నేడు రాష్ట్రవ్యాప్తంగా 5కే రన్‌ | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్రవ్యాప్తంగా 5కే రన్‌

Published Sun, Jan 7 2018 2:00 AM

Today is the statewide 5 km run - Sakshi

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారో లేదో పరుగెత్తి పరీక్షించుకోవాలని, అందుకోసం జన్మభూమిలో భాగంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో 5కే రన్‌ నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. దీనిలో అందరూ పాల్గొని పరుగెత్తాలని సూచించారు. 5 కిలోమీటర్లు సునాయాసంగా పరుగెత్తితే ఆరోగ్య సమస్యలు లేనట్లని, పరుగు తీయకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు భావించాలని తెలిపారు. దీనిలో జర్నలిస్టులు ఏమీ మినహాయింపు కాదన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోడూరుపాడు గ్రామంలో శనివారం జరిగిన జన్మభూమి–మా ఊరు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... గడిచిన మూడున్నరేళ్లలో అనేక రకాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని శ్మశానాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. 

దుర్గ గుడి ఈవోపై బదిలీ వేటు
విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) సూర్యకుమారిపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇన్‌చార్జి ఈవోగా దేవాదాయ శాఖ కమిషనర్‌ అనూరాధను నియమిస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరు 26వ తేదీన గుడిలో తాంత్రిక పూజలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు, ఆ శాఖ కమిషనర్‌ అనూరాధ, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌ శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

దేవాదాయ శాఖ అదనపు కమిషనర్‌ రఘునాథ్‌ నేతృత్వంలోని నిజనిర్ధారణ కమిటీ గుర్తించిన అంశాలతో ముఖ్యమంత్రికి నివేదికను అందజేశారు. దుర్గ గుడిలో తాంత్రిక పూçజల వ్యవహారంపై చర్చించారు. అనంతరం మంత్రి మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడారు. ఈవోను తప్పించి, తాంత్రిక పూజల ఆరోపణలపై విచారణ కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. పరిపాలన పరమైన లోపాల కారణంగానే ఈవో తప్పించామని. తాంత్రిక పూజలు జరగలేదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. 

Advertisement
Advertisement