గండికోటకు పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి | Sakshi
Sakshi News home page

గండికోటకు పదివేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలి

Published Wed, Sep 5 2018 2:15 PM

YSRCP Demand For Gandikota Water - Sakshi

కడప కార్పొరేషన్‌: గండికోట ప్రాజెక్టుకు ఎస్‌ఆర్‌బీసీ నుంచి అవుకు, గోరకల్లు ద్వారా 10 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఇక్కడి వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ కడప పార్లమెంట రీ జిల్లా అధ్యక్షుడు కె. సురేష్‌బాబులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోతీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, సెప్టెంబర్‌ మాసం వచ్చినా 10 నియోజకవర్గాలు, 51 మండలాల్లో ఎక్కడా పదును వర్షం కూడా పడలేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు తుంగభద్ర, జూరాల ద్వారా శ్రీశైలంకు వరదనీరు వచ్చిందని, నాగార్జున సాగర్‌ నిండటం వల్ల నిన్ననే గేట్లు కూడా ఎత్తారని, సోమశిల ప్రాజెక్టు కూడా నిండిందన్నారు. అన్ని ప్రాజెక్టులు నిండినా ప్రభుత్వం జిల్లాకు నీరివ్వకుండా నిర్లక్ష్యం చూపుతోం దని ఆరోపించారు.

ఎస్‌ఆర్‌బీసీ ద్వారా 2వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారని, ఆ నీటితో గండికోట ఎప్పుడు నిండుతుందని ప్రశ్నించారు. జిల్లాకు గుండె కాయలాంటి గండికోటకు పదివేల క్యూసెక్కులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గండికోట నిండితేనే వామికొండ, సర్వరాయసాగర్, మైలవరం, చిత్రావతి, పైడిపాళెం ప్రాజెక్టులకు నీరు, ప్రొద్దుటూరుకు తాగునీరు అందుతాయన్నారు. వరద కేవలం 30–40రోజులే ఉంటుందని, ఆ సమయంలో నీటిని తెచ్చుకోకపోతే ఏడాదంతా ఏం చేయాలని నిలదీశారు. వరద అయిపోకముందే, శ్రీశైలంలో నీటిమట్టం పడిపోక ముందే గండికోటకు నీరివ్వాలని అన్నా రు. వెలుగోడుకు 12వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే కేవలం 4వేల క్యూసెక్కులు తెలుగుగంగకు వదులుతున్నారన్నారు. మన జిల్లాకు 600 క్యూసెక్కులు మాత్రమే వస్తున్నాయన్నారు. వెలుగోడు వద్ద బలహీనంగా ఉన్న 0–18 కీ.మీ కాలువకు మరమ్మతులు చేయాలని ఇరిగేషన్‌ శాఖా మంత్రికి అనేకసార్లు విన్నవించినా, ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. ఇప్పటికైనా ఆ పనులు చేపట్టాలని కోరారు.

ఉక్కు పరిశ్రమపైఉలుకూ, పలుకూ  లేని ప్రభుత్వం
జూన్‌ 30న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి రెండు నెలల్లో కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే తామే ఏర్పాటు చేస్తామని చెప్పారని, రెండు నెలలు పూర్తయినా సీఎం ఉలుకూ, పలుకూ లేకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు. జిల్లాలో ఫుడ్‌పార్కు, హార్టికల్చర్‌ హబ్, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ధ్వజ మెత్తారు. ఉక్కు పరిశ్రమ కోసం సీఎం రమేష్‌ ప్రచారార్భాటంతోనే నిరవధిక నిరాహార దీక్ష చేశారని విమర్శించారు. దీక్షకు ముందుగానీ, తర్వాతగానీ ఆయన ఏనాడు ఉక్కు పరిశ్రమపై మాట్లాడలేదన్నారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏర్పాటు చేయలేకపోతోందన్నారు. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా దాన్ని సాధించలేదని, ఇ ప్పుడైనా మొద్దునిద్ర నుంచి మేల్కొనా లని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, ఎస్‌.యానాదయ్య, చీర్ల సురేష్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement