‘ప్రైవేటు కంపెనీలకు డేటా ఎలా ఇచ్చారు’ | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు కంపెనీలకు డేటా ఎలా ఇచ్చారు’

Published Tue, Mar 5 2019 6:10 PM

YSRCP Leader Botsa Satyanarayana Slams TDP Over Leakage Of Private Data - Sakshi

హైదరాబాద్‌: మా తాలూకు సమాచారాన్ని(డేటా) ప్రైవేటు కంపెనీలకు ఎలా ఇచ్చారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ టీడీపీ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు. బాధ్యత గల పౌరుడిగా తాను అడుగుతున్నానని, సూటిగా సమాధానం చెప్పాలన్నారు. వ్యక్తుల గోప్యతను బహిరంగపరిచింది వాస్తవమా? కాదా టీడీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు.  హైదరాబాద్‌లోని వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇస్తే ఏపీ ప్రభుత్వం తమపై ఎదురుదాడి చేస్తోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో 10 ఏళ్లు హక్కు అని స్పీకర్‌ కోడెల చెబుతున్నారు.. మరి హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. జె. సత్యనారాయణ అనే రిటైర్డ్‌ అధికారి ఈ విషయంపై స్పందించాలని కోరారు.



ఆధార్‌ సమాచారం మీ ద్వారా రావడం వాస్తవమా కాదా సమాధానం ఎదురుచూస్తున్నామన్నారు.  డేటా అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుందని, మీ డేటాతో మా పార్టీకి ఏం పని అని ప్రశ్న లేవనెత్తారు. ఏపీ పౌరుల డేటా అంతా సేవా-మిత్ర ద్వారా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లా కుమిలి గ్రామంలో ఐప్యాడ్‌లో సమాచారమంతా ఉందని గతంలోనే తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. మా పార్టీ నాయకుల ఇళ్లపై దాడులు చేసి వేధించారని చెప్పారు. టీడీపీ నాయకుల డేటా లీకేజీ వ్యవహారంతో ఈ రోజు వాస్తవాలు బయటకు వచ్చాయని అన్నారు. ఎన్నికల కమిషన్‌ ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు.

ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్న వివరాలు ఎన్నికల కమిషన్‌కు ఇచ్చామని పేర్కొన్నారు. అసలు ఐటీ గ్రిడ్‌తో టీడీపీకి ఉన్న సంబంధం ఏంటో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. అక్రమ మార్గంలో ఓట్లు వేయించుకోవడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితే తెలియదా అని టీడీపీ నాయకులనుద్దేశించి ఎద్దేవా చేశారు. ఐటీ గ్రిడ్స్‌ సంస్థకు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల కాంట్రాక్టు ఇచ్చిన విషయం వాస్తవం కాదా? భూములు కేటాయించలేదా అని సూటిగా ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు తాటాకు చప్పుళ్లకు భయపడమని చెప్పారు.

Advertisement
Advertisement