వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా వేమురెడ్డి ప్రభాకరరెడ్డి | Sakshi
Sakshi News home page

ఐపీఎస్‌ అధికారివా.. టీడీపీ కార్యకర్తవా?

Published Sun, Feb 18 2018 9:11 AM

ysrcp mp vijay sai reddy fires on additional DG - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి విజయాన్ని అడ్డుకునేందుకు అధికార టీడీపీ ఐఏఎస్, ఐపీఎస్‌ అ«ధికారులను కూడా రంగంలోకి దింపి ప్రలోభాలకు పాల్పడుతోందని వైఎస్సార్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇప్పటివరకు సీఎంతో సహా మంత్రులు, ముఖ్యనేతలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని, తాజాగా ఉన్నతాధికారులు కూడా అలాగే పని చేస్తుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజలకు సేవ చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సతీష్‌చంద్ర, అదనపు డీజీ వెంకటేశ్వర్లు టీడీపీ నేతల్లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. శనివారం విశాఖ మద్దిలపాలెం కృష్ణా కళాశాల రోడ్డులో వైఎస్సార్‌ సీపీ నగర నూతన కార్యాలయ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీ నేతలు బొత్స, తమ్మినేని , ఎమ్మెల్సీ కోలగట్ల  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా వేమురెడ్డి ప్రభాకరరెడ్డి
త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ తరపున వేమురెడ్డి ప్రభాకరరెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఖరారు చేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన్ను అందరికీ పరిచయం చేశారు. రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు అవసరమైన 44 మంది ఎమ్మెల్యేలు తమకు ఉన్నా వారిని ప్రలోభ పెట్టేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందన్నారు. టీడీపీలోకి రావాలంటూ తమ ఎమ్మెల్యేలను మంత్రి కళా వెంకట్రావు వేడుకుంటున్నారని, కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువని వ్యాఖ్యానించారు.    

గొప్పల వల్లే కేంద్రం మొండిచేయి
భాగస్వామ్య సదస్సుల ద్వారా రూ. 15.50 లక్షల కోట్లు, చైనా నుంచి రూ.20 లక్షల కోట్లు, సింగపూర్‌ నుంచి రూ.10 లక్షల కోట్లు, దావోస్‌ నుంచి రూ. 10 లక్షల కోట్లు వస్తున్నాయని టీడీపీ సర్కారు గొప్పలు చెప్పుకోవడం వల్లే రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపిందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

సాంఘిక సంక్షేమ శాఖ నిర్వీర్యం
సాంఘిక సంక్షేమ శాఖను నిర్వీర్యం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. గత మూడేళ్లలో 768 ఎస్సీ హాస్టళ్లు మూసివేసి 46 వేల మందిని గురుకుల విద్యాలయాలకు తరలించటంతో 70 శాతం మంది చదువులకు స్వస్తి చెప్పారని తెలిపారు.మిగిలిన 759 హాస్టళ్లను కూడా వచ్చే విద్యాసంవత్సరం నుంచి మూసివేయాలని ప్రయత్నిస్తుండటంతో 71,000 మంది విద్యార్థులు రోడ్డున పడే ప్రమాదం నెలకొందన్నారు.

రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పదవులను తృణప్రాయంగా త్యజించేందుకు సిద్ధమైన వైఎస్సార్‌ సీపీ ఎంపీల త్యాగాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సూచించారు.  ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకునే గజదొంగలా తయారయ్యారని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. సమావేశంలో ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, ఎమ్మెల్యేలు బూడి ముత్యాలనాయుడు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కంబాల జోగులు విశాఖ, అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షులు తైనాల విజయకుమార్, గుడివాడ అమర్‌నా«థ్, అనకాపల్లి పార్లమెంట్‌ కో ఆర్డినేటర్‌ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణ రాజు, కో ఆర్డినేటర్లు, జిల్లా, రాష్ట్ర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement