ఇతర భాషా చిత్రాలను నిలువరించండి | Sakshi
Sakshi News home page

ఇతర భాషా చిత్రాలను నిలువరించండి

Published Mon, Apr 2 2018 7:58 AM

Kollywood strike will continue until our demands are met, says Vishal - Sakshi

తమిళసినిమా: తమిళ నిర్మాతల మండలి సమ్మెకు ఇతర భాషా చిత్రాలు గండికొడుతున్నాయా? ఎగ్జిబిటర్లు దిగిరాకపోవడానికి అవికారణం అవుతున్నాయా?  ఇతర భాషా చిత్రాల విడుదల తమిళ నిర్మాతలను కలవరపెడుతున్నాయా? వాటిని నిలువరించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఈ ప్రశ్నలన్నింటికి కోలీవుడ్‌లో అవుననే బదులే వస్తోంది.

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు నిర్మాతల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారంటూ వాటిని తగ్గించే విధంగా ఆ సంస్థల అధినేతలతో నిర్మాతలమండలి జపిన చర్చలు విఫలం కావడంతో మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త చిత్రాల విడుదలను నిలిపి వస్తూ నిర్ణయం తీసుకున్న నిర్మాతల మండలి అదే నెల 16 నుంచి షూటింగ్‌లతో పాటు సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సమ్మెకు థియేటర్ల యాజమాన్యం సహకరించలేదు సరికదా టికెట్ల విక్రయం కంప్యూటరైజ్‌ చేయాలన్న డిమాండ్, ఆన్‌లైన్‌ టికెట్‌ రుసుమును తగ్గించాలి లాంటి విషయాల్లో నిర్మాతల మండలికి, థియేటర్ల సంఘంకు మధ్య జరిగిన చర్చలు విఫలం  అయ్యాయి. దీంతో సమ్మె కొనసాగుతోంది.

అయితే తమిళ చిత్రాలు కొత్తవి విడుదల కాకపోయినా, హింది, ఇంగ్లిష్, తెలుగు, మలయాళం,కన్నడం వంటి ఇతర భాషా చిత్రాలు ముమ్మరంగా తమిళనాడులో విడుదలవుతున్నాయి. దీంతో చాలా వరకు థియేటర్లకు ఫీడింగ్‌ అయిపోతోంది. కొత్త తమిళ చిత్రాల విడుదల కాకపోయినా థియేటర్ల యాజమాన్యానికి ఆ కొరత పెద్దగా కనిపించడం లేదు. కాబట్టి నిర్మాతల మండలి డిమాండ్లకు వారు దిగి రావడం లేదనే భావన కోలీవుడ్‌లో వ్యక్తం అవుతోంది.

ఇదిలా ఉంటే శుక్రవారం విడుదలైన తెలుగు చిత్రం రంగస్థలం ఒక తమిళ స్టార్‌ హీరో చిత్రానికి దీటుగా తమిళనాడులో అత్యధిక థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది. ఇది తమిళ నిర్మాతలకు షాక్‌ కలిగించే పరిస్థితి. దీంతో ఇతర భాషా చిత్రాల విడుదలను అడ్డుకోవాలన్న ఒత్తిడి నిర్మాతలమండలి అధ్యక్షుడు విశాల్‌పై పెరుగుతోంది. దీంతో విశాల్‌ కూడా ఇతరభాషా నిర్మాతల సంఘాల ప్రతినిధులతో వారి చిత్రాలను తమిళనాడులో విడుదల చేయకుండా తమ సమ్మె మద్దతు పలకాల్సిందిగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మరి ఈయన ప్రయత్నం ఎంతవరకూ ఫలిస్తుందో చూడాలి.

Advertisement
Advertisement