Sakshi News home page

అమ్మా.. అప్పుడే పెళ్లొద్దమ్మా..!

Published Mon, Jan 1 2018 11:08 AM

Child marriage foiled in Prakasam district - Sakshi

వెలిగండ్ల: జిల్లాలో బాల్య వివాహాలు ఏదోఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. పెద్దలు గుట్టుచప్పుడు కాకుండా వివాహ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఐసీడీఎస్, పోలీసు అధికారులు కొన్ని బాల్య వివాహాలను అడ్డుకుంటున్నా.. ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మార్పు రావడం లేదు. కొన్నిచోట్ల రాత్రికి రాత్రే పెళ్లిళ్లు జరిగిపోతున్నాయి. రాష్ట్రంలో బాల్య వివాహాలు నమోదు విషయంలో జిల్లా చెప్పుకోదగ్గ స్థానంలోనే ఉన్నట్లు అధికారులే చెబుతున్నారు. బాల్య వివాహాల గణాంకాలు ప్రమాద స్థాయికి చేరుకుంటున్నాయి. పేదరికం, నిరక్ష్యరాస్యత, చైతన్యం లేకపోవడం ప్రధాన కారణం. బాల్య వివాహాలను నిరోధించేందుకు నిరంతర ప్రచారం అవసరం. ముఖ్యంగా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు బాల్య వివాహాలపై అవగాహన కల్పించాలి. మతాల పెద్దలు, తల్లిదండ్రులకు బాల్య వివాహాలతో కలిగే నష్టాలు, వాటి చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

గణాంకాలు ఇలా.. 
జిల్లాలో 2014 నుంచి 2017 డిసెంబర్‌ వరకు 804 బాల్య వివాహాలను అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అడ్డుకున్నారు. 2014లో 237, 2015లో 274, 2016లో 249, 2017లో నేటి వరకు 44 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది వెలిగండ్ల ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని మూడు మండలాల్లో బాల్య వివాహాలను ఐసీడీఎస్‌ అధికారులు, పోలీస్‌ అధికారులు అడ్డుకున్నారు. వెలిగండ్ల మండలం కంకణంపాడులో అక్టోబర్‌లో బాల్యవివాహం జరుగుతోందని సమాచారం తెలియడంతో సీడీపీఓ బి.లక్ష్మీప్రసన్న, ఎస్‌ఐ పి.చౌడయ్యలు రాత్రి వేళ ఆ గ్రామానికి వెళ్లి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. 

ఈ నెల 19వ తేదీన మండలంలోని కొట్టాలపల్లిలో బాల్య వివాహం చేస్తున్నారని స్వయంగా ఓ మైనర్‌ 100 నంబర్‌కు కాల్‌ చేసి వివాహాన్ని ఆపాలని కోరడం విశేషం. స్పందించిన సీడీపీఓ బి. లక్ష్మీప్రసన్న, ఎస్‌ఐ పి.చౌడయ్యలు జరగబోయే బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. ఆ మైనర్‌ను ఒంగోలు బాలసదన్‌కు తరలించారు. ఈ ఏడాది సీఎస్‌పురం మండలం కె.అగ్రహారంలో ఒకే రోజు రెండు బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. హనుమంతునిపాడు హాజీపురంలో జరగబోయే బాల్య వివాహాన్ని నిలువరించగలిగారు. 

ఇవిగో..అనర్థాలు
 బాల్య వివాహాలు చేస్తే ముఖ్యంగా బాలికల విషయంలో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి.
 చిన్న వయసులోనే గర్భిణులు కావడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
 నెలలు నిండకముందే ప్రసవించే ప్రమాదం ఉంటుంది. 
 ప్రసవ సమయంలో మాతృ మరణాలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి.. 
వైకల్యంతో కూడిన శిశు జననాలు, మరణాలు జరగవచ్చు. 
మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
శారీరక ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. 
భయంతో, సిగ్గుతో చదువు మధ్యలో నిలిపేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిరక్ష్యరాస్యతే కారణం
బాల్య వివాహాలు జరిగేందుకు ముఖ్యకారణం నిరక్ష్యరాస్యత. కుటుంబ పరిస్థితులను ఆధారం చేసుకొని బాల్యవివాహాలు చేయడం పరిపాటైంది. తల్లిదండ్రుల్లో అభద్రతా భావాన్ని పోగొట్టాలి. ప్రజలను చైతన్యవంతులను చేసి బాల్యవివాహాలను నిరోధించేందుకు తగు చర్యలు చేపడుతున్నాం. 
– బి.లక్ష్మీప్రసన్న, సీడీపీఓ, వెలిగండ్ల 

Advertisement
Advertisement