నవరత్నాలతోనే గడపగడపకూ లబ్ధి | Sakshi
Sakshi News home page

నవరత్నాలతోనే గడపగడపకూ లబ్ధి

Published Mon, Oct 1 2018 4:33 AM

YSR Congress Party Leaders fires on TDP Govt - Sakshi

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఆ పార్టీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నేతలు ఆదివారం ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించారు. విజయనగరం జిల్లాలో జరిగిన ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాత బొబ్బిలిలో నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి చిన అప్పలనాయుడు గడపగడపకూ వెళ్లి నవర్నతాల ప్రయోజనాలను వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు ఆధ్వర్యంలో నవరత్నాల కరపత్రాలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లాలో నియోజకవర్గాల సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, పైడి వెంకటరమణమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రజలను అబద్ధపు హామీలతో నట్టేట ముంచారని  మండిపడ్డారు.

తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. కృష్ణా జిల్లాలో ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు, పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, సామినేని ఉదయభాను, పేర్ని నాని, మల్లాది విష్ణు తదితరులు పాదయాత్రగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. వైఎస్‌ జగన్‌ను సీఎంని చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం గొల్లపాలెంలో సమన్వయకర్త కత్తెర హెనిక్రిస్టినా, కత్తెర సురేష్‌ ప్రతి ఇంటికీ వెళ్లి నవరత్నాల కరపత్రాలు పంచిపెట్టారు. త్వరలోనే మంచి రోజులొస్తాయని భరోసా కల్పించారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొండాయపాలెంలో సమన్వయకర్త గరటయ్య, కందుకూరులో మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి పర్యటించి స్థానికుల సమస్యలు తెలుసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ‘రావాలి జగన్‌–కావాలి జగన్‌’ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌రెడ్డి, సంజీవయ్య, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నేతలు మేరిగ మురళీధర్, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టే పథకాలను ప్రజలకు తెలియజేశారు. చిత్తూరు జిల్లాలో నేతలు, కార్యకర్తలు ప్రతి గడపకూ వెళ్లి టీడీపీ ప్రభుత్వ అవినీతిని వివరించారు. వైఎస్సార్‌ జిల్లాలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అంజద్‌బాషా, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నేత ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి చంద్రబాబు దుర్మార్గపు పాలనపై మండిపడ్డారు. సమస్యలు తీరాలంటే జగన్‌ సీఎం కావాల్సిన అవసరముందని వివరించారు. కర్నూలు జిల్లా కల్లూరులోని 20, 21 వార్డుల్లో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మీనగర్‌లో 100 రజక కుటుంబాలు టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరాయి.  మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌ తదితరులు ఇంటింటికీ వెళ్లి నవరత్నాల వల్ల చేకూరే లబ్ధిని తెలియజేశారు. 

Advertisement
Advertisement