రెడీ.. వన్‌..టూ..త్రీ స్టార్ట్‌! | Sakshi
Sakshi News home page

రెడీ.. వన్‌..టూ..త్రీ స్టార్ట్‌!

Published Wed, Jan 3 2018 10:29 AM

officials warning to pensioners in village - Sakshi

ప్రచార పిచ్చి పీక్‌ స్టేజ్‌కు వెళ్లినట్లుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసేది గోరంత.. చూపించేది కొండంతలా మారింది. ఏ పని చేసినా పబ్లిసిటీ స్టంట్‌గానే మారింది. ఈదఫా జన్మభూమి ఎపిసోడ్‌లో సామాజిక పింఛన్లు అందుకొనే వృద్ధులు, వికలాంగులు, వితంతువులనూ నటులుగా చేర్చారు. ‘దర్శిలో సీఎంగారి సభ అంతా టీవీల్లో చూస్తేనే పింఛన్‌ ఇచ్చేది’ అంటూ అధికారులు.. పింఛన్‌ సొమ్ముకోసం పంచాయతీ కార్యాలయాల వద్దకు మంగళవారం వచ్చినవారికి షరతు విధించారు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల దాకా వాళ్ల డబ్బుమీద చేతులు పెట్టిఎటూ కదలనివ్వలేదు.

గిద్దలూరు రూరల్‌:  మండలంలో కె.ఎస్‌.పల్లి పంచాయతీ పరిధిలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పెన్షన్ల కోసం మంగళవారం పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు ఎంతకూ పెన్షన్‌ పంపిణీ చేయకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

పైగా దర్శిలో మంగళవారం చేపట్టిన సీఎం చంద్రబాబు కార్యక్రమాన్ని టీవీలో చూడాలని కార్యక్రమం అంతా పూర్తిగా చూస్తేనే పెన్షన్ల పంపిణీ చేస్తామంటు అధికారులు చెప్పారు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులంతా టీవీ చూస్తు ఉండిపోయారు. పెన్షన్‌  కోసం దిగువమెట్ట, దిగువమెట్ట తండా, పెద్ద చెరువు, ఉప్పలపాడు గ్రామాల నుంచి వచ్చినవారితో కె.ఎస్‌.పల్లి పంచాయతీ కార్యాలయం నిండిపోయింది. దూర ప్రాంతాల నుంచి డబ్బులు ఖర్చు చేసుకొని ఆటోల్లో వచ్చినవారు తిండీ తిప్పలు లేకుండా సాయంత్రం వరకు ఉండిపోయారు. ఇష్టం లేకున్నా బలవంతంగా కూర్చోబెట్టి టీవీ చూడమంటే ఏం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి వద్ద పనులు మానుకుని కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉండాలంటే ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అధికారులు మాత్రం వేలిముద్రలు వేసే యంత్రం పనిచేయకపోవడంతో పెన్షన్లను పంపిణీ చేయలేదని.. మెషీన్‌ను గిద్దలూరుకు పంపామని వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని తెలిపారు.

తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చోవాలా?
దిగువమెట్ట నుంచి ఉదయం 9 గంటలకు వచ్చాను. సాయంత్రం 5 గంటలవుతున్నా పెన్షన్‌ ఇవ్వలేదు. ఈ రోజు ఇవ్వమని చెబితే ఇంటికి వెళుతాము కదా! ఆ టీవీలో సీఎం కార్యక్రమం వస్తుంది ఇక్కడే కూర్చోమంటున్నారు. తిండి తిప్పలు లేకుండా ఎలా కూర్చోవాలి?  – తిరుపతయ్య

చార్జీలు పెట్టుకుని వచ్చా
దిగువమెట్ట నుంచి ఉదయం ఆటోలో వచ్చాను. గంటల తరబడి ఇక్కడే వేచి ఉండమంటే ఎలా ఉండాలి. మా పెన్షన్‌ డబ్బులు మాకు ఇస్తే ఇంటికి వెళ్లి పనులు చేసుకుంటాం. – రామలక్ష్మమ్మబాయి

ఎప్పుడిస్తారో ఏందో!
చీరాల టౌన్‌: ఎన్టీఆర్‌ భరోసా పథకంలో భాగంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతినెలా ఒకటో తేదీన అందాల్సిన పింఛన్‌ కోసం తిప్పలు పడుతున్నారు. జీవిత చరమాంకంలో ఆర్థిక తోడ్పాటునందించేందుకు ప్రవేశపెట్టిన  పింఛన్‌ పథకాన్ని పాలకులు, అధికారులు సక్రమంగా అమలు చేయకపోవడంతో పంచాయతీ కార్యాలయాల వద్ద ఒకటో తేదీ నుంచి వేచి చూడాల్సి వస్తోంది.

ఆన్‌లైన్‌ కష్టాలు..
ఎన్నో రకాలుగా మారుతూ వస్తోన్న పింఛన్‌ పంపిణీ వ్యవహారం ప్రస్తుతం ఆన్‌లైన్‌ సమస్యతో ముందుకు సాగడంలేదు. ఉదయం 7 గంటల నుంచి ఎదురు చూస్తున్నా ఆన్‌లైన్‌ పనిచేయడం లేదంటూ అధికారులు లబ్ధిదారులతో బుకాయిస్తున్నారు. చీరాల మండంలోని 15 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 5 గ్రామాల్లోనే సక్రమంగా పింఛన్‌ పంపిణీ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పింఛన్‌దారులు ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కనీసం బిళ్లలు కూడా కొనుక్కోలేని పరిస్థితి దాపురించింది. పింఛన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఏప్పుడు ప్రారంభిస్తారో కనీసం ఆ గ్రామాల్లో కూడా ప్రచారం చేయకపోవటంతో రెండు మూడు రోజులుగా లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Advertisement
Advertisement