

YS Jagan Slams Ganta Srinivasarao In Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మంత్రులు సీహెచ్‌ అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, గీతం యూనివర్సిటీ అధినేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తిపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. కంచరపాలెం సభలో చంద్రబాబుతో పాటు జిల్లాకు చెందిన ఈ ముగ్గుర్ని లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. గంటా, అయ్యన్న, గీతం మూర్తిలను విమర్శించినప్పుడు ప్రజల నుంచి హర్షధ్వానాలు మిన్నంటాయి. తనవి కాని ప్రభుత్వ భూములకు రికార్డులు సృష్టించి వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి వందల కోట్ల రుణాలు తీసుకున్న మంత్రి ఒకరున్నారు... ఆయన ఎవరో నేను మీకు వేరే చెప్పనవసరం లేదంటూనే ఆయనెవరో తెలుసా అని ప్రజలను ప్రశ్నించారు.

వారు గంటా.. గంటా.. గంటా అంటూ బిగ్గరగా నినాదాలు చేయడంతో ఆ మనిషి పేరు గంటా అంటారని జగన్‌ పేర్కొన్నారు. తనవి కాని ప్రభుత్వ భూములను కాజేసి వాటికి రికార్డులు సృష్టించి బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్లు తీసుకున్నారంటూ గంటాను లక్ష్యంగా చేసుకుని విమర్శించారు. ఈయనొక్కరే కాదు ఇక్కడ టీడీపీ నాయకులు ఎక్కడ భూమి కన్పిస్తే అక్కడ దోచేయడమే పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. వైఎస్‌ హయాంలో పేదలకు రాజీవ్‌ గృహకల్ప కింద కేటాయించిన భూములను చంద్రబాబు తన సమీప బంధువు ఎంవీవీఎస్‌ మూర్తికి అప్పనంగా కట్టబెట్టారని విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు కోసం భూములు సేకరించిన ప్రాంతాల్లో మంత్రి అయ్యన్న పాత్రుడు, టీడీపీ ఎంపీలకు భూములుంటాయి. వాటి జోలికి పోరు.. కానీ పక్కనే పేదల భూములను మాత్రం బలవంతంగా లాక్కుంటారు..ఇంతలా భూములతో వ్యాపారం చేసిన మంత్రులు, నాయకులు మరెక్కడా లేరంటూ విమర్శించారు.

Advertisement
Advertisement