చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ సవాల్‌ | Sakshi
Sakshi News home page

ప్యారడైజ్‌ పేపర్ల లీక్‌: చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ బహిరంగ సవాల్‌

Published Wed, Nov 8 2017 1:23 PM

ys jagan's challenge to cm chandrababu - Sakshi

సాక్షి, వీఎన్‌పల్లి (కమలాపురం): ప్రజాసంకల్పయాత్ర చేపడుతున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ సవాల్‌ విసిరారు. ‘చంద్రబాబుకు 15 రోజుల సమయం ఇస్తున్నా.. విదేశాల్లో నాకు ఒక్క పైసా ఉందని చూపించినా.. నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అలా చూపించకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా’ అని వైఎస్‌ జగన్‌ సవాల్‌ చేశారు. మూడోరోజు పాదయాత్రలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా వీఎన్‌పల్లి సంగమేశ్వరాలయం జంక్షన్‌లో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.

ఈ సందర్భంగా ప్యారడైజ్‌ పేపర్ల లీక్‌ గురించి స్పందించిన ఆయన.. తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో కావాలనే తన పేరుతో కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ ఏదైనా గొప్ప కార్యక్రమం మొదలుపెడుతున్నాడని తెలియగానే.. ఇలాంటి ప్రచారాలు చేయడం, చంద్రబాబుకు, ఆయన తోక పత్రికలు, చానెళ్లకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. పాదయాత్రను చూపించకూడదనే దుర్బుద్ధితోనే రోజంతా తన గురించి ఇలాంటి లీక్‌లు ఇచ్చి తోక చానెళ్లలో కథనాలు ప్రసారం చేశారని, ఈ సమయం చంద్రబాబు ప్రజలకు కేటాయించినా మేలు జరిగి ఉండేదని అన్నారు.

డబ్బులంటే నంద్యాలలో ఎందుకు ఓడిపోయాం?
నిజంగా విదేశాల్లో తనకు డబ్బుంటే నంద్యాల ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయేవాళ్లమని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. నంద్యాలలో ఓటుకు పదివేలు, ఆరువేలు ఇచ్చి కొనుగోలు చేసింది నువ్వా-నేనా అంటూ చంద్రబాబును నిలదీశారు. ముఖ్యమంత్రిగా ఉండి.. చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను రూ. 30 నుంచి, 40 కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, ఈ నల్లధనం అంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణలో నామినేటెడ్‌ ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఆడియో టేపుల్లో, వీడియోటేపుల్లో బహిరంగంగా దొరికిపోయింది చంద్రబాబు కాదా? అని వైఎస్‌ జగన్‌ నిప్పులు చెరిగారు.

బాబు చేసేవి వెధవ పనులు.. చెప్పేవి శ్రీరంగ నీతులు అని మండిపడ్డారు. చంద్రబాబు చేసే ఇలాంటి తప్పుడు పనులు పట్టించుకోకుండా ఆయన తోక పత్రికలు, తోక చానెళ్లు విపరీతంగా ఢంకా బజాయిస్తున్నాయని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో బీజేపీతో జగన్‌ కలిసి నడవబోతున్నారని ఆంధ్రజ్యోతి పత్రిక పతాక శీర్షికతో కథనం ప్రచురించిందని, బీజేపీతో కలిసి నడుస్తున్నది టీడీపీ అయినా.. నంద్యాలలో మైనారిటీ ఓటర్లు ఉన్నారు కాబట్టి.. వారందరిలో జగన్‌కు వ్యతిరేకంగా విషం నింపాలి కాబట్టి.. ఇలాంటి కథనాన్ని ప్రచురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబు నోరుతెరిస్తే అబాద్ధాలు.. మనస్సు నిండా కుళ్లు అని విమర్శించారు. గత ఎనిమిదేళ్లలో అధికారంలో ఉన్న ఎవరికీ తాను భయపడలేదని, రాజకీయాలు ఎల్లప్పుడూ నీతిగా, నిజాయితీగానే చేశానని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. రాజశేఖరరెడ్డి కొడుకు తప్పు చేశాడని ఎప్పుడూ అనుపించుకోనని, ఏం చేసినా నిజాయితీగా చేస్తానని, నీతిగా ఉంటానని ఆయన అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement