ఆ మరుక్షణమే రాజీనామాలు: వైఎస్సార్‌సీపీ ఎంపీలు | Sakshi
Sakshi News home page

ఆ మరుక్షణమే రాజీనామాలు: వైఎస్సార్‌సీపీ ఎంపీలు

Published Mon, Mar 26 2018 1:15 PM

YSRCP MPs Will Resign On Same Day If Sessions Will Prorogued By Govt - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా పోరాడుతోన్న  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఎంపీల రాజీనామాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ నిరవధిక వాయిదా పడిన మరుక్షణమే తాము రాజీనామాలు చేస్తామని ఆ పార్టీ ఎంపీలు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ముప్పాళ్ల గ్రామంలో ప్రజాసంకల్పయాత్ర శిబిరం వద్ద పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితో సోమవారం ఎంపీలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.

స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామాలు: ఎన్డీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాం. సభలో చర్చ జరిగేదాకా నోటీసులు ఇస్తూనే ఉంటాం. హోదా ప్రకటన రాకుంటే పార్లమెంట్‌ సమావేశాల చివరిరోజు పదవులకు రాజీనామాలు చేస్తామని ఇదివరకే ప్రకటించాం. కానీ, ఈ లోపే సభ నిరవదికంగా వాయిదా పడితే.. తర్వాతి నిమిషమే స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పిస్తాం. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు మాకు దిశానిర్దేశం చేశారు’ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మీడియాకు తెలిపారు.

టీడీపీ ఎంపీలు కూడా చేస్తే..: ‘‘అసలు హోదానే వద్దన్న చంద్రబాబు ఇప్పుడు స్టాండ్‌ మార్చుకుని మాతోకలిసి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకొచ్చారు. రాజీనామాల విషయంలోనూ టీడీపీకి మా సూచన ఇదే.. వైఎస్సార్‌సీపీతోపాటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేస్తే దేశవ్యప్తంగా చర్చ జరుగుతుంది. తద్వారా కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుంది. హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని మొదటి నుంచీ నమ్మింది వైఎస్సార్‌సీపీనే, ధర్నాలు, యువభేరిలతో ప్రజల్ని చైతన్యం చేసింది కూడా మేమే. కానీ చంద్రబాబు ఇప్పటికీ పూటకో మాట చెబుతూ ప్రజల్ని గందరగోళపరుస్తున్నారు. మోదీ గ్రాఫ్‌ పడిపోవడం వల్లే బాబు ఎన్డీఏ నుంచి బయటికొచ్చారన్నది వాస్తవం’’ అని మేకపాటి పేర్కొన్నారు.

పార్టీ ఎంపీలతో వైఎస్‌ జగన్‌ భేటీ ముఖ్యాంశాలు

  • ఏప్రిల్‌ 6 కన్నా ముందే పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడితే అదే రోజే ఎంపీలు లోక్‌సభకు రాజీనామాలు. స్పీకర్‌ ఫార్మాట్‌లోనే రాజీనామాలు ఇవ్వాలని సూచించిన వైఎస్ జగన్‌
  • గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లలో ప్రజాసంకల్పయాత్ర శిబిరంలో పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్‌ సమావేశం. ప్రత్యేక హోదా పోరాటంపై ఎంపీలకు వైఎస్ దిశానిర్దేశం
  • ముందుగా రాజీనామాలు ప్రకటిస్తే.. టీడీపీకూడా ఈ తరహా ప్రకటనలు చేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన ఎంపీలు 
  • ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భేషజాలకు పోవాల్సిన పనిలేదన్న వైఎస్ జగన్
  • ఏ విషయాన్నైనా దాపరికంలేకుండా మనం ప్రజలముందు ఉంచుతున్నాం
  • రాజీనామాల ప్రకటన నుంచి అవిశ్వాసం వరకూ మనం నిర్ణయాలన్నీ చిత్తశుద్ధితో తీసుకున్నాం. వాటిని నేరుగా ప్రజలముందే ఉంచుతున్నామన్న వైఎస్ జగన్‌
  • ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి, ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నదే మన ఉద్దేశం
  • మనం రాజీనామాలు ప్రకటించినప్పుడు, అవిశ్వాసం పెడతానన్నప్పుడు చంద్రబాబు ముందుకురాలేదన్న వైఎస్ జగన్‌
  • విధిలేని పరిస్థితుల్లో వారుకూడా అవిశ్వాసం పెట్టాల్సి వచ్చింది
  • ఏది ఏమైనా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒక నిర్ణయం విషయంలో ముందుకు వస్తే.. దానివల్ల వచ్చే ఒత్తిడి, తీవ్రత వేరేలా ఉంటుంది
  • ఎవరు ముందు, ఎవరు వెనక కన్నా.. ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే ముఖ్యమని అభిప్రాయపడ్డ వైఎస్ జగన్‌
  • అందుకే మనం రాజీనామాల నిర్ణయం ప్రకటించినప్పుడు కలిసి రావాలని చంద్రబాబును అడిగాం
  • అవిశ్వాసం ముందు వారు పెట్టినా మద్దతు ఇస్తామన్నాం, లేదంటే.. మనం పెట్టినా మద్దతు ఇవ్వాలని కోరాం
  • మన పోరాట ప్రణాళిక చాలా స్పష్టంగా ఉందన్న వైఎస్ జగన్‌
  • ఇప్పుడు కూడా రాజీనామాల విషయంలో కలిసి రావాలని టీడీపీని కోరుతున్నాం
  • ప్రత్యేక హోదాకోసం వైఎస్‌ఆర్‌సీపీ పోరాడుతున్న తీరుపై పార్లమెంటులో వివిధ పార్టీల తీరును వైఎస్‌ జగన్‌కు వివరించిన పార్టీ ఎంపీలు 
  • ఎత్తుగడలు, మీడియా మేనేజ్‌మెంట్లను నమ్ముకుని ఇరుకునపడ్డామన్న అభిప్రాయాన్ని వ్యక్తిగత సంభాషణల్లో టీడీపీ ఎంపీలు వెల్లడించారని వైఎస్ జగన్‌కు చెప్పిన ఎంపీలు
  • ‘‘ప్రత్యేక హోదా కోసం మీ నాయకుడు చక్కటి పోరాటాన్ని చేస్తున్నారంటూ...’’ అనేక పార్టీలకు చెందిన నాయకులు ప్రశంసించిన విషయాన్ని వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చిన నేతలు 
  • ‘‘మా నాయకుడు ఏదైనా ముక్కుసూటిగా చేస్తాడని, దాపరికం లేకుండా వ్యవహరిస్తాడన్న విషయాన్ని’’ ఆయా పార్టీలకు వివరించామన్న ఎంపీలు 
  • పార్లమెంటులో ఏ చోట చూసినా ప్రత్యేక హోదాపైనే చర్చ జరగుతుందని, మన పోరాటానికి ఇతర పార్టీల నుంచి చక్కటి మద్దతు వస్తుందని వైఎస్ జగన్‌కు వివరించిన ఎంపీలు

Advertisement
Advertisement