పోరాటం ఉధృతం చేసిన వైఎస్సార్‌సీపీ | Sakshi
Sakshi News home page

పోరాటం ఉధృతం చేసిన వైఎస్సార్‌సీపీ

Published Fri, Apr 6 2018 9:34 AM

YSRCP Special Category Status Fight - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం పోరాడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తన ఆందోళనను మరింత ఉధృతం చేసింది. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు చేపట్టనున్న ఆమరణ దీక్షకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగబోతోంది. 6వ తేదీ(శుక్రవారం) సాయంత్రం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం గురువారం పిలుపునిచ్చింది. శనివారం నుంచి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఆదేశించింది. ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించింది.

ఢిల్లీకి చేరుకుంటున్న పార్టీ నేతలు
ప్రత్యేక హోదా కోసం పదవులను త్యాగం చేసి, ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్న ఎంపీలకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు అనేక మంది ఢిల్లీ తరలివచ్చారు. పార్టీ సీనియర్‌ నేతలు   సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్స సత్యనారాయణ, అనంత వెంకట్రామిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, డాక్టర్‌ అరుణ్‌కుమార్‌ తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఢిల్లీ చేరుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. హోదా సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా కూడా వివిధ మార్గాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోరాటాలను ఉధృతం చేయనున్నాయి.  

Advertisement
Advertisement