గొంతులెండుతున్నా పట్టించుకోరా.. | Sakshi
Sakshi News home page

గొంతులెండుతున్నా పట్టించుకోరా..

Published Tue, Feb 27 2018 7:18 AM

YS Jaganmohan Reddy Fires on CM Chandrababu Naidu - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తాగునీరు అందక ప్రజల గొంతులు ఎండుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా సోమవారం మధ్యాహ్నం పొదిలిలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. మార్కాపురం ప్రాంతంలో అడుగడుగునా తాగునీటి ఇక్కట్లు కనిపిస్తున్నాయన్నారు. ప్రజలకు గుక్కెడు నీరు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. పక్కనే ఉన్న వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్నారు. వెలిగొండ ద్వారా కృష్ణా జలాలు తీసుకువచ్చి ఈ ప్రాంత ప్రజల ఇక్కట్లు తీర్చాలన్నది దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కల అని అన్నారు. అందుకే వెలిగొండ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేసేందుకు వైఎస్‌ కృషి చేశారన్నారు. ఆయన హయాంలోనే 70 శాతం పనులు జరిగాయన్నారు. టన్నెల్‌–1 పనులు 18 కి.మీ. ఉండగా 13 కి.మీ., టన్నెట్‌–2 పనులు 18 కి.మీ.ల కు గాను 9 కి.మీ. పూర్తయ్యాయన్నారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో పట్టుమని 4 కి.మీ. పనులు కూడా పూర్తి చేయలేదన్నారు. మీ అందరి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం వస్తూనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి అందరికీ సాగు, తాగునీరు ఇస్తానని వైఎస్‌.జగన్‌ చెప్పారు.

మీ దీవెనలందించండి..
తొలుత పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అందరికీ భరోసా ఇచ్చేందుకే వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారన్నారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు వంచనకు గురయ్యారన్నారు. రైతు, డ్వాక్రా రుణమాఫీలతో సహా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని బాబు నెరవేర్చలేదని బాలినేని విమర్శించారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడన్నారు. వైఎస్‌ఆర్‌ పూర్తిగా రుణమాఫీ చేసి, డ్వాక్రా మహిళలకు అండగా నిలిచారన్నారు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అందించారన్నారు.  వైఎస్‌ ఒక అడుగు ముందుకు వేస్తే జగన్‌ రెండు అడుగులు ముందుకు వేసి సాయం చేస్తారని చెప్పారు. మీరంతా ఆశీర్వదించి వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తేవాలన్నారు.

వెలిగొండకుచంద్రబాబు మొండిచేయి
మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నిధులివ్వలేదని దీంతోనే ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని విమర్శించారు. జగన్‌ను సీఎం చేసేందుకు వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు, నేతలు ఏ త్యాగానికైనా సిద్ధమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కె.పి.కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పార్టీ నేతలు వెన్నా హనుమారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, కె.వి.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు సాయిరాజేశ్వర్, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుదిమోసపూరిత పాలన
ఒంగోలు ఎంపీ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలన మోసపూరితంగా సాగిందన్నారు. రైతులు, మహిళలు, యువకులు అందరికీ కష్టాలొచ్చాయన్నారు. అన్ని వర్గాలను ఆదుకొని భరోసా కల్పించడం కోసమే వైఎస్‌.జగన్‌ పాదయాత్ర చేపట్టారన్నారు.  చంద్రబాబుది లంచగొండి, అవి నీతి పాలన అని విమర్శించారు.  ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం చేశాడన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆది నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తుందని వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌ బయట, లోపల హోదా కోసం ఉద్యమిస్తామన్నారు. చివరి అస్త్రంగా ఎంపీలందరం రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లాకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారన్నారు. 2014 ఎన్నికలకు ముందే సీఎం కాగానే వెలిగొండ పూర్తి చేస్తానని చెప్పి అందరినీ వంచిం చాడన్నారు.  జగన్‌ సీఎం అయిన మొదటి ఏడాదిలోనే వెలిగొండ పూర్తి చేస్తారన్నారు. పొదిలిలో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Advertisement
Advertisement