నా బిడ్డ ఎవరికీ భయపడడు | Sakshi
Sakshi News home page

నా బిడ్డ ఎవరికీ భయపడడు

Published Thu, Apr 4 2019 4:44 AM

YS Vijayamma Election Campaign in Vijayanagaram and Visakha - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం, సాక్షి విశాఖపట్నం: ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్‌ అప్పట్లో సోనియా గాంధీనే ఎదిరించాడని.. నా బిడ్డ ఎవ్వరికీ భయపడడని వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ స్పష్టం చేశారు. అక్రమ కేసులతో జైల్లో పెట్టినప్పుడే జగన్‌ భయపడలేదని, తను ఎవరి కాళ్లూ పట్టుకోడు.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోడని వెల్లడించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడని.. ఆయనది నీచమైన వ్యక్తిత్వమని ధ్వజమెత్తారు. ఆయన అనుకుంటే ఎవరినైనా ఏదైనా చేయగలడంటూ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్‌ను అసెంబ్లీలోనే అంతు చూస్తానంటూ బెదిరించిన నీచ చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. బుధవారం విజయనగరం జిల్లా గజపతినగరం, విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ, చోడవరం నియోజకవర్గం రావికమతంలలో విజయమ్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభల్లో ఆమె ఏం మాట్లాడారంటే..

‘‘చంద్రబాబు బీజేపీతో ఉన్నప్పుడు.. జగన్‌ను తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌ అన్నాడు. ఇప్పుడు రాహుల్‌గాంధీ వెనకతిరుగుతూ.. జగన్‌ను బీజేపీ, కేసీఆర్‌ అంటున్నాడు. ప్రజలు ఒకసారి గమనించాలి.  జగన్‌ ఒక్కటే కోరుకుంటున్నాడు. మన రాష్ట్రం బాగు పడాలంటే ప్రత్యేక హోదా కావాలి. అప్పుడే ఉద్యోగాలు, పరిశ్రమలు, రాయితీలు వస్తాయి. ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, కాంగ్రెస్‌ మోసం చేశాయి. వైఎస్సార్‌సీపీకి చెందిన 25 మంది ఎంపీలను మనం గెలిపించుకుంటే.. ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే వారికే జగన్‌ మద్దతిస్తాడు. అంతేగానీ ఎవ్వరితోనూ జగన్‌ పొత్తు పెట్టుకోడు. ఒకవేళ జగన్‌కు పొత్తు ఉందంటే అది ప్రజలతోనే. 

వైఎస్సార్‌.. చివరి వరకూ మీ కోసమే జీవించాడు 
ఎన్నికలకు వారం రోజుల సమయమే ఉంది. ఈరోజు ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఒక్కసారి రాజశేఖరరెడ్డిగారి పాలనను గుర్తుకు తెచ్చుకోండి. ఎన్నో పథకాలతో ప్రజల సంక్షేమం కోసం పనిచేశారు. చివరి నిమిషం వరకూ కూడా ఆయన మీకోసమే జీవించారు. 

నేడు ఎక్కడ చూసినా అక్రమాలే..
గత ఎన్నికలప్పుడు రుణమాఫీలు, నిరుద్యోగ భృతి, బాబు వస్తేనే జాబు అంటూ చంద్రబాబు 600కు పైగా హామీలిచ్చాడు. ఈ ఐదేళ్లలో అందులో ఒక్కటైనా నెరవేర్చిన పాపాన పోలేదు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, 108, 104.. ఇలా అన్ని పథకాలను నిర్వీర్యం చేశాడు. భూములు లాగేసుకున్నాడు. మట్టి నుంచి భూముల దాకా దేన్నీ వదలకుండా దోచుకున్నాడు. ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షల కోట్లు కొల్లగొట్టాడు. నేడు ఎక్కడ చూసినా అక్రమాలే. ఇలాంటి వ్యక్తిని నమ్మి మళ్లీ మోసపోదామా? ఆనాడు కాంగ్రెస్, టీడీపీలు కలిసి జగన్‌పై అక్రమ కేసులు బనాయించాయి. ఆ కష్టకాలంలో ఎంతోమంది మా వెంట నిలిచారు. 18 మంది ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ మాతో నడిచారు. ఉప ఎన్నికలకు కేవలం 12 రోజుల ముందు జగన్‌ బాబును కుట్రలు పన్ని జైల్లో పెట్టించారు. వైఎస్సార్‌ ఆశయాలతో పుట్టిన పార్టీ క్లోజ్‌ అయిపోతుందనుకున్నారు. ఆనాడు మేము ఎంతో బాధలో ఉన్నాం. అయినా కూడా మమ్మల్ని నమ్మి వచ్చిన ఎమ్మెల్యేల కోసం, ప్రజల కోసం.. నేను, షర్మిల బయటకు వచ్చాం. ఆ సమయంలో మా కోసం లక్షలాది మంది రోడ్డు మీదకు వచ్చారు. మాకు అండగా ఉన్నారు. మమ్మల్ని ముందుకు నడిపించారు. అప్పుడే ప్రజల కోసం మనం నిలబడాలని జగన్‌కు చెప్పా.  

దొంగే.. దొంగా దొంగా అన్నట్టుంది బాబు తీరు
ఓ దొంగ బ్యాంకు దగ్గరకు పోయి పక్కదిక్కులు చూస్తూ.. ‘దొంగ.. దొంగ.. దొంగ’ అని అరుస్తాడట. పోలీసు వాళ్లు దొంగను వెతుక్కుంటూ పక్కకు వెళ్లిపోతారట. అప్పుడు అసలు దొంగ తాపీగా బ్యాంకును దోచుకుని పోతాడట. అలాంటి వ్యక్తే చంద్రబాబు కూడా. అందరి మీదా బురద జల్లటం.. తాపీగా దోచుకోవడం చంద్రబాబుకు అలవాటైపోయింది. ఇప్పుడు ఎన్నికల సంఘంపైనా ఆయనకు విశ్వాసం లేదంట. 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారు సీఎంగా ఉన్నప్పుడు అప్పటి డీజీపీ యాదవ్‌పై ఇదే చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఆయన్ని విధుల నుంచి తొలగించారు. ఆనాడు చంద్రబాబు ఎన్నికల సంఘం స్వతంత్ర సంస్థ అంటూ గొప్పగా లెక్చర్లు ఇచ్చాడు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత.. రాష్ట్రమంతా ఎన్నికల కమిషన్‌ చేతుల్లో ఉంటుందని నీతులు చెప్పాడు. మరి నేడు ఏబీ వెంకటేశ్వరరావును విధుల నుంచి తొలగిస్తే చంద్రబాబు ఎందుకు అరుస్తున్నారో చెప్పాలి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ఎన్నికల సంఘంపై కోర్టుకు కూడా వెళతాడు. ఇలాంటి వ్యక్తి అధికారం కోసం ఏమైనా చేస్తాడు. చంద్రబాబుతో పెట్టుకుంటే ఫినిష్‌ చేస్తాడంట. జగన్‌ను అయితే అసెంబ్లీలోనే అంతు చూస్తానని బెదిరించాడు. ఇదే చంద్రబాబు.. ‘నాతో పెట్టుకుంటే ఫినిష్‌ అయిపోతావ్‌’ అని రాజశేఖరరెడ్డిగారిని హెచ్చరించాడు. వైఎస్సార్‌ మరణించడానికి రెండు, మూడు రోజులు ముందు జరిగిందిది. చంద్రబాబు ఎవరినైనా ఏదైనా చేయగలడు. 

అవన్నీ నువ్వు పెట్టించిన కేసులు కాదా? 
17 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. జగన్‌పై 31 కేసులున్నాయని చెబుతున్నాడు. అసలు ఆ కేసులు ఎవరు పెట్టారు? చంద్రబాబు పెట్టినవి కాదా? చంద్రబాబు తన కేసులపై దొడ్డి దారిన స్టే తెచ్చుకున్నాడు. జగన్‌ మాత్రం తనపై పెట్టిన అక్రమ కేసులపై ధైర్యంగా పోరాడుతున్నాడు. ఎవరికి నిజాయతీ ఉందో.. ప్రజలే చెప్పాలి. చంద్రబాబు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాల్సిన అవసరం ఎందుకొచ్చింది. ఫోన్‌ నంబర్లతో సహా మన వ్యక్తిగత సమాచారమంతా బయటపెట్టాడు. వైఎస్సార్‌సీపీకి చెందిన లక్షల ఓట్లు తొలగించలేదా? 

తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టొద్దు..
‘కేసీఆర్‌ పెత్తనం సహించొద్దు.. కేసీఆర్‌ను ఓడించండి’ అని చంద్రబాబు అంటున్నాడు. అసలు కేసీఆర్‌కు, మన రాష్ట్రానికి సంబంధమేంటి? కేసీఆర్‌ ఏమైనా ఏపీలో పోటీచేస్తున్నారా. కేసీఆర్‌తో మనం కలిసి పోటీ చేస్తున్నామా? మరి ఎందుకు చంద్రబాబూ.. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టి రెచ్చగొడుతున్నావ్‌? చంద్రబాబు స్వలాభం కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. జగన్‌ తన తండ్రి వైఎస్సార్‌లాగా రాష్ట్రాన్ని గొప్ప స్థానంలో నిలబెట్టాలనే సంకల్పంతో ఉన్నాడు. జగన్‌కు ఓటేసి రాజన్న రాజ్యం తెచ్చుకుందాం. నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందించాలని జగన్‌ తాపత్రయపడుతున్నాడు. మా రాజన్న బిడ్డ అని జగన్‌ గురించి మీరు గొప్పగా చెప్పుకునే స్థితిలో మిమ్మల్ని నిలబెడతాడు. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్‌ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నా.

Advertisement

తప్పక చదవండి

Advertisement