యాక్టర్‌కు లోకల్‌ హీరోకు పోటీ : వైఎస్‌ జగన్‌ | Sakshi
Sakshi News home page

యాక్టర్‌కు లోకల్‌ హీరోకు పోటీ.. మీరే తేల్చుకోండి

Published Sun, Apr 7 2019 7:03 PM

YS Jagan Speech In Gajuwaka Public Meeting - Sakshi

సాక్షి, గాజువాక (విశాఖపట్నం) : ‘గాజువాకలో పోటీ ఓ యాక్టర్‌కు... లోకల్‌ హీరోకు జరుగుతోంది. ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాడు. 9 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నాం.. ప్రతి ధర్నా చేశాడు.. ప్రతి నిరహార దీక్ష చేశాడు. ప్రతిసారి మీకు అండగా ఉన్నాడు. మీ కోసం కేసులు పెట్టించుకున్నాడు. ఈ మనిషిని లోకల్‌ హీరో అంటాం. కానీ మరోవైపు యాక్టర్‌ ఉన్నాడు. ఆ యాక్టర్‌ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆయన నామినేషన్‌ సందర్భంగా పచ్చజెండాలు కనిపిస్తాయి. ఆయన నాలుగేళ్లు టీడీపీ చంద్రబాబునాయుడితో కలసి కాపురం చేస్తాడు. ఎన్నికలకు ఒక ఏడాది ముందు విడాకులు తీసుకున్నట్లుగా బిల్డప్‌ ఇస్తాడు. జగన్‌ అనే వ్యక్తి చంద్రబాబుకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే.. 22 కేసులు పెట్టారు. కానీ ఇదే యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌.. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏడాది నుంచి బిల్డప్‌ ఇస్తూ ఉంటుంటే.. ఒక్క కేసు నమోదు కాలేదు. వాళ్లంతా కలిసి కట్టుగా ఎలా కుట్రలు పన్నుతున్నారో అర్థం చేసుకోమని కోరుతున్నా.’ అని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం విశాఖజిల్లా గాజువాకలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని, ఖాళీగా ఉన్న రెండు లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు చేసే కుట్రలను గమనించాలని, ఆయన ఐదేళ్ల పాలనపై ఒకసారి ఆలోచన చేయాలని ప్రజలను కోరారు.  గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తిప్పల నాగిరెడ్డి ‌‌‌, విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. 


 
వైఎస్సార్‌ పాలనను గుర్తు తెచ్చుకోండి..
విశాఖపట్నం, గాజువాక గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకొమని ప్రాధేయపడుతున్నాను. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనను గుర్తుతెచ్చుకోమని కోరుతున్నా. ఆయన ఐదేళ్ల మూడునెలల పాలనను చూడమని అడుగుతున్నా. విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. ఎన్టీపీసీ, హెచ్‌పీసీఎల్‌ విస్తరణ ఆయన హయాంలోనే జరిగింది. మూతపడ్డ బీహెచ్‌పీ, బీహెచ్‌ఎల్‌ను కలిపి వందల కుటుంబాలను ఆదుకున్నారు. షిప్‌యార్డ్‌, రక్షణశాఖను విలీనం చేసి మూతపడకుండా చేశారు. అచ్యుతాపురం, ఐటీ కారిడార్‌, ఫార్మాసిటీ ఇవన్నీ కూడా విశాఖపట్నంకు తీసుకొచ్చి కొన్ని వేళ ఉద్యోగాలు తీసుకొచ్చారు. విశాఖ విమానాశ్రయం కూడా అంతర్జాతీయ విమానాశ్రయంగా ఆయన హయాంలోనే జరిగింది. వర్షం పడితే విశాఖ విమానాలు టేకాఫ్‌ అయ్యేవి కాదు.. దానిని పునరుద్దరణ చేశారు. ఈ ఐదేళ్లు చంద్రబాబు ఏం చేశారో బేరిజు వేసుకోమని కోరుతున్నా. చంద్రబాబు సీఎం అయ్యారు.. స్టీల్‌ ప్లాంట్‌ అంపశయ్యపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములు, కొండలతో సహా లక్షల కోట్ల భూకుంభకోణాలు చేశారు. మంత్రులు, నాయుకులు, కొడుకును కాపాడటానికి తూతుమంత్రంగా సిట్‌ వేసి.. ఆ నివేదికను చెత్తబుట్టలో వేశారు.

ఐటీరంగం రివర్స్‌ గేర్‌లోకి..
బినామీలకు కారుచౌకగా వేల కోట్ల విలువ చేసే భూమలను కేటాయించారు. బీచ్‌రోడ్డులో వేయ్యికోట్ల విలువ చేసే స్థలాన్ని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు దారాదత్తం చేశారు. భాగస్వామ్య సదస్సులతో రూ.150 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారు. ఈ సదస్సులతో 40 లక్షల ఉద్యోగాలు.. 20 లక్షల కోట్ల పెట్టుబడులున్నారు. వచ్చాయా ఉద్యోగులు? ఈ ధ్యాస హోదాపై పెట్టుంటే ఇప్పటికి వచ్చేది కదా..! ఉద్యోగాలు వచ్చేవి కావా? ఇదే విశాఖలో ప్రత్యేకహోదాకు అనుకూలంగా జగన్‌ అనే ప్రతిపక్ష నేతను ధర్నాకు రాకుండా అడ్డుకున్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకోమని కోరుతున్నా. ప్రతిపక్షనేతపై వీఐపీ లాంజ్‌లోనే దాడి చేయించారు. వైఎస్సార్‌ హయాంలో ఇక్కడ ఐటీ రంగం పరుగులు పెడితే.. ఇదే చంద్రబాబు హయాంలో ఐటీరంగం రివర్స్‌ గేర్‌లోకి వెళ్లింది. వైఎస్సార్‌ హయాంలో 16 వేల ఐటీ ఉద్యోగాలు ఉంటే.. ఇప్పుడు 12వేలకు తగ్గిపోయాయి. ప్రయివేట్‌ విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించేందుకు చరిత్ర కలిగిన ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని ఎలా నిర్విర్యం చేస్తున్నారో మీ అందరికి తెలుసు. అక్కడ ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయరు. గీతం యూనివర్సిటీకి వెళ్లేలా ఇలా చేశారు. 

వైఎస్సార్‌ 1130 పడకల కేజీహెచ్‌ ఆసుపత్రిని ప్రారంభించారు. ఆయన మరణాంతరం 21 సూపర్‌ బ్లాక్‌లకు 8 బ్లాక్‌లే పూర్తయ్యాయి. అక్కడ ఒకే మంచంపై ఇద్దరు రోగులను పడుకోబెట్టే పరిస్థితి ఏర్పడింది. గాజువాకలో స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదు. స్టీల్‌ ప్లాంట్‌లో 50శాతం స్థానికులకే ఇవ్వాలని వైఎస్సార్‌ చట్టం తీసుకొచ్చారు. నాలుగు లక్షల జనాభా ఉన్న గాజువాకలో డంపింగ్‌యార్డ్‌ సమస్య ఉంది. పారిశ్రామికంగా గాజువాక ఎంతో ముందుంది. కానీ కనీసం ఇక్కడ పాలిటెక్నిక్‌ కాలేజీ లేదు. సీఎంగా చంద్రబాబు హామీ ఇచ్చినా దిక్కులేకుండా పోయింది. డిగ్రీ కాలేజీ కూడా లేదు. ఇక్కడికి రోజుకు కొన్ని వేల ట్రక్కులు వస్తూ ఉంటాయి. వారికోసం ఒక్క ట్రక్కు బే పెట్టలేదు. 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. ఆ పాదయాత్రలో ఏ గ్రామానికి, పట్టణానికి వెళ్లినా.. అన్నా.. ఉద్యోగం లేదన్నా.. అనే మాటలే వినిపించాయి.

ప్రభుత్వ స్కూల్స్‌లో టీచర్లను..
జాబు రావాలంటే బాబు రావాలని ఆనాడు చంద్రబాబు అన్నారు. రాష్ట్రం విడిపోయేనాటికి రాష్ట్రంలో  లక్ష 42వేల ఉద్యోగాలను ఖాళీగా ఉన్నాయని కమల్‌నాథ్‌ కమిటీ చెప్పింది. వీటికి మరో లక్ష కలిపి మొత్తం రెండు లక్షల 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ స్కూల్స్‌లో టీచర్లను భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు. అందరూ చంద్రబాబు బినామీ నారాయణ స్కూల్‌కు వెళ్లాలని దిక్కుమాలిన ఆలోచనతో ఇలా చేశారు. ఇంటింటికి ఉద్యోగం ఇవ్వకపోతే.. రూ.2వేల నిరుద్యోగభృతి ఇస్తానన్నాడు. ఐదేళ్లలో రూ.లక్ష 20వేలు ఎగ్గొట్టాడు. ఉద్యోగాలు రాలేదు.. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు. నిరుద్యోగభృతి.. కేవలం ఎన్నికల ముందు మూడు లక్షల మంది వెయ్యి రూపాయలు ఇచ్చాడు. బాబు వచ్చాడు.. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, గోపాల మిత్రలు, ఆయూష్‌, సాక్షర భారత్‌, మధ్యాహ్నం భోజనంలో పనిచేస్తున్న అక్కాచెల్లమ్మల ఉద్యోగాలు పోయాయి. కాంట్రాక్ట్‌లో ఉద్యోగం చేస్తున్నవారి జీతాలు పెంచమంటే పోలీసుల చేత కొట్టించారు. నా పాదయాత్రలో ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న నిరుద్యోగులను చూశా.. పిల్లలకు ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల ఆవేదనను విన్నా.. మీ అందరికి నేనున్నాననే భరోసా ఇస్తున్నాను.

ప్రతి గ్రామానికో సెక్రటేరియట్‌ ..
అధికారంలో రాగానే చేసే మొట్టమెదటి పని ఖాళీగా ఉన్న 2 లక్షల 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేవిధంగా నోటీఫికేషన్లు వేస్తాం. ప్రతి ఏడాది ఉద్యోగ క్యాలండర్‌ రిలీజ్‌ చేస్తాం. ఇవాళ ఏ సంక్షేమ పథకం పొందాలన్నా.. జన్మభూమి కమిటీలకు లంచం ఇవ్వందే ఏ పని జరగడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి వార్డు.. ప్రతి గ్రామంలో సెక్రటేరియట్‌ తీసుకొస్తాం. చదువుకున్న 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి.. అక్కడినే కూర్చోపెడ్తాం. పెన్షన్‌, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కావాలన్నా.. ఆర్జీ పెట్టిన 72 గంటల్లోనే మంజూరు అయ్యేట్టు చూస్తాం. ఇది ఇచ్చేటప్పుడు కులం, మతం, పార్టీలు చూడం. ప్రతి వార్డు, ప్రతి గ్రామంలో 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటరీగా నియమించి గౌరవ వేతనంగా రూ.5వేలు అందిస్తాం. వాళ్లకు ఇంకా మెరుగైన జీతాలు వచ్చేవరకు వారంతా గ్రామ వాలంటరీలుగా సేవలు అందిస్తారు. ఆ 50 ఇళ్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకొని గ్రామ సెక్రటరియేట్‌తో అనుసంధానమై పనిచేస్తారు. సంక్షేమ పథకాలు సంబంధించి ఈ 50 ఇళ్లకు పూర్తి బాధ్యత ఆ వాలంటీర్‌దే. 

ప్రధాని ఎవడన్నా కానీ..
స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా.. శాసనసభలో చట్టం తీసుకొస్తాం. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్‌లు తీసుకునే సర్వీసులు చాలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సులను కాంట్రాక్టులకు ఇస్తున్నారు. వీటిని కేశినేని, జేసీ బ్రదర్స్‌ నడుపుతున్నారు. వీటన్నిటిని మార్చేస్తాం. ఇలా ప్రభుత్వ కాంట్రాక్టులు నిరుద్యోగులకే ఇచ్చేలా చేస్తాం. పెట్టుబడుల కోసం సబ్సిడీ కూడా ఇస్తాం. నామినేషన్‌ పద్దతిలో ఇచ్చే కాంట్రాక్టుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పిస్తాం. 25కు 25 ఎంపీ సీట్లు మనం గెలుచుకుంటే.. పక్క రాష్ట్రం 17 మంది ఎంపీలు మనకు మద్దతిస్తాం అంటున్నారు. మొత్తం 42 మంది కలిస్తే ప్రత్యేకహోదా సాధించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని ఎవరవుతారో తెలియదు.. ప్రధాని ఎవడన్నా కానీ.. 42 మంది ఒక్కసారి అడిగితే హోదా వస్తుంది. ప్రత్యేక హోదా ద్వారా పరిశ్రమలు, హాస్పిటల్స్‌, హోటల్స్‌ వస్తాయి. హోదా వస్తే జీఎస్టీ, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కట్టాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వండి.

చంద్రబాబు కుట్రలు చూస్తూనే ఉన్నారు. ఆయన పరిపాలనపై ఒకసారి ఆలోచన చేయండి. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్దం. రాబోయే రోజుల్లో చంద్రబాబు మూటలకు మూటలు డబ్బులు పంపిస్తాడు. ఓటుకు మూడు వేలు ఇస్తాడు. మీ అందరికి చెప్పేది ఒక్కటే గ్రామాల్లోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బులకు మోసపోవద్దు.. అన్నను సీఎంను చేసుకుందామని చెప్పండి. నవరత్నాలు, మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని వివరించండి. అన్న సీఎం అయితే మన బతుకులు బాగుపడ్తాయని వివరించండి.’ అని వైఎస్‌ జగన్‌ కోరారు.

Advertisement
Advertisement