Sakshi News home page

పరువు ‘బంగ్లా’ఖాతంలో!

Published Fri, Jun 19 2015 1:45 AM

పరువు ‘బంగ్లా’ఖాతంలో!

    చిత్తుగా ఓడిన భారత్
    79 పరుగులతో బంగ్లాదేశ్ ఘనవిజయం
    చెలరేగిన ముస్తఫిజుర్
    రాణించిన తమీమ్, సర్కార్

 
 బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓడిపోవడం కొత్తేం కాదు... ఇది మొదటిసారేం కాదు... కాకపోతే ఇప్పుడు ఓడిపోవడం దారుణమైన పరాభవం. మూడు నెలల క్రితం ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో అంపైర్ ‘నోబాల్’ ఇవ్వకుంటే భారత్‌పై గెలిచేవాళ్లమని ఇన్నాళ్లూ ఆ జట్టు చెబుతూ వచ్చింది. ఆ మ్యాచ్ తర్వాత భారత్ ఎదురైన తొలిసారే కసికసిగా ఆడింది. అలా ఇలా కాదు... తమ చరిత్రలోనే భారత్‌పై అతి పెద్ద విజయాన్ని సాధించింది. 19 ఏళ్ల కొత్త కుర్రాడు... ముస్తఫిజుర్ అరంగేట్రంలోనే ఐదు వికెట్లతో చెలరేగి బంగ్లాదేశ్‌లో పండగ వాతావరణాన్ని సృష్టించాడు.
 
 మిర్పూర్: ఇటీవల స్వదేశంలో బంగ్లాదేశ్ ఆటతీరును చూసిన తర్వాత ఆ జట్టును టీమిండియా తక్కువగా అంచనా వేయలేదు. అందుకే ఈ సారి పూర్తి స్థాయి జట్టుతో సిరీస్‌కు సిద్ధమైంది. కానీ ఫలితం మాత్రం రివర్స్ అయింది. బంగ్లా అద్భుత ప్రదర్శన ముందు ధోని సేన తలవంచింది. గురువారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 79 పరుగుల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 49.4 ఓవర్లలో 307 పరుగులకు ఆలౌటైంది. తమీమ్ ఇక్బాల్ (62 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (40 బంతుల్లో 54; 8 ఫోర్లు, 1 సిక్స్), షకీబ్ అల్ హసన్ (68 బంతుల్లో 52; 3 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో అశ్విన్‌కు 3 వికెట్లు పడ్డాయి. భారత్ 46 ఓవర్లలో 228 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (68 బంతుల్లో 63; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా, రైనా (40 బంతుల్లో 40; 1 ఫోర్, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆడిన తొలి మ్యాచ్‌లోనే చెలరేగి ముస్తఫిజుర్ (5/50) సంచలన బౌలింగ్ నమోదు చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఇక్కడే ఆదివారం జరుగుతుంది.

 చెలరేగిన ఓపెనర్లు: బంగ్లాదేశ్ ఓపెనర్లు సౌమ్య, తమీమ్ తొలి వికెట్‌కు 102 పరుగులు జోడించి అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. 38 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న సౌమ్య, తమీమ్‌తో సమన్వయ లోపంతో రనౌట్ కావడంతో బంగ్లా తొలి వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో వర్షం కారణంగా దాదాపు గంట పాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. విరామం తర్వాత ఒక్కసారిగా అశ్విన్ విజృంభించాడు. ఫలితంగా 23 పరుగుల వ్యవధిలో బంగ్లా 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో షకీబ్, షబ్బీర్ (44 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఐదో వికెట్‌కు 83 పరుగులు జత చేసిన తర్వాత షబ్బీర్‌ను అవుట్ చేసిన జడేజా ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. కొద్ది సేపటికే షకీబ్ కూడా వెనుదిరగడంతో బంగ్లా జోరుకు బ్రేక్ పడింది. నాసిర్ హొస్సేన్ (27 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు చివర్లో మొర్తజా (21) వేగంగా ఆడటంతో బంగ్లా స్కోరు 300 పరుగులు దాటింది. భారత్‌పై బంగ్లాదేశ్‌కు ఇదే అత్యధిక స్కోరు.

 రోహిత్ మినహా అందరూ విఫలం: భారత్ ఇన్నింగ్స్‌ను రోహిత్, ధావన్ (38 బంతుల్లో 30; 3 ఫోర్లు)  నెమ్మదిగా మొదలు పెట్టినా క్రమంగా వేగం పెంచారు. నిలకడగా ఆడిన రోహిత్ 53 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, మరో వైపు ధావన్ తడబడ్డాడు. 13, 15 పరుగుల వద్ద రెండు సార్లు కీపర్ ముష్ఫికర్ సునాయాస క్యాచ్‌లు వదిలేయడంతో బతికిపోయిన ధావన్... దానిని ఉపయోగించుకోలేక కొద్ది సేపటికి వెనుదిరిగాడు. ఆ వెంటనే కోహ్లి (1) కూడా అవుట్ కావడంతో భారత్‌కు మరో షాక్ తగిలింది. కోలుకునే లోపే కొత్త కుర్రాడు ముస్తఫిజుర్... రోహిత్‌ను అవుట్ చేసి బంగ్లా శిబిరంలో ఆనందం నింపాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు శ్రమించిన రహానే (9), ఆ వెంటనే ధోని (5) కూడా పెవిలియన్ చేరడంతో భారత్ కష్టాలు మరింత పెరిగాయి. ఈ దశలో రైనా, జడేజా (42 బంతుల్లో 32; 2 ఫోర్లు) కలిసి జాగ్రత్తగా ఆడారు. ఆరో వికెట్‌కు వీరిద్దరు 60 పరుగులు జత చేసిన అనంతరం రైనా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఎవరూ పోరాడలేకపోయారు.
 
 స్కోరు వివరాలు
 బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 60; సర్కార్ (రనౌట్) 54; దాస్ (ఎల్బీ) (బి) అశ్విన్ 8; ముష్ఫికర్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 14; షకీబ్ (సి) జడేజా (బి) ఉమేశ్ 52; షబ్బీర్ (బి) జడేజా 41; హొస్సేన్ (సి) జడేజా (బి) ఉమేశ్ 34; మొర్తజా (సి) రోహిత్ (బి) మోహిత్ 21; రూబెల్ (సి) మోహిత్ (బి) భువనేశ్వర్ 4; తస్కీన్ (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 2; ముస్తఫిజుర్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 307.

 వికెట్ల పతనం: 1-102; 2-123; 3-129; 4-146; 5-229; 6-267; 7-282; 8-286; 9-298; 10-307.
 బౌలింగ్: భువనేశ్వర్ 7-0-37-2; ఉమేశ్ 8-0-58-2; అశ్విన్ 10-0-51-3; మోహిత్ 4.4-0-53-1; రైనా 10-0-40-0; జడేజా 8-0-48-1; కోహ్లి 2-0-12-0.
 
 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మొర్తజా (బి) ముస్తఫిజుర్ 63; ధావన్ (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 30; కోహ్లి (సి) ముష్ఫికర్ (బి) తస్కీన్ 1; రహానే (సి) హొస్సేన్ (బి) ముస్తఫిజుర్ 9; రైనా (బి) ముస్తఫిజుర్ 40; ధోని (సి) ముష్ఫికర్ (బి) షకీబ్ 5; జడేజా (సి) సర్కార్ (బి) ముస్తఫిజుర్ 32; అశ్విన్ (సి) ముష్ఫికర్ (బి) ముస్తఫిజుర్ 0; భువనేశ్వర్ నాటౌట్ 25; మోహిత్ (సి) ముష్ఫికర్ (బి) మొర్తజా 11; ఉమేశ్ (ఎల్బీ) (బి) షకీబ్ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (46 ఓవర్లలో ఆలౌట్) 228.
 
 వికెట్ల పతనం: 1-95; 2-101; 3-105; 4-115; 5-128; 6-188; 7-188; 8-195; 9-219; 10-228.
 బౌలింగ్: ముస్తఫిజుర్ 9.2-1-50-5; తస్కీన్ 6-1-21-2; మొర్తజా 10-0-53-1; రూబెల్ 6-0-36-0; హొస్సేన్ 6.4-0-31-0; షకీబ్ 8-0-33-2.

Advertisement

తప్పక చదవండి

Advertisement