సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్‌ సీపీ మద్దతు

31 Jan, 2019 14:21 IST|Sakshi

సాక్షి, విజయవాడ : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌)ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎస్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ గురువారం ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీకి తరలిరాగా.. ‘చలో అసెంబ్లీ’కి  అనుమతి లేదని చెప్పిన పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణను అరెస్టు చేసి గవర్నర్‌ పేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మల్లాది విష్ణు, గౌతం రెడ్డి.. సూర్యనారాయణను పరామర్శించారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్‌ ఉద్యోగుల ఆందోళనకు వైఎస్సార్‌ సీపీ పూర్తి మద్దతునిస్తుందని తెలిపారు. సీపీఎస్‌ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్‌పై ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం దారుణమన్నారు. ఉద్యోగులపై పోలీసులను ప్రయోగించడం హేయమైన చర్య అని విమర్శించారు. అరెస్టు చేసిన ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు