కర్ణాటకలో రాజ్యాంగం గెలిచింది | Sakshi
Sakshi News home page

కర్ణాటకలో రాజ్యాంగం గెలిచింది

Published Sun, May 20 2018 2:09 AM

YS Jagan tweeted on Karnataka Election Results - Sakshi

సాక్షి, అమరావతి: కర్ణాటక ఎపిసోడ్‌లో రాజ్యాంగం గెలిచిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. ఇంతకంటే ఘోరంగా రాజ్యాంగ ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్‌లో నాలుగేళ్లుగా కొనసాగుతున్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి యత్నించారంటూ కర్ణాటకలో బీజేపీపై ఆరోపణలు వస్తే.. ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడ ఏకంగా 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేసి, తానెంతటి అప్రజాస్వామికవాదో నిరూపించారు. అందులో నలుగురిని మంత్రులుగా కూడా చేసి రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. వీరిపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలంటూ అసెంబ్లీ సమావేశాల్ని వైఎస్సార్‌సీపీ బహిష్కరించినా చర్యల్లేవు’’ అని విమర్శించారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయినా.. చంద్రబాబు రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని ఆయన ధ్వజమెత్తారు. కనీసం కర్ణాటకలో తప్పు అని తెలిసి, అల్లరి అవుతుందేమోనని వెనకడుగు వేశారని, కానీ ఇక్కడ తప్పని తెలిసినా, అల్లరి అవుతుందని తెలిసినా నిస్సిగ్గుగా ముందడుగు వేశారని దుయ్యబట్టారు. కర్ణాటక ఎపిసోడ్‌ తర్వాత ఇప్పటికైనా దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగ నిపుణులు, మీడియా దృష్టి పెట్టాల్సిన అంశం ఇదేనని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement