దేవుడిని నేరుగా కలవాలనుకుంటున్నారా!?

10 Sep, 2018 13:33 IST|Sakshi

‘కొందరికి దేవుడు కలలో కన్పిస్తాడు. మరికొందరికి ప్రతీచోటా ఆయన పిలుపే విన్పిస్తుంది. అయితే ఈ రెండు కాకుండా నేరుగా దేవుడిని చూడాలంటే మాత్రం డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఆయనకి మెసేజ్‌ పెట్టేస్తే చాలు. ఇక డైరెక్ట్‌గా దైవదర్శనమే’ ఇదీ ప్రశాంతంగా ఉండాల్సిన పవిత్ర స్థలంలో కూడా స్మార్ట్‌ ఫోన్ల గోలతో, ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్న పౌరులపై ఓ పార్శీ ప్రబోధకుడి సెటైర్‌.

అవును.. చవక ధరలకే స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులోకి వస్తోన్న నేపథ్యంలో ధనిక- పేద, చిన్నా- పెద్దా భేదాల్లేకుండా దాదాపు ప్రతీ ఒక్కరు స్మార్ట్‌ ఫోన్‌ కలిగి ఉండటం సాధారణమైపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్‌ చూసుకోవడం, చోటుతో సంబంధం లేకుండా ఫోన్‌ను వాడుతూ బానిసలుగా మారుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలా ప్రశాంతతో పాటు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు. ఇటువంటి వారిని ఉద్దేశించి ఓ పార్శీ ప్రబోధకుడు ఫైర్‌ టెంపుల్‌ ముందు అంటించిన ప్రకటన నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఆ ప్రకటనలో ఏముందంటే... ‘మీరు ఈ ఫైర్‌ టెంపుల్‌(జొరాస్ట్రియన్ల ప్రార్థనా స్థలం)లోకి ప్రవేశించినట్లయితే ఆ దేవుడి మహిమలు వింటారు. లేదు ఆయన నుంచి పిలుపు వినాలని భావిస్తే అది మాత్రం మీ ఫోన్‌ ద్వారానే సాధ్యం. మీ మొబైల్‌ ఫోన్లు ఆఫ్‌ చేసినందుకు ధన్యవాదాలు. దేవుడితో మాట్లాడాలనుకుంటే ప్రశాంత వాతావరణం ఉన్న ఇలాంటి చోటుకి రండి. లేదు ఆయనను నేరుగా కలవాలని భావిస్తే మాత్రం.. డ్రైవింగ్‌ చేస్తున్న సమమయంలో ఆయనకు ఒక మెసేజ్‌ పెట్టండి ’ అంటూ ఫైర్‌ టెంపుల్‌ ముందు పార్శీ ప్రబోధకుడు ఓ కాగితం అంటించారు. కనీసం ఇది చూస్తేనైనా టెంపుల్‌లోకి ప్రవేశించే సమయంలో ఫోన్‌ ఆఫ్‌ చేస్తారని ఆయన భావన. అయితే ఈ ప్రకటన కేవలం ఏ ఒక్క మతస్థులకో పరిమితం కాదని.. డ్రైవింగ్‌లో ఫోన్‌ వాడే వారి ప్రతీ ఒక్కరికి వర్తిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా