మానవత్వం లేని ప్రభుత్వమిది | Sakshi
Sakshi News home page

మానవత్వం లేని ప్రభుత్వమిది

Published Wed, Mar 14 2018 1:01 AM

YS Jaganmohan Reddy fires on Chandrababu Govt - Sakshi

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘దివ్యాంగుల్ని సైతం ఆదుకోలేని ప్రభుత్వమిది.. వాళ్లేమైనా గొంతెమ్మ కోర్కెలు కోరుతున్నారా? నిరాదరణకు గురవుతున్న తమను ఆదుకోమని వేడుకుంటున్నారు.. ఆ మాత్రం ఆదుకోలేకపోతే సంక్షేమ ప్రభుత్వం అనేదానికి అర్థం ఏముంటుంది? అసలు ఈ ప్రభుత్వానికి మానవత్వం ఉందా?’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్ర 111వ రోజు మంగళవారం గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా వివిధ వర్గాలు, కుల సంఘాల నేతలు, అన్నదాతలు జగన్‌ను కలిసి తమ సమస్యలను ఏకరవుపెట్టారు. ‘ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదయ్యా.. మీరే ఆదుకోవాలయ్యా..’ అంటూ అడుగడుగునా సమస్యలు వివరించారు. అందరి సమస్యలను ఓపిగ్గా వింటూ, ఓదార్చుతూ.. ధైర్యం చెబుతూ జననేత ముందుకు సాగారు.  

రూ.3 వేలు పింఛన్‌ ఇప్పించండి సార్‌.. 
కాళ్లూ చేతులు లేని వారు కొందరు, కంటి చూపు లేని వారు మరికొందరు, విధి వంచితులు ఇంకొందరు, ఊతకర్రతో నడిచే వారు మరి కొందరు.. వీరంతా తమకు నెలకు రూ.3 వేల పింఛన్‌ ఇప్పించాలని జగన్‌కు విన్నవించారు. అనేక సమస్యలు, ఈతిబాధలతో ఇక్కట్లు పడుతున్న వందలాది మంది దివ్యాంగులు కొండుభొట్లవారి పాలెం అడ్డరోడ్డు వద్ద జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రస్తుతం వస్తున్న రూ.వెయ్యి, రూ.1,500 తమ కుటుంబ పోషణకు సరిపోవడం లేదన్నారు. ఈ పింఛన్‌ను కూడా వేలి ముద్రలు పడడం లేదని కొందరికి ఇవ్వడం లేదని వాపోయారు. ఉద్యోగాలు, ఉపాధి లేక అల్లాడాల్సి వస్తోందన్న ఆక్రోశం వెళ్లగక్కారు. రాష్ట్రంలో 22 లక్షల మంది దివ్యాంగులం ఉన్నామని, ఇళ్లు లేని వారికి స్థలాలు ఇచ్చి గృహ వసతి కల్పించాలని కోరారు. తమకు 3 శాతం రిజర్వేషన్లు ఉన్నా ఉద్యోగాలు భర్తీ చేయడం లేదన్నారు. దివ్యాంగుల గుర్తింపు కార్డుల కోసం నానా అగచాట్లు పడాల్సి వస్తోందని వాపోయారు. జగన్‌ స్పందిస్తూ.. దివ్యాంగుల డిమాండ్లన్నీ న్యాయ సమ్మతమైనవే అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల కార్పొరేషన్‌ను సంస్కరించి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.   

వరికి మద్దతు ధర లేదన్నా.. 
‘ఆరు గాలం కాయకష్టం చేసి వడ్లు పండిస్తే 76 కిలోల బస్తా వెయ్యికి ఇస్తావా? రూ.1,100కు ఇస్తావా? అని వ్యాపారులు అడుగుతున్నారు. సాధారణ రకం వడ్లకు క్వింటాల్‌కు రూ.1,550, ఏ గ్రేడ్‌ రకానికి రూ.1,590 ఇవ్వాల్సి ఉంటే వ్యాపారులు ఇచ్చేది దారుణంగా ఉంద’ని పలువురు రైతులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా తమకు గిట్టుబాటు కాదని, అదన్నా ఇస్తున్నారా అంటే అదీ ఇవ్వడం లేదని వాపోయారు. గత్యంతరం లేక ఆ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని, అలా అమ్ముకుంటే తమకు చేలల్లో వరి గడ్డి తప్ప మరేమీ మిగలడం లేదని వివరించారు. దీనికి జగన్‌ స్పందిస్తూ చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఏయే పంటను ఎంత ధరకు కొంటామో ముందే ప్రకటిస్తామని, రైతుల్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.  

అన్నిటికీ అక్కడికే పొమ్మంటున్నారన్నా.. 
రుణమాఫీ పేరిట తమను చంద్రబాబు వంచించాడని కర్లపాలెం రైతులు ఆక్రోశించారు. బాబును నమ్మి ఓటేసినందుకు తమను తామే తిట్టుకుంటున్నామని వాపోయారు. ‘ప్యార్లీ గ్రామానికి చెందిన జోగి ప్రకాశం రూ.42 వేలు పంట రుణం తీసుకున్నాడు. ఆయనకు రుణమాఫీ అయినట్టు లేఖ వచ్చింది గానీ అప్పు మాత్రం తీరలేదు. అదేమంటే పట్టాదార్‌పాస్‌ పుస్తకం నంబరు సరిగా నమోదు కాలేదంటున్నారు. నాలుగేళ్లుగా ఇదే తంతు. ఎక్కని ఆఫీసు గడప లేదు.. కలవని వ్యవసాయాధికారి లేడు. అదిగో ఇదిగో అంటూ ఇంత కాలం జాప్యం చేసి ఇప్పుడు ఆ లోపాన్ని సరిదిద్దాలంటే గన్నవరంలోని రైతు సాధికార సంస్థ వద్దకు వెళ్లమంటున్నారు. అక్కడికి వెళితే పట్టించుకున్న దిక్కులేదు’ అని జగన్‌ ఎదుట వాపోయారు.  

యానాదులకూ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయండి.. 
‘అన్నా.. మేము నాగరిక సమాజానికి దూరంగా విసిరివేయబడ్డట్టు ఉంటాము. సుమారు 15 లక్షల మందిమి ఉన్నాం. పక్కా ఇళ్లకు నోచుకోవడం లేదు. చచ్చిపోతే సమాధి చేయడానికి శ్మశానాలూ లేవు. విద్య, వైద్యం సంగతి చెప్పాల్సిన పనే లేదు. అటువంటి మాకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి’ అని జాతీయ యానాది హక్కుల పోరాట సమితి నేతలు జగన్‌ను కోరారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌లో తాము ఉన్నప్పటికీ గిరిజనేతరులే తమ నిధులు కాజేస్తున్నారని వాపోయారు. ఈ పరిస్థితిని నివారించాలంటే విద్యాబుద్ధులు నేర్పించడంతో పాటు నైపుణ్య శిక్షణకు ప్రత్యేక చొరవ చూపాలని, తమకు వేరుగా పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలని సమితి నాయకుడు తిరువీధుల శంకర ప్రసాద్‌ కోరారు.   

మత్స్యకారుల పరిస్థితి దారుణమన్నా.. 
చేపల వేట నిషేధ సమయంలో గతంలో రేషన్‌ ఇచ్చే వారని, ఇప్పుడు అది ఇవ్వకుండా నెలకు రూ.1,200 బోటు యజమానులకు ఇచ్చి సరిపెడుతున్నారని, అలా ఇస్తే ఒక్కో పడవపై ఆధారపడి జీవించే నలుగురైదుగురి పరిస్థితి ఏమి కావాలని మత్స్యకారులు ఆక్రోశించారు. డాక్టర్‌ వైఎస్సార్‌ హయాంలో తమకు రేషన్‌ వచ్చేదని, ఇప్పుడు ఇవ్వడం లేదని బాపట్ల శివార్లలో జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమ పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశావర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం రూ.6 వేలు ఇస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం రూ.వెయ్యి మాత్రమే ఇస్తోందని ఆశా కార్యకర్తల సంఘం విన్నవించింది. ముస్లిం మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, విద్య, ఉద్యోగాలలో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ముస్లిం సోదరులు నివేదించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో తమపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని గ్రామీణ పశు వైద్య శాఖ ఉద్యోగులు జగన్‌తో మొరపెట్టుకున్నారు. రాష్ట్రంలో 1,217 గ్రామీణ పశు వైద్య శాలలు నాన్‌ గ్రాడ్యుయేట్‌ ఉద్యోగులతో నడుస్తున్నాయని, అయినా తమకు ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు. సన్న జీవాల మేపునకు ప్రభుత్వ బంజర్లను, బీడు భూములను కేటాయించాలని యాదవ సంఘం కోరింది. 30 ఏళ్లుగా భూ సమగ్ర సర్వే జరగక పోవడంతో కుల వృత్తుల వారు తీవ్రంగా నష్టపోతున్నారని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక భూ సర్వే నిర్వహించాలని కుల సంఘం నేత పిన్నిబోయిన ప్రసాద్‌ విజ్ఞప్తి చేశారు.   

Advertisement
Advertisement