విభజన హామీల సాధనలో బాబు విఫలం | Sakshi
Sakshi News home page

విభజన హామీల సాధనలో బాబు విఫలం

Published Thu, Dec 13 2018 4:21 AM

YSRCP Leaders Comments on Chandrababu at Rajyasabha well - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నాలుగేళ్లు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు.. ఏపీకి ప్రత్యేకహోదా సహా ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల సాధనలో పూర్తిగా వైఫల్యం చెందారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ బుధవారం పార్లమెంటులో, పార్లమెంటు ఆవరణలో ఆందోళన నిర్వహించారు. రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఉదయం పార్లమెంటు సమావేశాలకు ముందు అక్కడి గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్టీ మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, మిథున్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, బాలశౌరి ఆందోళన చేశారు. ఏపీకి హోదా కావాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సమావేశాలు ప్రారంభమయ్యాక రాజ్యసభలో పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వి.ప్రభాకర్‌రెడ్డి వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు.

వైఎస్సార్‌ సీపీతోపాటు విభిన్న అంశాలపై వివిధ పార్టీల ఆందోళనతో రాజ్యసభ కొద్దిసేపటికే వాయిదా పడింది. తిరిగి 12 గంటలకు సభ ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ సభ్యులు వెల్‌లో తమ ఆందోళన కొనసాగించారు. సభ సజావుగా లేకపోవడంతో రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు సభను మరోసారి వాయిదావేశారు. తిరిగి 2 గంటలకు సమావేశమైనా ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ నేపథ్యంలో సభ గురువారానికి వాయిదా పడింది. పార్లమెంటు ఆవరణలో ఆందోళన నిర్వహించిన సందర్భంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ‘బీజేపీతో జతగట్టి నాలుగేళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీలు ఫ్యాక్టరీ, చెన్నై–వైజాగ్‌ కారిడార్, విశాఖ రైల్వే జోన్‌ సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు.

ఈరోజు అధికారంలో కొనసాగడానికి ఆయనకు నైతిక హక్కు లేదు. ప్రజలందరూ చంద్రబాబు అన్ని రంగాల్లో వైఫల్యం చెందారని ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణలో 13 స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచారంటే అదొక సంకేతంగా తెలుస్తోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. ఏపీలో తాను చేసిన అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి విజయమాల్యాలా దేశం విడిచిపెట్టి పోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఉత్పన్నమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్ని విభజన హామీల సాధనకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది.  చట్టంలోని అంశాలు అమలు పరచని పక్షంలో ఎన్డీయే గెలిచే అవకాశమే లేదు..’ అని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు దిమ్మతిరిగేలా దెబ్బకొట్టారు..
నాలుగేళ్లు కేంద్రంలో అధికారం అనుభవించి ఇప్పుడు ధర్మపోరాటమంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారని మేకపాటి రాజమోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఘోరంగా విఫలమై తెలంగాణకు వెళ్లి అక్కడేదో నీతులు చెప్పబోతే అక్కడి ప్రజలు ఇతడిని దిమ్మ తిరిగేలా దెబ్బ కొట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీ ప్రజలు అంతకంటే గొప్పగా దెబ్బకొట్టబోతున్నారని స్పష్టం చేశారు. చంద్రబాబుకు పుట్టగతులు ఉండవన్నారు. ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను కొనుక్కుని తగదునమ్మా అంటూ అక్కడికి వెళ్లి మాయ మాటలు చెప్పాడని దుయ్యబట్టారు. ఇలాంటి నీతి బాహ్యమైన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగడం ఏ మాత్రం తగదన్నారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు రాష్ట్రవ్యాప్తంగా జనం నీరాజనం పలుకుతున్నారని పేర్కొన్నారు. పీవీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏపీకి హోదా కోసం ఎంపీలు రాజీనామా చేసి ఒత్తిడి తెచ్చినా కేంద్ర ప్రభుత్వంలో స్పందనలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు చూసైనా కేంద్ర ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. బాలశౌరి మాట్లాడుతూ.. హోదా కోసం తొలి రోజు నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతూనే ఉందని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement