జగన్‌తోనే బీసీలకు న్యాయం | Sakshi
Sakshi News home page

జగన్‌తోనే బీసీలకు న్యాయం

Published Mon, Feb 26 2018 12:19 PM

ysrcp round table meeting in kurnool - Sakshi

కర్నూలు (టౌన్‌): తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితోనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ అధ్యయన కమిటీ కన్వీనర్, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. ఆదివారం కర్నూలులోని మెగాసిరి ఫంక్షన్‌ హాలులో బీసీ అధ్యయన కమిటీ రౌండ్‌ టేబుల్‌ సమావేశం కర్నూలు పార్లమెంట్‌ జిల్లా పరిధిలో నిర్వహించారు.  వివిధ కులాలకు చెందిన నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. దేశంలో అనేక కులాలు ఉండగా.. రాజ్యాంగం వీరికి కల్పించిన హక్కులు ఇప్పటికీ అందడం లేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాలనలో కులవృత్తులు నిర్వీర్యం అయ్యాయన్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు న్యాయం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని తమ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారన్నారు.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో బీసీ అధ్యయన కమిటీ రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహిస్తోందన్నారు. వివిద కులాల సమస్యలు నేరుగా తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వీటిపై మేధావులతో చర్చించి ప్రజాసంకల్ప యాత్ర ముగిసిన తరువాత జననేతకు నివేదిక రూపంలో సమర్పిస్తామన్నారు. త్వరలోనే విజయవాడలో బీసీ గర్జన సభ ఏర్పాటు చేసి అక్కడే డిక్లరేషన్‌ను ప్రతిపక్ష నేత ప్రకటిస్తారని చెప్పారు. ఈ డిక్లరేషన్‌ను వచ్చే 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు చేసి, నిధులు మంజూరు చేయడం లేదన్నారు. ఇంకెనాళ్లు బీసీలను మోసం చేస్తారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. అలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. త్వరలోనే బీసీలకు మంచి రోజులు రానున్నాయన్నారు.   మోసం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు తగిన శాస్తి తప్పదన్నారు. ఫెడరేషన్లకు రూ.23 కోట్లు ఇస్తున్నట్లు చెప్పి రూ. 3 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి సమావేశంలో మాట్లాడారు.

సుదీర్ఘ చర్చ..
రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో బీసీ సమస్యలపై అధ్యయన కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బీసీల సమస్యలను తెలుసుకున్నారు. వాటన్నింటినీ రికార్డు చేశారు.  సభ్యులు నర్సేగౌడ్, గుమ్మనూరు జయరాం, మారక్కగారి కృష్టన్న , రాగె పరశురాం, అవ్వారు ముసలయ్య, సుగుమంచి పల్లె రంగన్న, తొండమల్ల పుల్లయ్య, పల్లెపు వరప్రసాద్,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్,  పీఏసీ సభ్యులు డాక్టర్‌ మధుసూదన్, పార్టీ నాయకులు గురువాచారి, దుర్గారావు, ధనుంజయచారి, మురళీకృష్ణ, ప్రవీణ్, సత్యం యాదవ్‌ పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో చేరిక
కర్నూలు (టౌన్‌) : వైఎస్‌స్సార్‌సీలో పలువురు బీసీ సంఘాలకు చెందిన నాయకులు చేరారు. బీసీ కులాలకు ప్రాతినిధ్యం వహించిన కాళిదాస్‌ యాదవ్, సత్యనారయణ, రామచంద్రుడు, వై.రాఘవులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

ప్రభుత్వ పథకాలు అందడం లేదు
కర్నూలు సీక్యాంప్‌: ప్రభుత్వ పథకాలు అందక బీసీ విద్యార్థులు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కర్నూలు మండలం రేమట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు వినతిపత్రం అందజేశారు. టీడీపీ పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు.   పంట రుణం మాఫీ కాక.. గిట్టుబాటు ధర లభించక చాలా మంది బీసీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు. బీసీ విద్యార్థిని, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందక చదువు మధ్యలోనే ఆపేసుకుంటున్నారన్నారు. వాల్మీకి, కురువ ఫెడరేషన్లు ఏర్పాట్లు చేయాలన్నారు. 

Advertisement
Advertisement