ఈ ప్రభుత్వాన్ని ఇంకెన్నాళ్లు భరించాలన్నా? | Sakshi
Sakshi News home page

ఈ ప్రభుత్వాన్ని ఇంకెన్నాళ్లు భరించాలన్నా?

Published Fri, Jul 27 2018 3:03 AM

Ys jagan's praja sankalpa yatra in east godavari district - Sakshi

ప్రజాసంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అన్నా.. ఈ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోంది. సంపన్నులకు దోచిపెడుతోంది. ఇంకెంత కాలం ఈ ప్రభుత్వాన్ని భరించాలన్నా..? కార్మిక, కర్షక, విద్యార్థి, యువజనుల్ని, పేదలను ఆదుకునేందుకు మీరు తప్పనిసరిగా ముఖ్యమంత్రి కావాలన్నా..’ అంటూ వివిధ వర్గాల ప్రజలు గురువారం 221వ రోజు ప్రజాసంకల్పయాత్రలో దారిపొడవునా ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో తమ కష్టాలు చెప్పుకున్నారు.

ఈ ప్రభుత్వ హయాంలో తాము పడుతున్న ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం దర్గాసెంటర్‌ నుంచి ఉదయం పాదయాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కట్టమూరు క్రాస్‌ వరకు వేలాది మంది ప్రజలు జననేత వెంట నడిచారు. తమ కష్టాలు వినే నాయకుడు వచ్చారంటూ అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. మంగళహారతులు పట్టారు. పూల వర్షం కురిపించారు. ప్రేమాభిమానాలు చూపుతూనే తమ ఇక్కట్లను చెప్పుకున్నారు.
 
వాస్తవ సాగుదార్ల గోడు పట్టని ప్రభుత్వం
వాస్తవ సాగుదార్లయిన కౌలు రైతుల గోడును ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని తూర్పుగోదావరి జిల్లా కౌలు రైతుల సంఘం వైఎస్‌ జగన్‌కు ఫిర్యాదు చేసింది. పెద్దాపురం పట్టణ శివార్లలో జగన్‌ను కలిసిన కౌలు రైతులు తమ ఇక్కట్లను ఏకరవుపెట్టారు. సాగు చేస్తూ కూడా పాలకుల ముందు సాగిలపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వాస్తవానికి రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లాలో కౌలు రైతుల సంఖ్య చాలా ఎక్కువ.

భూ యజమానికి ఎటువంటి నష్టం లేకుండా, భూ యజమానితో సంబంధం లేకుండా కౌలు రైతులకు రెవెన్యూ వారు ఇచ్చే పత్రాల ఆధారంగా లోన్‌ ఇవ్వొచ్చు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ అనే ఆచరణ సాధ్యం కాని హామీ ఇచ్చి కౌలు రైతులను నట్టేట ముంచింది. కౌలు రైతుల నోట మట్టికొట్టేలా సర్వే నంబర్‌కు లింక్‌ పెట్టి ఒక భూమికి ఒకే లోను అనడంతో మాకు అన్యాయం జరిగింది. మీరు అధికారంలోకి రాగానే కౌలు రైతులందరికీ న్యాయం చేయాలి’ అని ఆ సంఘం నాయకులు ఇనకొండ వీర విష్ణు చక్రం, వాసం చంద్రరావు జగన్‌ను కోరారు.
 
చేనేతపై జీఎస్టీని రద్దు చేయాలి..
చేనేతల సడుగులు ఇరిగాయని, నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయలేదని జగన్‌ను కలిసిన చేనేత కార్మిక సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. చేనేత సహకార సంఘాలకు ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉన్న నగదు పరపతి బాకీలను మాఫీ చేయాలని కాటన్, సిల్క్, చేనేత ఉత్పత్తిదారులు, సేల్స్‌ సహకార సొసైటీ కోరింది. చేనేత సహకార సంఘాలకు నూలు సబ్సిడీని 20 శాతం నుంచి 40 శాతానికి పెంచాలని, తెలంగాణలో మాదిరి థ్రిఫ్ట్‌ ఫండ్‌ స్కీంకు రాష్ట్ర ప్రభుత్వం వాటాను 8 నుంచి 24 శాతానికి పెంచాలని కోరారు. చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులపై నిరంతరం 30 శాతం రిబేటు ఇవ్వాలని, చేనేతలకు గుదిబండగా మారిన జీఎస్టీని రద్దు చేయాలని జగన్‌ను కోరారు.

ఆప్కో నుంచి సహకార సంఘాలకు నూలు సరఫరా చేయించాలని, ఆప్కో కొనుగోలు చేసిన వస్త్రాలకు ప్రతి రెండు నెలలకు ఒకసారి చెల్లింపులు చేయాలని, చేనేత కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, ఆరోగ్య బీమాను అమలు చేయాలని జగన్‌కు నివేదించారు. చేనేత వర్గాలకు జగన్‌ ఇచ్చిన హామీల పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. తమను పర్మినెంట్‌ చేయాలని కళాగోదావరి ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీల ఫెడరేషన్‌ నేతలు జగన్‌ను కోరారు. సర్వశిక్ష అభియాన్‌ పథకం కింద పార్ట్‌టైమ్‌ పేరుతో ఎంపికైనప్పటికీ తమతో పూర్తి కాలం పని చేయిస్తున్నారని వాపోయారు. తమను క్రమబద్ధీకరించిన తర్వాత మిగిలిన పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని విన్నవించారు.  
 
ఎటు చూసినా సమస్యలే..
జగన్‌ నడిచిన దారి పొడవునా బడుగు వర్గాల ప్రజలు అనేక సమస్యలను ఆయనకు చెప్పుకున్నారు. ‘ఆరోగ్యశ్రీ ఆగమాగమైంది.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కకావికలమైంది.. కౌలు రైతులకు కాణీ రుణం లేదు.. రైతులకు గిట్టుబాటు ధర లేదు, రుణమాఫీ కాలేదు.. పేదల సొంతింటి కల సాకారం కాలేదు కానీ కాంట్రాక్టర్లు, దళారులు, టీడీపీ నేతలు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు’ అని వాపోయారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే ఆదుకుంటామని భరోసా ఇస్తూ ముందుకు సాగారు.  

నిండా ముంచేశారయ్యా..  
అయ్యా.. చంద్రబాబు అధికారం చేపట్టాక కౌలు రైతులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం అందించే రుణాలు భూమి యాజమానులకు అందుతున్నాయి. పంట సాగు చేసే మాకు పెట్టుబడి దొరకడం లేదు. కష్టపడి పంట పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండటం లేదు. పంట నష్టపోయిన కౌలు రైతులకు నాలుగేళ్లుగా పరిహారం అందలేదు. భూ యజమానికి మాత్రం కౌలు చెల్లించాల్సి వస్తోంది. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, రుణాలు ఇవ్వడం లేదు.    
– జగన్‌తో కౌలు రైతు వాసం చంద్రరావు

వైఎస్సార్‌ హయాంలో రైతులకు మేలు జరిగింది
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు మేలు జరిగింది. మెట్ట ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు ఆయన కృషి చేశారు. కౌలు రైతులకూ మేలు జరిగింది. మాకందరికీ గుర్తింపునిస్తూ బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించారు. సాగుకు ఉచిత కరెంటు అందజేశారు. ఆయన మరణం తర్వాత అన్నీ ఇబ్బందులే.      
– రైతులు వీరవిష్ణు చక్రం, మద్దూరి వెంకటేశ్వరరావు


వైఎస్‌ జగన్‌పైనే మా ఆశలు  
నా బిడ్డ బొట్టు రమేష్‌ దీర్ఘకాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. భర్త మరణించడంతో కష్టాలు పడుతూ జాగ్రత్తగా పెంచుతున్నా. ఆస్పత్రుల్లో వైద్యం చేయించేందుకు నానా యాతన పడుతున్నాను. కొద్దిరోజులు తిరుపతిలోని ఆస్పత్రిలో వైద్యం చేయించాను. దూరం కావడం, ఆర్థికంగా శక్తి లేకపోవడంతో ఆ వైద్యాన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నాను. జగన్‌కు నా సమస్యను చెప్పుకున్నాను. ఆయన ముఖ్యమంత్రి అయితే అన్ని విధాలా న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ఉన్నాను.     
– బొట్టు మరియమ్మ 

Advertisement
Advertisement