డ్వాక్రా మహిళలను దారుణంగా వంచించారు | Sakshi
Sakshi News home page

డ్వాక్రా మహిళలను దారుణంగా వంచించారు

Published Sat, Apr 6 2019 5:14 AM

YS Sharmila Election Campaign At East Godavari - Sakshi

పిల్లి ఎవరో, పులి ఎవరో ప్రజలకు తెలుసు..
పౌరుషం, రోషం అంటూ ఇవాళ చంద్రబాబు ఆయనకు సరిపోని మాటలు మాట్లాడుతున్నారు. జగన్‌కు పౌరుషం ఉందా? అంటున్నారు. తండ్రిలాంటి మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని కబ్జా చేసిన చంద్రబాబా పౌరుషం గురించి మాట్లాడేది? ఓదార్పు అనే ఒక్కమాట కోసం జగనన్న కాంగ్రెస్‌ను వీడి సింగిల్‌గా బయటకు వచ్చారు. పిల్లి పిల్లే.. పులి పులే. పిల్లి ఎవరో పులి ఎవరో ప్రజలకు బాగానే అర్థమైంది బాబూ..   
 – షర్మిల 

సాక్షి ప్రతినిధులు, ఏలూరు, కాకినాడ/రావులపాలెం: ‘ఎన్నికలు రావడంతో ఇప్పుడు చంద్రబాబు ‘‘మీ భవిష్యత్తు నా బాధ్యత..’’ అంటూ తిరుగుతున్నారు. ఈ ఐదేళ్లూ ముఖ్యమంత్రిగా ఉన్నది ఆయనే కదా. మరి ఇన్నేళ్లూ ప్రజల బాధ్యత ఆయనది కాదా? లోకేష్‌ ఒక్కడి భవిష్యత్‌ మాత్రమే ఆయన బాధ్యతా? ఐదేళ్లుగా లోకేష్‌ కోసమే పనిచేసిన ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వాలా? పొరపాటునైనా మన భవిష్యత్తును వీళ్ల చేతుల్లో పెడితే సర్వ నాశనం చేసేస్తారు. రుణమాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను  దారుణంగా వంచించి ఇప్పుడు పసుపు–కుంకుమ అంటూ ఎంగిలి చెయ్యి విదిలిస్తున్నారు’ అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. పరిపాలించే రాజుకు మంచి మనసు లేకపోతే ప్రజలు చల్లగా ఉండలేరని పేర్కొన్నారు. బస్సుయాత్ర నిర్వహిస్తున్న షర్మిల శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, ఆచంట, నరసాపురం, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కిక్కిరిసిన ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..

లోకేష్‌కు 3 ఉద్యోగాలు.. యువతకు నిరుద్యోగం
‘‘వైఎస్సార్‌ ఐదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నా అన్ని వర్గాలకూ మేలు చేశారు. ఒక్క రూపాయి కూడా పన్ను పెంచకుండా, సంక్షేమానికి ఏ లోటూ లేకుండా పాలించిన రికార్డు ఆయన సొంతం. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు తొలి సంతకానికే విలువ లేకుండా చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాక విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రులను తొలగించారు. చంద్రబాబు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం పాలైతే  ప్రభుత్వ ఆస్పత్రికి వెళతారా? బాబొస్తే జాబొస్తుందన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు మాత్రమే జాబొచ్చింది. ఈ పప్పు గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కానీ తెలుగు మాత్రం రాదు. కనీసం జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు. ఒక్క ఎన్నికలో కూడా గెలవకపోయినా ఈ పప్పుగారికి ఏకంగా మూడు మంత్రి పదవులు కట్టబెట్టారు. యువతకు మాత్రం ఉద్యోగాలు లేవు. 

జగనన్న పోరాటం వల్లే బాబు యూటర్న్‌
ఏపీకి ఊపిరి లాంటి ప్రత్యేక హోదాను నీరుగార్చేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసి మంత్రి పదవులు కూడా తీసుకున్నాడు. గత ఎన్నికలకు ముందు హోదా కావాలన్నాడు. ఎన్నికలు అయిపోయాక ప్యాకేజీ అన్నాడు. ఇప్పుడు మళ్లీ హోదా అంటున్నాడు. ఎన్నికల తరువాత ఏం అంటాడో ఆయనకే తెలియదు. జగనన్న హోదా కోసం చేయని పోరాటం లేదు. జగనన్న పోరాడకుంటే చంద్రబాబు హోదా అనేవారా?

మాకు పొత్తులు అవసరం లేదు
బీజేపీ, కేసీఆర్‌తో మాకు పొత్తులున్నాయని ఆరోపణలు చేస్తున్నాడు చంద్రబాబు. అదే నిజమైతే జగనన్నపై కేసులన్నీ మాఫీ అయ్యేవి కాదా? హరికృష్ణ మృతదేహం పక్కనే ఉందనే ఇంగితం కూడా లేకుండా కేసీఆర్‌తో పొత్తుల కోసం వెంపర్లాడింది చంద్రబాబే. మాకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదు. సింహం సింగిల్‌గానే వస్తుంది. నక్కలే గుంపులుగా వస్తాయి. వైఎస్సార్‌సీపీ సింగిల్‌గానే బంపర్‌ మెజార్టీతో గెలుస్తుందని దేశంలోని ప్రతి సర్వే చెబుతోంది. చంద్రబాబు మాత్రం కాంగ్రెస్, జనసేన తోడుగా వస్తున్నారు. డైరెక్టర్‌ చంద్రబాబు చెప్పినట్లే యాక్టర్‌ పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నాడు. జనసేనకు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే. వెన్నుపోటు, అవినీతి, అబద్ధాలు, అరాచకానికి మారుపేరు చంద్రబాబు.

బైబై బాబూ.. అని చెప్పండి
గత ఎన్నికల సమయంలో 600కిపైగా హామీలిచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ తిరుగుతున్నాడు. ప్రతి పేదవాడికి మూడు సెంట్ల భూమి, ఇల్లు కూడా ఇస్తానన్నాడు. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నాడు. ఆడపిల్ల పుడితే రూ. 25 వేలు ఇస్తానన్నాడు. రుణ మాఫీ అన్నాడు. మహిళలకు స్మార్ట్‌ఫోన్లు, విద్యార్థులకు ఐప్యాడ్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. టీడీపీ నేతలు ఓట్ల కోసం వస్తే ముందు ఈ బకాయిలన్నీ వడ్డీతో సహా తీర్చమని నిలదీయండి. అది మీ హక్కు. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తానని చంద్రబాబు చెప్పాడు. ఆ లెక్కన రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ చంద్రబాబు ఈ ఐదేళ్లకుగానూ రూ.1.20 లక్షల చొప్పున బాకీ పడ్డారు. ఈ హామీలన్నీ ఎన్నికలలోపే తీర్చేయమని నిలదీయండి. జగనన్న పాలనలో మళ్లీ రైతే రాజవుతాడు. మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందాం. అందుకే అంతా బైబై బాబూ... అంటూ ప్రజాతీర్పు చెప్పండి’’

Advertisement

తప్పక చదవండి

Advertisement