మా రాజీనామాలు ఆమోదించండి | Sakshi
Sakshi News home page

మా రాజీనామాలు ఆమోదించండి

Published Tue, May 29 2018 4:37 PM

YSRCP MPs To Meet Loksabha Speaker Today - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్నామని, తమ రాజీనామాలు ఆమోదించాలని లోక్‌సభ స్పీకర్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు కోరారు. లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌తో మంగళవారం ఆమె కార్యాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకే తమ పదవులకు రాజీనామాలు చేశామని స్పీకర్‌తో ఎంపీలు పేర్కొన్నారు.

మా రాజీనామాలు ఆమోదించండి..
స్పీకర్‌ కలిసేందుకు వెళ్లే ముందు రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అందరూ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి హోదా సాధించలేకపోయారు. స్వలాభం కోసం ఆయన హోదాను తాకట్టు పెట్టారు. మేం మొదటి నుంచి హోదా కోసం పోరాడుతున్నాం. హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం.’ అని అన్నారు.

ఉప ఎన్నికలకు సిద్ధం...
మా రాజీనామాలు త్వరగా ఆమోదించాలని స్పీకర్‌ను కోరతామని ఎంపీ మిథున్‌ రెడ్డి తెలిపారు. స్పీకర్‌ మా రాజీనామాలు ఆమోదిస్తారని ఆశిస్తున్నాం. ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు. మాటలు మారుస్తూ చంద్రబాబు యూటర్న్‌ తీసుకున్నారు. హోదాను నీరుగార్చిన వ్యక్తి చంద్రబాబేనని దుయ్యబట్టారు. నాలుగేళ్లు కాలయాపన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని ధ్వజమెత్తారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు..
విభజన హామీల అమలు కోసం మొదటి నుంచి పోరాడుతున్నామని ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి అన్నారు. హోదా కోసం ఏప్రిల్‌ 6వ తేదీన రాజీనామాలు చేసి నిరాహార దీక్ష చేపట్టామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమతో కలిసి రాజీనామాలు చేయాలని టీడీపీ ఎంపీలను కోరామని, 25మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే హోదా వచ్చేదని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబుకు పట్టవని, నాలుగేళ్లుగా హోదా నినాదంతో ప్రజల మధ్య ఉన్నామన్నారు. తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ను కోరనున్నట్లు వైఎస్‌ అవినాష్ రెడ్డి తెలిపారు.

ఓడిపోతామని చంద్రబాబుకు భయం..
హోదా కోసం రాజీనామాలు చేశామని, తమ రాజీనామాలు ఆమోదించకపోతే ఏపీ ప్రజలను అవమానించినట్లే అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తక్షణమే తమ రాజీనామాలు ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. ఉప ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, అందుకే తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించడం లేదన్నారు. రాజీనామాలు చేస్తే ఓడిపోతామని చంద్రబాబు భయం పట్టుకుందన్నారు.

హోదా కోసం దేనికైనా సిద్ధం
స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరతామని ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించడానికి చంద్రబాబు భయమని, ఉప ఎన్నికలంటే జంకుతున్నారని ఆయన విమర్శించారు. ఓటుకు కోట్లు కేసు, ఆర్థిక అవకతవకల కేసులతో చంద్రబాబుకు వణుకు పడుతుందన్నారు. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాహుల్‌ గాంధీతో కలవడానికైనా, మోదీతో జతకట్టడానికి అయినా చంద్రబాబు వెనకాడరన్నారు. విలువలు లేని పచ్చి అవకాశవాది చంద్రబాబు అని మేకపాటి మండిపడ్డారు.

Advertisement
Advertisement