హోదా కోసం ఎందాకైనా..! | Sakshi
Sakshi News home page

హోదా కోసం ఎందాకైనా..!

Published Thu, Feb 8 2018 1:09 AM

Ysrcp MPs dharna in Parliament premises about AP Special status - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసనలో మరో అడుగు ముందుకేసింది. ఏకంగా రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరించింది. సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. బుధవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డిలు ధర్నాకు దిగారు. ప్రత్యేక హోదా వచ్చేవరకు తమ పోరాటం కొనసాగుతుందని మరోసారి స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని పలు హామీలను ప్లకార్డుల రూపంలో ప్రదర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, దుగరాజపట్నం పోర్టు, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్, కడప స్టీలు ప్లాంటు, తదితర ప్రాజెక్టుల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ మీడియాలో హైలైట్‌ అయ్యేందుకు పాకులాడుతోందే తప్ప, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా విషయంలో గానీ, రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు, పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ తదితర విషయాలపై కేంద్రం సమాధానం ఇవ్వలేదని.. ఆ మాత్రం ప్రకటనకే టీడీపీ వారు సంతృప్తి చెందడాన్ని బట్టి వారి చిత్తశుద్ధి ఏంటన్న విషయం అర్థమవుతుందని ధ్వజమెత్తారు. 

వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు 
బుధవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నినదించారు. మంగళవారం ఆందోళన విరమించిన టీడీపీ ఎంపీలు తిరిగి బుధవారం పార్లమెంటు ఆవరణలో ధర్నా చేసి లోక్‌సభలో వెల్‌లో ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనల మధ్యే స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ సభలోకి వచ్చారు.

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి జరిగిన చర్చకు సమాధానం ఇస్తారని, వైఎస్సార్‌సీపీ, టీడీపీ సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంతకుమార్‌ కోరారు. వెంటనే టీడీపీ సభ్యులు తమ ఆందోళన విరమించి తమ స్థానాలకు వెళ్లారు. అయితే వైఎస్సార్‌సీపీ సభ్యులు తమ ఆందోళన కొనసాగిస్తుండగా స్పీకర్‌ వారించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ వచ్చి విజ్ఞప్తి చేసినా వారు కదల్లేదు. ప్రధాని ప్రసంగం నుంచి తమ డిమాండ్లకు పరిష్కారం ఆశిస్తున్నామని, తమ డిమాండ్లను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరగా స్పీకర్‌ నిరాకరించారు. దీంతో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ప్రధాని ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు.  

టీడీపీ ఎంపీల ఆందోళన డ్రామా: ఖర్గే 
ప్రధాని ప్రసంగించే ముందు టీడీపీ ఎంపీలు తమ స్థానాల్లోకి వెళ్లడాన్ని కాంగ్రెస్‌ తప్పుపట్టింది. ఇదంతా ప్రభుత్వ ప్రాయోజి త కార్యక్రమమని ఆ పార్టీ లోక్‌సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. అందుకే తన ప్రసంగాన్ని అడ్డుకుని, ఇప్పుడు ప్రధాని ప్రసంగం సమయంలో మౌనంగా ఉన్నా రన్నారు. ప్రభుత్వంలో ఉండి ఆందోళన చేయడాన్ని డ్రామాగా అభివర్ణించారు.   

బడ్జెట్‌ సమావేశాల్లోపు హామీలు నిలబెట్టుకోండి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను బడ్జెట్‌ సమావేశాల్లో ఫైనాన్స్‌ బిల్లు ఆమోదం పొందేలోపు అమలు చేయాలని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కోరింది. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత కేంద్రంపై ఉందని, కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్‌ కావడంతో ఇచ్చిన హామీలను బడ్జెట్‌ సమావేశాల్లోపు అమలు చేయాలని పార్టీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి. విజయసాయిరెడ్డి, వరప్రసాదరావు, పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డి కోరారు. పార్టీ ఎంపీలు బుధవారం ఉదయం రాజ్‌నాథ్‌ సింగ్‌ను ఆయన నివాసంలో కలిశారు. 5 పేజీల వినతిపత్రాన్ని ఇచ్చారు.   

Advertisement
Advertisement