వైఎస్సార్‌సీపీతోనే బీసీల అభ్యున్నతి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీతోనే బీసీల అభ్యున్నతి

Published Tue, Jan 29 2019 1:38 PM

YSRCP Leaders Meeting in Kurnool - Sakshi

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతోనే బీసీల సామాజిక, ఆర్థికాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య అన్నారు. ఎన్నికల సమయంలో కేవలం బీసీల ఓట్ల కోసం టీడీపీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో జయహో బీసీ సభను నిర్వహించారని విమర్శించారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా జనాలకు డబ్బులిచ్చి తీసుకెళ్లినా.. చంద్రబాబు ప్రసంగాన్ని కూడా వినకుండానే మధ్యలోనే వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఐదేళ్ల పాలనలో ఏమీ చేయకుండా ఇప్పుడు చెబితే ఎందుకు వింటామంటూ వారు మధ్యలోనే నిష్క్రమించారన్నారు. సోమవారం వారు వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

టీడీపీకి బీసీలు జీవం పోశారని, కానీ ఆ పార్టీ మాత్రం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకొని వదిలేసిందని విమర్శించారు. ఇదే విషయాన్ని ప్రజా సంకల్ప యాత్రలో బీసీల్లోని అనేక కులస్తులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారని గుర్తు చేశారు. దీంతో ఆయన బీసీల అభ్యున్నతి కోసం అనేక పథకాలను ప్రకటించారన్నారు. అత్యంత వెనుకబడిన కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు, చట్టసభల్లో ప్రాతినిథ్యం లేని కులాలకు అవకాశం కల్పించడం, బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం, విద్యార్థుల చదువుకు భరోసా కోసం పూర్తిస్థాయి ఫీజురీయింబర్స్‌మెంట్, అమ్మఒడితో పాటు ఎన్నో కార్యక్రమాలను ప్రకటించారన్నారు. వాటిని సీఎం చంద్రబాబు కాపీ కొట్టడమే కాకుండా తమ పార్టీ అధినేతపైనే బురద జల్లుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు 2014 ఎన్నికల్లో బీసీల కోసం 106 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయలేదన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌ ఏర్పాటు చేసి ఏడాదికి రూ.10 వేల కోట్లను ఖర్చు చేస్తామని చెప్పి..మోసం చేశారని విమర్శించారు. ఆదరణ కింద తుప్పు పట్టిన పరికరాలను ఇచ్చారన్నారు. జయహో బీసీ సభలో రూ.3 వేల కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పడం ఎన్నికల గిమ్మిక్కు అని దుయ్యబట్టారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించి.. ఈసారి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఎదురుచూస్తున్నారన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జిల్లాలో బీసీలకు ఏమీ చేయలేదని, దీనిపై చర్చకు వైఎస్సార్‌సీపీ సిద్ధమని సవాల్‌ విసిరారు.  

రుణమాఫీ నిధులు ఎప్పుడిస్తారు?
సీఎం చంద్రబాబు రైతులు, మహిళలను దగా చేశారని శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో రూ.84 వేల కోట్ల  రైతుల రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చివరకు రూ.24 వేల కోట్లకు కుదించారన్నారు. ఇందులోనూ ఇంతవరకు మూడు విడతల్లో రూ.13.5 వేల కోట్లు మాత్రమే విడుదల చేశారని, ఇది వడ్డీకి కూడా చాల్లేదని తెలిపారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయని, అయితే.. నాలుగు, ఐదో విడత మాఫీ నిధులు  రూ.10.5 వేల కోట్లు ఇంకెప్పుడు జమ చేస్తారని ప్రశ్నించారు. అలాగే పొదుపు మహిళలకు ఇంకా రూ.4 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉందన్నారు. వీటిని ఇవ్వకుండా మరోసారి నగదు, సెల్‌ఫోన్ల పేరుతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్‌డేటెడ్‌ చెక్కులు ఇచ్చిన దాఖలాలు లేవని, ఏపీలో మాత్రం చంద్రబాబు మహిళల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చి.. ఒక్కొక్కరి తలపై రూ.75 వేల అప్పు మిగిల్చారన్నారు.

నెలలో కార్పొరేషన్లుఎలా ఏర్పాటు చేస్తావు బాబూ..
చంద్రబాబు పాలన చివరి అంకానికి చేరుకుందని, మరో నెలలోనే ఆయన పాలనకు తెరపడనున్న నేపథ్యంలో బీసీ కులాలకు కార్పొరేషన్లను ఎలా ఏర్పాటు చేస్తారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్రశ్నించారు. 2004లో బీసీలకు కోటి వరాలను ప్రకటించినా టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని,  ఇప్పుడు కూడా ఎన్ని వరాలిచ్చినా ఓడిపోవడం ఖాయమని అన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, రాష్ట్ర  అదనపు కార్యదర్శి నరసింహులు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి తోట వెంకట కృష్ణారెడ్డి, నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, కరుణాకరరెడ్డి, రాజేంద్రప్రసాద్‌ నాయుడు, గోపాల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, భాస్కరరెడ్డి, బాబుసాహెబ్, విజయలక్ష్మీ, జమీలబేగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement