అప్పుడేమన్నారు? ఇప్పుడేమంటున్నారు? | Sakshi
Sakshi News home page

అప్పుడేమన్నారు? ఇప్పుడేమంటున్నారు?

Published Fri, Nov 10 2017 1:26 AM

ysrcp mla srikanth reddy blmes on ap speaker kodela  - Sakshi

సాక్షి, అమరావతి: ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు చెప్పడాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తప్పుపట్టారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గతంలో మా పార్టీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజాను అసెంబ్లీ నుంచి బహిష్కరించినప్పుడు కోర్టు ఆమెను సభలోకి అనుమతించాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు తీసుకుని అసెంబ్లీలోకి రావాలని ఆమె వస్తే.. సభ కోర్టు పరిధిలోకి రాదని అప్పట్లో స్పీకర్‌ ప్రకటించారు. అప్పుడు కోర్టు ఆదేశాల్నే ఖాతరు చేయలేదు. ఇప్పుడేమో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి మాత్రం కోర్టు కేసు అడ్డుగా ఉన్నట్లు సాకులు చూపుతున్నారు. ఇలా ద్వంద్వ వైఖరి ఎందుకు? సభ హుందాతనాన్ని, విలువలను కాపాడాల్సినవారే దిగజారుతుంటే ఎవరికి చెప్పుకోవాలి?’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్పీకర్‌ పునఃసమీక్షించుకోవాలన్నారు. ‘స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎప్పుడో రాజీనామా పత్రం సమర్పించాం. స్పీకరే నిర్ణయం తీసుకోవాలి’ అని మంత్రి ఆదినారాయణరెడ్డి అంటున్నారని, మరి రాజీనామా సమర్పిస్తే స్పీకర్‌ ఎందుకు ఆమోదించరు? ఈ డ్రామా ఎందుకు? రాజ్యాంగాన్ని గౌరవించని వారు అధికారాలు వినియోగించుకోవడానికి అనర్హులని  అన్నారు.

స్పీకర్‌ వ్యాఖ్యలు సమంజసంగా లేవు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించడంద్వారా ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలని, రాజ్యాంగ గౌరవాన్ని పరిరక్షించాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేసి బయటికొచ్చాక సభాపతి కోడెల చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమంజసంగా లేవని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తన నిర్ణయాలను, ఆలోచనలను సమీక్షించుకోవాలని స్పీకర్‌కు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు. ‘‘వైఎస్సార్‌సీపీ సభకు రాకుండా పారిపోయిం దని టీడీపీవారు అంటున్నారు. మా నేత, మేం ప్రజలమధ్యే ఉన్నాం. పారిపోతున్నదెవరో? దొడ్డిదారిన వెళుతున్నదెవరో వారే ఆలోచించాలి..’’ అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలి: కళావతి
సీతంపేట: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలనే డిమాండ్‌తోనే వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిస్తున్నారని శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తెలిపారు. గురువారం సీతంపేటలో ఆమె విలేకరులతో మాట్లాడు తూ.. వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే లపై చర్యలు తీసుకుంటే  సమావేశాలకు హాజరవు తామని స్పష్టం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టు పరిధిలో ఉందని బాధ్యతగల స్పీకర్‌ చెప్పుకురావడం ఎంతవరకు సమంజసమన్నారు.

Advertisement
Advertisement