సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలి | Sakshi
Sakshi News home page

సర్వే ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలి

Published Tue, Jan 23 2018 10:48 AM

collector vinay chand speech in Review meeting - Sakshi

ఒంగోలు టౌన్‌: ప్రజాసాధికార సర్వే (స్మార్ట్‌ పల్స్‌ సర్వే) ఆధారంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ ఆదేశించారు. ఇటీవల రెండు రోజుల పాటు సీఎం నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. సోమవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్‌ హాలులో జిల్లా అధికారులతో పలు కార్యక్రమాల గురించి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, మహిళా శిశు సంక్షేమం, వ్యవసాయ, కార్మిక, పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్లు తదితర సంక్షేమ పథకాలకు ప్రజాసాధికార సర్వే వివరాలు అనుసంధానం చేయాలని సూచించారు. ప్రజాసాధికార సర్వేకు సంబంధించి ఎక్కడైనా పెండింగ్‌లో ఉంటే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి 15 రోజుల్లోపు నమోదు పూర్తి చేయాలని, దీనిపై జాయింట్‌ కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. వచ్చే మార్చి నాటికి జిల్లా కేంద్రం మొదలుకొని క్షేత్ర స్థాయి వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీసు విధానం తప్పనిసరిగా అమలులోకి రావాలని ఆదేశించారు. ఇందుకు నోడల్‌ అధికారిగా జాయింట్‌ కలెక్టర్‌ వ్యవహరిస్తూ ప్రతివారం సమీక్షిస్తూ ఉండాలని పేర్కొన్నారు.

రానున్న రెండు నెలల్లో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున నైపుణ్యాభివృద్ధిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారీగా జాబ్‌ మేళాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీల్లో తారు రోడ్లు నిర్మించాలని చెప్పారు. గ్రామాల నుంచి ప్రధాన రహదారులకు రోడ్లు వేయాలని ఆదేశించారు. రానున్న రెండు నెలల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే పాడి పశువులను స్థానికంగా కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాలన్నారు.  ఆక్వా రంగంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలన్నారు. చేనేత క్లస్టర్లు, ప్రయోగశాలలకు స్థలాలను జాయింట్‌ కలెక్టర్, ఆర్‌డీఓలు, తహసీల్దార్లతో కలిసి 15రోజుల్లోపు ఎంపిక చేయాలన్నారు. గురుకుల పాఠశాలలు, కాపు, ఉర్దూ, బీసీ, క్రిస్టియన్, మైనార్టీ భవనాలకు స్థలాలు గుర్తించాలని ఆదేశించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రేషన్‌ దుకాణాల డీలర్లను భర్తీ చేయకుంటే చార్జ్‌మెమో జారీ చేస్తానని హెచ్చరించారు. జన్మభూమి–మాఊరులో వచ్చిన అర్జీలన్నింటినీ నెలాఖరులోగా పరిష్కరించాలని సూచించారు. 

గణతంత్ర వేడుకలు నిర్వహించాలి
స్థానిక పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ నెల 26న గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర సంక్షేమ శాఖల ద్వారా ఆరువేల మందికి తగ్గకుండా యూనిట్లు ఇచ్చేందుకు మెగా రుణమేళా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వాతంత్య్ర సమరయోధులను మర్యాద పూర్వకంగా ఆహ్వానించాలన్నారు. ఈ నెల 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా జరపాలన్నారు. ఈ నెల 27వ తేదీన దేశంలోనే తొలిసారిగా చీరాలలో మహిళల అక్రమ రవాణాపై జరగనున్న అవగాహన సదస్సులో సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు న్యాయమూర్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌–2 మార్కండేయులు, డీఆర్‌ఓ డాక్టర్‌ ఎన్‌. ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement